- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విపరీతంగా ఫీజుల పెంపు ఎఫెక్ట్.. HPS ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
హైదరాబాద్ రామంతపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) వద్ద ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల వార్షిక పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు అప్పుడే అడ్మీషన్ల ప్రక్రియను మొదలు పెట్టేశాయి. ఈ క్రమంలోనే గతేడాది కంటే ఈసారి ఫీజులను భారీగా పెంచుతూ తల్లిదండ్రుల నడ్డి విరిచేందుకు కొన్ని పాఠశాలలు రంగం సిద్ధం చేసుకున్నాయి. తాజాగా, హైదరాబాద్‌లోని ప్రముఖ విద్యాసంస్థ రామంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు భారీ ఆందోళన చేపట్టారు. స్కూల్ యాజమాన్యం అడ్డగోలుగా పెంచిన ఫీజులకు నిరసనగా పాఠశాల గేటు ముందు ధర్నా నిర్వహించారు. యాజమాన్యం గత కొన్ని సంవత్సరాలుగా ఫీజులను విపరీతంగా పెంచుతూ తల్లిదండ్రులపై పెను భారం మోపుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గత నాలుగు సంవత్సరాల కాలంలో ఏకంగా 140 శాతం ఫీజులను పెంచారని ఆరోపించారు. అదేవిధంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇదే నాలుగేళ్ల కాలంలో 84 శాతం మేర ఫీజులు పెరిగాయని తెలిపారు.
తల్లిదండ్రుల డిమాండ్..
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) ఏ ప్రాతిపదికన ఇంత భారీగా ఫీజులు పెంచుతున్నారని పేరెంట్స్ యాజమాన్యాన్ని నిలదీశారు. సామాన్యులకు విద్యను దూరం చేసేలా ప్రైవేట్ పాఠశాలల దోపిడీ సాగుతోందని మండిపడ్డారు. పెంచిన ఫీజులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. స్కూల్ యాజమాన్యం స్పందించి ఫీజుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని పేరెంట్స్ కోరుతున్నారు.






