- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ శాఖ కోసం పోటీ పడుతున్న మంత్రులు.. ఎవరికి ఇవ్వాలనే దానిపై హైకమాండ్‌తో CM రేవంత్ చర్చలు!
కాంగ్రెస్ హైకమాండ్ సూచనలు, సలహాల మేరకు ముగ్గురు కొత్త మంత్రులకు సీఎం రేవంత్ శాఖలు కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ హైకమాండ్ సూచనలు, సలహాల మేరకు ముగ్గురు కొత్త మంత్రులకు సీఎం రేవంత్ శాఖలు కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్నది. అందుకే ఆయన ఉన్న పళంగా ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలు కేసీ వేణుగోపాల్‌తో మంతనాలు జరిపినట్టు టాక్. తన వద్ద ఉన్న శాఖల వివరాలను సైతం సీఎం రేవంత్ పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలుస్తున్నది. అలాగే కొందరు పాత మంత్రులు చాలా కాలంగా తమ వద్ద ఉన్న శాఖలను తొలగించి, కొత్త శాఖలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
నేడు లేదా రేపు కొత్త మంత్రులకు శాఖలు
సాధారణంగా ప్రమాణ స్వీకారం చేసిన నాలుగైదు గంటలలోపు కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ గవర్నర్ గెజిట్ విడుదల చేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం శాఖల కేటాయింపు ఆలస్యం అవుతున్నది. అందుకు ప్రధాన కారణం కొత్త మంత్రులకు ఏఏ శాఖలు ఇవ్వాలనే అంశంపై అధిష్టానం జోక్యం చేసుకుందని టాక్. అందుకే సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లి కేసీ వేణుగోపాల్, ఖర్గేతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం సీఎం వద్ద హోం, మున్సిపల్, విద్యా, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, గిరిజన వెల్ఫేర్, మైనింగ్, కార్మిక, పశుసంవర్ధక, యువజన సర్వీసులు, కమర్షియల్ టాక్స్, న్యాయ శాఖలు ఉన్నాయి. ఇందులో ఏ శాఖ ఎవరికి ఇవ్వాలనే అంశంపై ఆయన ఇరువురితో మాట్లాడినట్లు తెలుస్తున్నది. అలాగే సీఎం రేవంత్ ప్రపోజల్స్‌ను సైతం హైకమాండ్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఢిల్లీ టూర్‌లో శాఖల కేటాయింపుపై తుది నిర్ణయం జరిగితే మంగళ లేదా బుధవారంలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
హోంశాఖపై పాత మంత్రుల నజర్
పాత మంత్రుల్లో కొందరు సీనియర్లు, కొంతకాలంగా తమ వద్ద ఉన్న శాఖలను తొలగించి కీలకమైన హోంశాఖ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ జాబితాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అలాగే మరికొందరు మంత్రులు సీఎం వద్ద ఉన్న మున్సిపల్ శాఖను తమకు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో కేసీ వేణుగోపాల్, ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి మధ్య పాత మంత్రుల శాఖల్లో మార్పులు, చేర్పులపై చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఫోర్ట్ ఫోలియోస్ మార్పులు చేయడం వల్ల తలెత్తే లాభనష్టాల పైనా వారు ఆరా తీసినట్లు తెలిసింది. కొందరి శాఖలను మార్చితే మిగతా మంత్రుల నుంచి అసంతృప్తి వచ్చే ప్రమాదం ఉంటుదేమోనని అనుమానం వ్యక్తమైనట్లు సమాచారం.
కేబినెట్ ప్రక్షాళన సమయంలో అవకాశం!
మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేం సాగర్ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి విషయంలో న్యాయం చేయాలనే అంశంపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. ఈ నలుగురికి స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగే కేబినెట్ ప్రక్షాళన సమయంలో న్యాయం చేస్తామనే హామీని అధిష్టానం ఇచ్చినట్లు సమాచారం. అందుకే బాధిత ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని బహిర్గతం చేయలేదని ప్రచారం జరుగుతున్నది.
నేడు ఖర్గేతో సీఎం రేవంత్ సమావేశం
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గేతో మంగళవారం CM రేవంత్ సమావేశం కానున్నారు. మంత్రుల శాఖల మార్పులు, చేర్పుల విషయంపై ఆయనతో చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం ఆయన ఆమోదంతో శాఖలను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీనితో పాటుగా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర వాటి గురించి చర్చించనున్నట్లుగా తెలిసింది.






