- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బట్టుపల్లిలో మావోయిస్టు మాజీ నేత ఆశన్న.. 30 ఏళ్ల తర్వాత అదే ప్రాంతానికి
మాజీ మావోయిస్టు అగ్రనేత ఆశన్న 30 ఏళ్ల తర్వాత బట్టుపల్లిలో పర్యటించారు. అమరవీరుల కుటుంబాలను పరామర్శించి, పాత సహచరులతో సమావేశమయ్యారు.

దిశ, వరంగల్ బ్యూరో: హన్మకొండ జిల్లా ఖాజీపేట మండలం బట్టుపల్లిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్ ఇవాళ పర్యటించారు. మావోయిస్టు పార్టీ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కర్, యాదగిరితో పాటు పలువురు నేతలు.. పీపుల్స్‌వార్‌లో పని చేసి చనిపోయిన అమర వీరుల కుటుంబాలను కలిశారు. పీపుల్స్‌వార్‌గా ఉన్న సమయంలో అప్పుడు బట్టుపల్లి షెల్టర్‌గా ఉండేది. ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించేవారు. వరంగల్, హన్మకొండ, ఖాజీపేటతో పాటు గ్రేటర్ పరిధిలో ఆశన్న కార్యకలాపాలు నిర్వహించారు. ఆయన 30 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం నుంచే కార్యకలాపాలు మొదలు పెట్టి పార్టీలో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పలు బాధ్యతలు నిర్వర్తించారు.
కలిసి పని చేసిన వారితో సమావేశం
నాలుగు నెలల క్రితం లొంగిపోయిన ఆశన్న.. బట్టుపల్లి నుంచి పీపుల్స్‌వార్‌లో పనిచేసి చనిపోయిన వారి కుటుంబాలను కలుస్తున్నారు. వారితో మాట్లాడి ఓదారుస్తున్నారు. ఛత్తీస్‌ఘడ్ పోలీసులు బందోబస్తు ఉండగా బట్టుపల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆయనతో కలిసి ఉద్యమంలో పని చేసిన వారితో ఇవాళ మధ్యాహ్నం సమావేశం కానున్నారు. ఆశన్న జనజీవన స్రవంతిలో కలవడం, ఏళ్ల తర్వాత వరంగల్ ప్రాంతానికి రావడంతో గతంలో ఆయనతో పనిచేసిన వారు సైతం కలిసేందుకు వస్తున్నారు.
ప్రజాక్షేత్రంలోకి మాజీ మావోయిస్టులు:
గతేడాది అక్టోబర్ 17వ తేదీన ఛత్తీస్ గఢ్ బస్తర్ జిల్లాలోని జగ్ధల్ పూర్‍లో ఆశన్న సరెండర్ అయ్యారు. ఆ సమయంలో మొత్తం 208 మంది తమ ఆయుధాలు ప్రభుత్వానికి అప్పగించి జనజీవన స్రవంతిలో కలిశారు. తాజాగా ఆశన్న ప్రజాక్షేత్రంలోకి రావడం ఆసక్తిగా మారింది. మరోవైపు ఇటీవలే మావోయిస్టు కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ సోనూ దాదా 44 ఏళ్ల తర్వాత స్వస్థలం పెద్దపల్లిలో అడుగుపెట్టారు. అక్కడ తన కుటుంబ సభ్యులు, పాత స్నేహితులను కలుసుకున్నారు. ఇటీవలే సరెండర్ అయిన మావోయిస్టు అగ్ర నేతలు దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, పోతుల కల్పన అలియాస్ సుజాతక్క, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై చర్చించారు. దీంతో లొంగిపోయిన నేతలంతా ప్రజాక్షేత్రంలోకి, ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్తుండటంతో మాజీ మావోయిస్టుల భవిష్యత్ కార్యాచరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.






