Indiramma Survey: ‘ఇందిరమ్మ’ సర్వేపై సీరియస్.. ఉమ్మడి జిల్లాలో పూర్తి కాని వైనం

by Kema Shiva Kumar |

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా జరుగుతున్న సర్వే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా పూర్తి కాకపోవడంతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతున్నది.

Indiramma Survey: ‘ఇందిరమ్మ’ సర్వేపై సీరియస్.. ఉమ్మడి జిల్లాలో పూర్తి కాని వైనం
X

దిశ ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా జరుగుతున్న సర్వే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా పూర్తి కాకపోవడంతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతున్నది. ఇప్పటికే సర్వే పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారుల జాబితా ప్రకటించాల్సి ఉండగా.. ఉమ్మడి జిల్లాలో 5 నుంచి 10 శాతం మేర సర్వే పూర్తి కాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో సర్వే పూర్తి కాకపోవడం ఇబ్బందిగా మారుతున్నది. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాజాగా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు బుధవారం స్వయంగా దీనిపై క్షేత్రస్థాయి పర్యటనలు చేయడంతో పాటు, సమీక్షలు నిర్వహించారు.

గడువు దగ్గర పడటంతో..

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక తో పాటు ప్రభుత్వం మరో మూడు పథకాలకు సంబంధించిన అర్హుల జాబితా ప్రకటించాల్సి ఉంది. భూమి లేని వారి కోసం ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలకు సంబంధించిన అర్హుల జాబితా ప్రకటించాల్సి ఉండగా..ఇంకా సర్వే పూర్తి కాలేదని తెలుస్తోంది. ఈ నెల 22 తేదీ లోగా గ్రామ సభలు, సమావేశాలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉంది. దీనికి ముందు సర్వే పూర్తి కావాలి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో ఇంకా సర్వే పూర్తి కాలేదని తెలుస్తోంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి, మరో వైపు మరో మూడు పథకాలకు సంబంధించిన అర్హుల ఎంపికకు 19 తేదీ లోగా క్షేత్ర స్థాయి లో అధికారులు చర్యలు తీసుకోవలసి ఉంది. ఇది అధికార యంత్రాంగానికి తలకు మించిన భారం కానుంది. ఇది సజావుగా సాగడం అనుమానంగానే ఉంది.

26 నాటికి పూర్తి అయ్యేనా..?

జనవరి 26న నాలుగు పథకాలు కు సంబంధించిన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలన్న లక్ష్యంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. గడువు దగ్గర పడటంతో కలెక్టర్లపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నది. దీంతో కలెక్టర్లు జిల్లా, మండల స్థాయి అధికారులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

Next Story