- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడవి నుంచి ఆదాయం: తెలంగాణ సర్కార్ ‘ఇప్ప పువ్వు ప్రాజెక్ట్’.. మంత్రుల కీలక వ్యాఖ్యలు
గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ జీవన విధానానికి ఆధారమైన ఇప్పపువ్వు (మహువా)ను గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రధాన వనరుగా మలిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ జీవన విధానానికి ఆధారమైన ఇప్పపువ్వు (మహువా)ను గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రధాన వనరుగా మలిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మహువా ఫ్లవర్ ప్రాజెక్ట్ అమలుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. అడవుల్లో సహజ సిద్ధంగా లభించే ఇప్పపువ్వు గిరిజన సంస్కృతి, ఆహార సంప్రదాయాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇప్పపువ్వును ఆహార ఉత్పత్తులు, ఔషధ వినియోగాలు, విలువ ఆధారిత పరిశ్రమలు, గ్రామీణ సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి ఉపయోగించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. గిరిజన ప్రాంతాల్లో శాస్త్రీయ సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేసి గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఆదాయం అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు. గిరిజన మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, యువజన సమాఖ్యలను ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం చేసి గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు పెంచాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఉమ్మడిగా సమన్వయంతో పైలట్ ప్రాజెక్టులు చేపట్టి, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే దిశగా కార్యాచరణ చేపట్టాలని మంత్రి సూచించారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో సహజ సిద్ధంగా లభించే ఇప్పపువ్వు కేవలం అటవీ ఉత్పత్తి మాత్రమే కాకుండా గిరిజన కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు బలమైన ఆధారంగా మారే సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఇప్పపువ్వు నుంచి లడ్డూలు, నేచురల్ హెల్త్ ఫుడ్స్, సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేయవచ్చని, ఇప్ప గింజల నుండి నూనె తయారీకి కూడా విశేష అవకాశాలు ఉన్నాయని, ఇప్ప ఆకులు, పువ్వులు, గింజలు అన్నీ వినియోగంలోకి తీసుకువస్తే గిరిజన ప్రాంతాల్లో చిన్న స్థాయి పరిశ్రమలు ఏర్పడి మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇప్పపువ్వుతో పోషకాహార పదార్థాలు, పిల్లలకు ఆరోగ్యకరమైన స్నాక్స్, మిల్లెట్ ఆధారిత ఫుడ్ ప్రొడక్ట్స్, హెర్బల్ టీలు, నేచురల్ స్వీటెనర్లు తయారు చేసే అవకాశాలను పరిశీలించాలని సీతక్క సూచించారు. గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి ట్రైబల్ నేచురల్ ఫుడ్ బ్రాండ్స్ రూపంలో మార్కెట్‌లోకి తీసుకురావాలని ఆమె సూచించారు. గిరిజన మహిళల సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేస్తే ప్రపంచ మార్కెట్‌లో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావచ్చని సీతక్క పేర్కొన్నారు. ప్రతి గిరిజన గ్రామంలో ఇప్పపువ్వు సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్‌కు మినీ యూనిట్లు ఏర్పాటు చేయాలని, యువతను స్టార్టప్ రంగంలో ప్రోత్సహించాలని సూచించారు.
ఇప్పపువ్వు ఆధారిత ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, ఈ-కామర్స్ మార్కెటింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకోవాలని తెలిపారు. గిరిజన మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలు, ప్రభుత్వ సబ్సిడీలు, స్వయం ఉపాధి పథకాలను అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పపువ్వు సేకరణ నుంచి నిల్వ, ప్రాసెసింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ వరకు ప్రతి దశను సవివరంగా వివరిస్తూ సమగ్ర దృశ్యాలతో ఆయన ప్రజెంటేషన్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వెంకట రామయ్య చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్ , మురళి నాయక్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






