439 ఎకరాల భూములపై అక్రమ నిషేధాజ్ఞలు! అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-06 02:51:50  IST  )

ధరణి పోర్టల్ వచ్చాక హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో పట్టా భూములపై అక్రమ నిషేధాజ్ఞలు కొనసాగాయి.

439 ఎకరాల భూములపై అక్రమ నిషేధాజ్ఞలు! అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్ వచ్చాక హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో పట్టా భూములపై అక్రమ నిషేధాజ్ఞలు కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా కేశంపేట, గండిపేట, శంషాబాద్, కొత్తూరు, నందిగామ, కందుకూరు, ఇబ్రహింపట్నం, మహేశ్వరం తదితర మండలాల్లో తమ భూములను అన్యాయంగా పీవోబీ జాబితాలో పెట్టారంటూ సామాన్య రైతులు గగ్గోలు పెట్టారు. అయితే భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత కూడా అధికారుల పనితీరు మారలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లి (ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కనే) సర్వే నం.127 నుంచి 173, 263 నుంచి 286 వరకు మొత్తం 439.15 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టాలంటూ తహసీల్దార్ కె.వెంకారెడ్డి కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపడం రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కొందరు అధికారులు సొంత నిర్ణయాలను అమలు చేస్తున్నారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.

కలెక్టర్ ఆదేశాల మేరకేనా?

గోపన్ పల్లిలోని 439.15 ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టించాలంటూ శేరిలింగంపల్లి తహశీల్దార్ వెంకారెడ్డి లేఖ నం.బి/1342/2025, తేదీ.3.3.2025 ద్వారా కలెక్టర్ కు రాశారు. రెఫరెన్స్ లో రంగారెడ్డి కలెక్టర్ ఆదేశాల మేరకు అని మాత్రమే ఉన్నది. నిజానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు ఉన్నా రెఫరెన్స్ లో పేర్కొంటారు. లేఖలో పేర్కొన్నట్లుగా ఈ ల్యాండ్ లో టీజీఐఐసీ ద్వారా ఐటీ పార్కు, సంబంధిత ప్రాజెక్టులు చేపట్టనున్నారు. అందుకే సెక్షన్ 22 ఎ సబ్ సెక్షన్ 1, అండర్ క్లాజ్ ఎ ప్రకారం ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలన్నారు. అదే నిజమైతే కనీసం టీజీఐఐసీ రిక్వెస్ట్ లేఖనైనా ఉండాలి. భూ సేకరణ చేసేటప్పుడు డ్రాఫ్ట్, నోటిఫికేషన్ విడుదల చేస్తారు. పట్టాదారులకు నోటీసులు జారీ చేయడం, వారి నుంచి కాన్సెంట్ తీసుకోవడం వంటి ప్రక్రియ పూర్తి చేయాలి.

ఇలాంటివేమీ లేకుండానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కనే ఉన్న ఈ భూములపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తుండడం గమనార్హం. మొత్తం 72 సర్వే నంబర్లలోని ఈ ల్యాండ్ లో వేలాది సేల్ డీడ్స్ అయ్యాయి. ప్లాట్లుగా కూడా వేలాది మంది కొనుగోలు చేశారు. అలాగే ఎకరం, రెండెకరాల వంతున పెద్ద వాళ్లు కూడా కొనుగోలు చేశారు. ఇప్పుడీ భూ సేకరణ పేరిట పీవోబీలో నమోదు చేయడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ప్రభుత్వం ఇటీవల కంచె గచ్చిబౌలి సెంట్రల్ వర్సిటీ దగ్గర భూములను వేలం వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ భూములు యూనివర్సిటీకి చెందినవని, చెట్లను కొట్టేయడం తగదంటూ పెద్ద దుమారమే చెలరేగింది. కోర్టుల్లో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తాజాగా ఇప్పుడు గోపన్ పల్లి వ్యవహారం బయటకు రావడం ఎటు దారి తీస్తుందోనన్న చర్చ నడుస్తున్నది.

ఎకరం రూ.100 కోట్ల వరకు..

గోపన్ పల్లి రెవెన్యూ జీవో 111 పరిధికి పక్కనే ఉంటుంది. దీని పక్కనున్న గ్రామం నుంచే నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. పైగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కనే ఉంది. ఇప్పటికే గోపన్ పల్లి పరిధిలో అనేక ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు కొలువుదీరాయి. అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీల ఆఫీసులు నడుస్తున్నాయి. పరిసరాల్లో అన్నీ స్కై స్క్రేపర్స్ పూర్తయ్యాయి. ఇంకా అనేక ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. ఇలాంటి ప్రాంతంలో ఎకరం రూ.100 కోట్ల వరకు పలుకుతుంది. ఇంతటి విలువైన భూములను హక్కుదారులు వదులుకుంటారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ధరణితోనూ నిషేధం

ధరణి అమల్లోకి వచ్చాక రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని పలు గ్రామాల్లో భూములను భూసేకరణ ప్రతిపాదన లేకుండానే ఎల్ఏజీ నంబర్లతో పీవోబీలో నమోదు చేశారు. రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండానే పట్టాదారు కాలమ్ మార్చేశారు. కొందరు అధికార, అంగ, ఆర్థిక బలాలతో ముఠాలను రంగంలోకి దింపి ఎల్ఏజీ నంబర్లతో నిషేధిత జాబితాలో ఉన్న భూములను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. నయానో, భయానో వాటిని అప్పగించకపోతే దక్కని పరిస్థితులను కల్పిస్తున్నారని తెలిసింది. గజం రూ.లక్షల్లో పలుకుతున్న తరుణంలో వీటిని కొట్టేసేందుకే ఈ ఎల్ఏజీ నంబర్లతో అక్రమ నిషేధాన్ని అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తలకొండపల్లి మండలం జూలపల్లిలోనూ పలు సర్వే నంబర్లలో అనేక నంబర్లను ప్రస్తావిస్తూ ఏల్ఏజీ పేరిట పీవోబీలో నమోదు చేశారు. దాదాపు అన్ని సర్వే నంబర్ల క్లాసిఫికేషన్ పట్టా భూములుగానే ఉన్నాయి. ఒక వేళ ప్రభుత్వం భూమిని సేకరించి ఉంటే అక్కడా అదే విధంగా ఉండాలి. కానీ కేవలం భూమి వివరాల్లో మాత్రం అంటే పహాణీల్లో మాత్రం ఈ పేచీ ఎందుకు పెట్టారో అప్పటి రెవెన్యూ అధికారులకే తెలియాలి.

సాంకేతికతతో తెలుసుకునే చాన్స్

ప్రభుత్వ పెద్దలు చెప్పకున్నా, డ్రాఫ్, నోటిఫికేషన్ లేకున్నా.. ధరణి పోర్టల్ ద్వారా చాలా సర్వే నంబర్లలో భూములను రైతుల పేర్లను తొలగించి ప్రభుత్వం పేరిట రాసేశారు. ఏయే సర్వే నంబర్లను ఎందుకు పీవోబీలో నమోదు చేశారు? ఆ తర్వాత ఏ విధంగా తొలగించారు? ఈ అంశాలన్నీ ధరణి పోర్టల్ డేటాను, ట్రాన్సాక్షన్స్ ను బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా తెలుసుకునే వీలుంది. ఏ అధికారి కంప్యూటర్ నుంచి వీటిని జనరేట్ చేశారో తెలుసుకునే సాంకేతికత ఉన్నది. అప్పటి భూ దందాలు ఏయే అధికారి సహకారంతో నడిచాయో వివరాలు తెలుసుకునే వీలున్నది. అయితే భూభారతి వచ్చాక అదే తరహాలో ప్రభుత్వం ప్రతిపాదించక ముందే పీవోబీలో నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇలాంటి భూముల అక్రమ నిషేధాలను కొనసాగించడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని బాధితులు అభిప్రాయపడుతున్నారు.

Next Story