- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిప్మర్ లో బీఏఎంఎస్.. కేంద్రానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వార్నింగ్
ప్రముఖ వైద్య సంస్థ అయిన జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్మర్)లో ఎంబీబీఎస్‌తో పాటు ఆయుర్వేదంలో బ్యాచిలర్ డిగ్రీ అయిన బీఏఎంఎస్‌ని కలుపుతూ కోర్సు ప్రవేశపెట్టే ప్రయత్నం పట్ల దేశవ్యాప్తంగా వైద్యుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ వైద్య సంస్థ అయిన జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్మర్)లో ఎంబీబీఎస్‌తో పాటు ఆయుర్వేదంలో బ్యాచిలర్ డిగ్రీ అయిన బీఏఎంఎస్‌ని కలుపుతూ కోర్సు ప్రవేశపెట్టే ప్రయత్నం పట్ల దేశవ్యాప్తంగా వైద్యుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే పోరాటం తప్పదంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) హెచ్చరించింది. తాము వైద్యరంగంలోని ఏ కోర్సుకూ వ్యతిరేకం కాదని.. కానీ రెండు విభిన్న మార్గాల్లో వెళ్లే వైద్య రంగాలను కలపడం ద్వారా వచ్చే ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయని పేర్కొంది. అత్యవసర సమయంలో చికిత్స అందించే విషయంలోనూ పలు ఇబ్బందులు ఎదురవుతాయని స్పష్టం చేసింది. ఈ మిక్సోపతి కారణంగా అలోపతిలో గానీ అటు ఆయుర్వేదంలో గానీ పూర్తిస్థాయి పట్టుసాధించలేక చివరికి సబ్జెక్టు లేని డాక్టర్లు తయారవుతారని హెచ్చరించింది. పేషెంట్ సైతం తన చికిత్సకు సంబంధించి అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీనిపై కేంద్రం వెనకడుగు వేయనట్లయితే తాము దశలవారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపింది.
స్పందిస్తూ ఎన్ఎంసీ లేఖ
కేంద్రం నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో నేషనల్ మెడికల్ కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ అభిజాత్ సేత్ స్పందిస్తూ.. ఐఎంఏ అధ్యక్షుడు డా.మెహుల్ జే షాకి వివరణ ఇస్తూ లేఖ రాశారు. పీజీఎంఈఆర్-2023లోని సవరణ ప్రకారం పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ సమర్పించే రీసెర్చ్ పేపర్లను జాతీయ స్థాయిలో కానీ.. రాష్ట్ర స్థాయిలో కానీ జరిగే ఐఎంఏ సమావేశాల్లో పూర్తిస్థాయిలో ఆమోదిస్తారని పేర్కొన్నారు. దీని కోసం ఏ విద్యార్థిపైనా ప్రత్యేకించి ఒక వైద్య రంగానికి చెందిన అంశాన్ని ఎంపిక చేసుకోవాలని ఒత్తిడి ఉండదని స్పష్టంచేశారు. దీంతో ఈ నిర్ణయం అమలు పట్ల నేషనల్ మెడికల్ కమిషన్ సైతం వెనుకడుగు వేస్తుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఐఎంఏ మాత్రం ఇప్పటికీ పూర్తిస్థాయి క్లారిటీ రావాల్సి ఉందని భావిస్తోంది. అంతేకాకుండా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా ప్రచారం సైతం నిర్వహిస్తోంది.
అసలేంటి ఈ నిర్ణయం..
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ మే 27న ఒక ప్రకటన చేస్తూ జిప్మర్‌లో ఎంబీబీఎస్, బీఏఎంఎస్ కంబైన్డ్ డిగ్రీని ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. దీని కోసం కేంద్రం ఆర్థిక సహాయంతో పాటు ఇతర చర్యలు తీసుకోనుందని తెలిపారు. ఈ ప్రకటన వైద్య ప్రముఖులను ఆశ్చర్యానికి గురి చేసింది. నిజంగానే కేంద్రం ఇలాంటి అడుగు వేయబోతుందనే అనుమానం వారిలో వ్యక్తమైంది.






