వాణిజ్య కేంద్రాలుగా మారిన ఇండస్ట్రియల్ పార్కులు..! అక్రమాలను గుర్తించిన TGIIC

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-05 01:29:06  IST  )

బీఆర్ఎస్ హయాంలో పదేళ్లుగా అనేక ఇండస్ట్రియల్ పార్కులు వాణిజ్య కేంద్రాలుగా మారిపోయాయి.

వాణిజ్య కేంద్రాలుగా మారిన ఇండస్ట్రియల్ పార్కులు..! అక్రమాలను గుర్తించిన TGIIC
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ హయాంలో పదేళ్లుగా అనేక ఇండస్ట్రియల్ పార్కులు వాణిజ్య కేంద్రాలుగా మారిపోయాయి. కొందరేమో గోడౌన్లు కట్టి కార్ల షోరూములకు కిరాయికి ఇచ్చుకోగా.. ఇంకొందరేమో ఏకంగా ఫంక్షన్ హాళ్లను నడుపుతున్నారు. కొందరు ఆ భూముల్లో తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకున్నారు. విద్య, వైద్య రంగాల్లో రారాజులుగా మారారు. ఆఖరికి జాన్సన్ గ్రామర్, శ్రీ చైతన్య వంటి విద్యా సంస్థలు కూడా పారిశ్రామిక వాడల్లోనే నెలకొల్పారు. ఏ పేరు చెప్పి భూములు పొందారో దానికి విరుద్ధంగా కార్యకలాపాలు చేపడుతున్నారు. అయితే పారిశ్రామికవాడలను దశాబ్దకాలంగా ఉత్పత్తి లేకుండా కమర్షియల్ యూజ్ కి మారుస్తుంటే.. టీజీఐఐసీ చైర్మన్లు, పరిశ్రమల శాఖ మంత్రులుగా పని చేసిన వారంతా మౌనం వహించారు. ఆఫీసర్లూ సైలెంట్ గానే ఉన్నారు. ఇదంతా ఎవరి హయాంలో యథేచ్చగా సాగిందో లెక్కలు తీస్తే నిజాలు వెలుగులోకి వస్తాయి.

నోటీసులతోనే సరి..

వివిధ ఇండస్ట్రియల్ ఏరియాలో స్థలాలను ఎవరికి కేటాయించారు? ఎందు కోసం కేటాయించారు? ఎంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు? తెలంగాణకు చెందిన వారికి ఇచ్చిన ఉద్యోగావకాశాలు ఎన్ని? డీపీఆర్ ప్రకారం యూనిట్లను నడుపుతున్నారా? ఇలాంటి అంశాలపై అధికారులు ఏనాడూ పర్యవేక్షించలేదు. ఒక్క నాచారం ఇండస్ట్రియల్ పార్కులోనే 24 కంపెనీలు కేటాయించిన ల్యాండ్స్ ను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. అక్కడ కొన్ని చోట్ల బహుళ అంతస్తుల భవనాలను నిర్మించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే అవి పూర్తయ్యాయి. అటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా కండ్లు మూసుకున్నారు. టీజీఐఐసీ అధికారులు చేతులెత్తేశారు. పర్యవేక్షించాల్సిన పరిశ్రమల శాఖ నిద్రబోతున్నది. ఉత్పత్తి మరిచారు. ఉపాధి కల్పించలేదు. కానీ ఖరీదైన ల్యాండ్ ను మాత్రం వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు. టీజీఐఐసీకి సమర్పించిన డీపీఆర్ కు భిన్నంగా కన్వర్షన్ చేసుకున్నారు. ఎవరి అనుమతులు లేవు. కానీ కార్ల షోరూములు, గోడౌన్లు, విద్యా సంస్థలు, హాస్పిటళ్లు, ఫంక్షన్ హాళ్లు నిర్మించారు. వీటిని మూడేండ్ల క్రితమే అధికారులు గుర్తించారు. ఆ కంపెనీలకు నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.


ఇలా.. భూములు పొందిన దానికి, ప్రస్తుతం వినియోగిస్తున్న దానికి అంతులేని తేడా ఉన్నది.

ఇప్పటికీ ప్రారంభం కాని యూనిట్లు

కొన్ని కంపెనీలైతే 2013లో ల్యాండ్స్ తీసుకొని నేటికీ యూనిట్లను ప్రారంభించలేదు. ఎవరికీ ఉపాధి కల్పించలేదు. ఈ కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని టీజీఐఐసీ గుర్తించింది. కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారని ఏనాడో గుర్తించారు. మూడేండ్ల క్రితం ఈ కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. కానీ ఎవరి మీదా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. యథాతథంగా వాణిజ్య కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఈ కంపెనీల వెనుక రాజకీయ బలం ఉందని అందరికీ తెలుసు. వారంతా ఎవరి మనుషులో స్థానికంగా చర్చించుకుంటున్నారు. అందుకే అధికారులతో పాటు మంత్రులుగా పని చేసిన వారు కూడా సైలెంట్ అయ్యారు. ఎలాంటి అనుమతులు లేకుండా వాణిజ్య భవనాలు కడుతున్నా, కట్టినా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు చేతులు కట్టుకున్నారే తప్ప ఎవరికీ కనీసం నోటీసులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని అడిగితే తాము నోటీసులు జారీ చేశామని ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంతటితో తమ పని అయిపోయిందన్నట్లుగా చెప్తున్నారు.

దండుమల్కారం.. తక్కువేం కాదు

దండుమల్కారం ఇండస్ట్రియల్ పార్కులో యునిటీ సపోర్ట్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీకి ఏకంగా 19,303 చ.మీ. అంటే 4.75 ఎకరాల స్థలం కేటాయించారు. ఇదేం పరిశ్రమ నెలకొల్పడం లేదు. అవుట్ లెట్ మాల్, ఫుడ్ కోర్టు, గేమ్స్, కిడ్స్ ప్లే ఏరియా, ఆర్టిసన్ స్పేస్, ఈవీ చార్జింగ్ స్టేషన్ పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొదలు కాలేదు. సుమారు ఐదు ఎకరాల స్థలం తీసుకొని ఏర్పాటు చేసే మాల్ ద్వారా ఎన్ని వందల మందికి ఉపాధి కలుగుతుంది? మాల్ అంటే పరిశ్రమ ఎలా అవుతుంది? ఉత్పత్తి చేసేది నెలకొల్పడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి? మరి ఏ ప్రాతిపదికన ఈ కంపెనీకి స్థలాన్ని కేటాయించారో అధికారులు వెల్లడించడం లేదు. పైగా ఎంత మందికి ఉపాధి కల్పిస్తామని డీపీఆర్ లో చెప్పారు? ఇప్పటి వరకు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఈ లెక్కలు తీయాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జీఎస్ ఇన్ ఫ్రా అనే కంపెనీకి 5,312 చ.మీ., ఏహెచ్ఆర్ ఎంటర్ ప్రైజెస్ ఎల్ఎల్ పీ అనే కంపెనీకి 14,508 చ.మీ. స్థలం కేటాయించారు. అయితే ఇవి కన్వెన్షన్ హాల్స్ అంటే ఫంక్షన్ హాళ్లు ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే కౌశల్య ఫుడ్ కోర్టుకు కూడా ఏకంగా 5,500 చ.మీ. స్థలాన్ని కేటాయించారు. ఇలాంటివి దండుమల్కారం ఇండస్ట్రియల్ పార్కులో చాలానే ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని ఐఐసీ చైర్మన్లుగా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా, కార్పొరేషన్ చైర్మన్లుగా పని చేసిన వారి బినామీ పేర్లతో ఉన్నాయన్న ప్రచారం ఉంది. అందుకే కంపెనీలకు కాకుండా ఇతర కార్యకలాపాలకు కూడా కేటాయించారని చర్చ జరుగుతున్నది.

Next Story