ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో రెండేళ్ల ఇంటర్మీడియట్ జనరల్, వొకేషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అభిలాష అభినవ్ ప్రకటించారు.

ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రెండేళ్ల ఇంటర్మీడియట్ జనరల్, వొకేషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అభిలాష అభినవ్ ప్రకటించారు. రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్, రెసిడెన్షియల్, వెల్ఫేర్, మైనారిటీ, కేజీబీవీ, మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీలు, కాంపోజిట్ డిగ్రీ కాలేజీలలో జనరల్, వొకేషనల్ కోర్సుల అడ్మిషన్లు ఈ షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు. బోర్డు విడుదల చేసిన ప్రకటన ప్రకారం మే 8 నుండి తొలివిడత అడ్మిషన్లు ప్రారంభం కానుండగా, జూన్ 1 నుండి ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు అవసరమైన సర్టిఫికెట్లను ముందుగానే సిద్దం చేసుకుని, నిర్ణీత గడువులోపు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది. జూన్ 1 నుండి తరగతులు ప్రారంభం కానుండడంతో చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే అడ్మిషన్ తీసుకోవడం మంచిదని ఇంటర్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు.

అడ్మిషన్ షెడ్యూల్:

అడ్మిషన్ల ప్రారంభం (మొదటి విడత): మే 8

దరఖాస్తులకు చివరి తేదీ: మే 31

తరగతుల ప్రారంభం: జూన్ 1 న

మొదటి విడత అడ్మిషన్ల ముగింపు: జూన్ 30

ప్రవేశాల నిబంధనలు:

ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా తాత్కాలిక ప్రవేశాలు పొందవచ్చు. అయితే, ఒరిజినల్ ఎస్ఎస్‌సీ సర్టిఫికేట్, టీసీ సమర్పించిన తర్వాతే అడ్మిషన్ ఖరారు అవుతుంది. ప్రవేశాలు కేవలం విద్యార్థి సాధించిన జీపీఏ, సబ్జెక్టుల వారీగా గ్రేడ్ పాయింట్ల ఆధారంగానే జరగాలి. ప్రవేశాల కోసం ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది. అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ సంఖ్యను సమర్పించాలి. ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా విద్యార్థులు తల్లిదండ్రులు తప్పనిసరిగా 'యాంటీ-డ్రగ్ అఫిడవిట్' సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రవేశాల్లో రిజర్వేషన్లు పాటించాలని ప్రిన్సిపాల్‌లను ఆదేశించారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం సీట్లు కేటాయించారు. ప్రత్యేక కళాశాలలు లేని చోట బాలికల కోసం 33.33 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.

యాజమాన్యాలకు సూచనలు:

ప్రైవేట్ కళాశాలలు తప్పుడు ప్రకటనలు ఇవ్వకూడదని, అనుమతించిన సీట్ల వివరాలను ప్రతిరోజూ నోటీసు బోర్డులో ప్రదర్శించాలని బోర్డు స్పష్టం చేసింది. విదేశీ విద్యార్థులు చేరినట్లయితే 24 గంటల్లోగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి. విద్యార్థులు కేవలం బోర్డు గుర్తించిన అఫిలియేటెడ్ కళాశాలల్లోనే చేరాలని, ఆ జాబితా బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని సూచించారు. అనుమతించిన సెక్షన్లలోనే అడ్మిషన్లు చేపట్టాలి. ఒక్కో సెక్షన్లో గరిష్టంగా 88 మంది విద్యార్థులకే అనుమతి. నిలిపివేసిన కోర్సుల్లో అడ్మిషన్లు చేపట్టరాదు. అదనపు సెక్షన్లు ప్రారంభించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. నిబంధనలు, ఉల్లంఘిస్తే జరిమానాలు, అనుబంధ గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Next Story