Bharosa: ఉపాధి కూలీలకు సర్కార్ శుభవార్త.. ఆ జిల్లాలో ఆత్మీయ భరోసా నిధులు విడుదల

by Ramesh Naini |   (  Updated:2025-02-26 07:28:21  IST  )

ఉపాధి కూలీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Bharosa: ఉపాధి కూలీలకు సర్కార్ శుభవార్త.. ఆ జిల్లాలో ఆత్మీయ భరోసా నిధులు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఉపాధి కూలీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు ఏటా రెండు విడతల్లో రూ.12 వేలు అందించేలా (Indiramma Atmiya Bharosa) ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను బుధవారం (Telangana) తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు జమ చేసింది.

జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి మండలంలోని ఒక పైలెట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేసింది. మొత్తం 18,180 మంది కూలీలకు రూ. 6 వేల చొప్పున జమ చేసింది. ఆ తర్వాత మండలి ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి ఎన్నికల కోడ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిలిచిపోయింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసింది.

ఆ రెండు జిల్లాల్లో దాదాపు 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ప్రభుత్వం చెల్లించింది. మొత్తం 66,240 మంది కూలీల ఖాతాల్లో రూ.39.74 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 83,420 మంది ఉపాధి కూలీలకు 50.65 కోట్లు ప్రభుత్వం చెల్లించినట్లు పేర్కొంది. ఎన్నికల కోడ్ ముగియగానే లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ప్రభుత్వం చెల్లించనున్నట్లు ప్రకటించింది.

రెక్కల కష్టాన్ని నమ్ముకున్న ఉపాధి కూలీలకు పెద్దదిక్కుగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తోంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఉపాధి కూలీలకు ఆర్థిక చేయూత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ప్రవేశపెట్టింది. ఒక సీజన్‌కు రూ.6 వేల చొప్పున ప్రభుత్వం కూలీలకు భరోసా కల్పిస్తోంది. డీబీటీ పద్ధతిలో ఉపాధి కూలీల ఖాతాల్లోకి నేరుగా భరోసా నిధులను ప్రభుత్వం జమ చేస్తోంది.

Next Story