తొలి దశలో 395 సర్పంచ్‌లు ఏకగ్రీవం.. అత్యధికంగా వికారాబాద్‌లో 39 మంది

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 395 గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తొలి దశలో 395 సర్పంచ్‌లు ఏకగ్రీవం.. అత్యధికంగా వికారాబాద్‌లో 39 మంది
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 395 గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు గ్రామాలకు ఒక్క నామినేషన్​దాఖలు కాలేదు. ఈ నెల 11న జరగనున్న మొదటి విడత ఎన్నికల్లో 4,236 గ్రామాలకు గాను 3,836 గ్రామ సర్పంచ్‌లకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌లకు నామినేషన్‌లు వేసిన వారిలో 8,095 మంది తమ నామినేషన్‌లను ఉపసంహరించున్నారు. 9,626 మంది అభ్యర్థులు వార్డులకు వేసిన నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. 37,440 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్​విడుదల చేయగా 149 వార్డులకు ఒక్కరు కూడా నామినేషన్​దాఖలు చేయలేదు. 9,331 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటి విడతకు సంబంధించిన వివరాలను గురువారం ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఈ నెల 11న జరిగే మొదటి విడత ఎన్నికల్లో 3,836 గ్రామ పంచాయతీలకు 13,127 మంది సర్పంచ్‌ అభ్యర్థులు, 27,960 వార్డులకు 67,893 మంది అభ్యర్థులు పోటీపడనున్నారు. అనేక గ్రామాల్లో వేలం ద్వారా సర్పంచ్‌లను కైవసం చేసుకున్నారు. వీటిపై ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకున్నా.. ఎక్కడ కూడా గ్రామస్తులు వాటి గురించి సమాచారాన్ని అధికారికంగా ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో వేలం ద్వారా ఎన్నికైన వారిని సర్పంచ్‌లను ప్రకటించక తప్పని పరిస్థితి రిటర్నింగ్​అధికారులకు వచ్చింది. వేలం పాటలపై కలెక్టర్​ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకున్నారు. అయినా కూడా వేలం పంచాయతీలను సరియైన ఆధారాలు లభించక పోవడంతో ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్​లభించింది. దీంతో వేలం పాటలకు ఎలాంటి అటంకం లేకుండా పోయింది.

అత్యధికంగా వికారాబాద్‌లో..

అత్యధికంగా వికారాబాద్​జిల్లాలో 39 సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అతి తక్కువగా కరీంనగర్‌లో ముగ్గురు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భూపాలపల్లి, ములుగు, సిరిసిల్ల, మహబూబాబాద్‌లలో 9 మంది, సంగారెడ్డి, సూర్యాపేట, కుమురం భీం అసిఫాబాద్‌లో ఏడుగురు, మంచిర్యాల, రంగారెడ్డిలో ఆరుగురు, వనపర్తిలో 5, హన్మకొండ, జగిత్యాల, పెద్దపల్లిలో నలుగురు చొప్పున సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఏకగ్రీవంగా అయిన సర్పంచ్‌లు..

జిల్లా ఏకగ్రీవమైన గ్రామాల సంఖ్య

వికారాబాద్​ - 39

ఆదిలాబాద్​ -33

నిజామాబాద్​ -29

నల్గొండ -22

ఖమ్మం -20

మెదక్ -16

సిద్దిపేట -16

భువనగిరి - 16

నిర్మల్​ - 16

గద్వాల- 15

కొత్తగూడెం- 14

నాగర్‌కర్నూలు- 14

కామారెడ్డి - 11

నారాయణ్‌పేట్​ 1-1

వరంగల్​ - 11

మహబూబ్​నగర్​ - 10

జనగాం- 10

కాగా, 11న ఎన్నికలు జరిగే మొదటి విడత ఎన్నికల్లో 3,836 సర్పంచ్‌ పదవులకు 13,127 మంది, 27,960 వార్డులకు 67,893 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Next Story