- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువు కట్ట కిందే సెల్లార్.. బఫర్ జోన్‌లోనే ఐదు అంతస్తులు.. లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌పై 'దిశ' ఎక్స్‌క్లూజివ్!
హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాల పరిరక్షణపై ప్రభుత్వం ఎన్ని సుద్దులు చెబుతున్నా.. కఠిన చర్యలు అంటూ హైడ్రా ఎంత సీన్ చేస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం ప్రైవేట్ బిల్డర్ల ‘కమల వికాసం’ నిరాటంకంగా సాగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాల పరిరక్షణపై ప్రభుత్వం ఎన్ని సుద్దులు చెబుతున్నా.. కఠిన చర్యలు అంటూ హైడ్రా ఎంత సీన్ చేస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం ప్రైవేట్ బిల్డర్ల ‘కమల వికాసం’ నిరాటంకంగా సాగుతోంది. శేరిలింగంపల్లి మండలం మదీనాగూడలోని పటేల్ చెరువు (మియాపూర్) దిగువన కట్ట మైదానాన్ని ఆనుకుని ఉన్న రక్షిత స్థలాన్ని ‘లోటస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్’ అత్యంత చాకచక్యంగా మింగేసింది. ఇరిగేషన్ శాఖ కళ్ళకు గంతలు కట్టి, మున్సిపల్ అధికారుల ‘కటాక్షం’తో ఏకంగా నిషేధిత బఫర్ జోన్ లోపల ఐదంతస్తుల నివాస సముదాయాన్ని లేపేసింది. కాగితాలపై ఒక లెక్క.. గూగుల్ మ్యాప్స్ సాక్షిగా గ్రౌండ్ మీద మరొక లీలగా సాగుతున్న ఈ ‘లోటస్’ విలాసంపై ప్రత్యేక దర్యాప్తు కథనం.
ఇరిగేషన్ పచ్చజెండా.. వెనకే బఫర్ కొలత!
మదీనాగూడ సర్వే నంబర్ 188 లోని 3,857 చదరపు మీటర్ల పట్టా భూమిలో నిర్మాణాల కోసం లోటస్ ఇన్ఫ్రా ప్రతినిధులు ఇరిగేషన్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సుదీర్ఘ సర్వే జరిపిన నార్త్ టాంక్స్ డివిజన్ ఇరిగేషన్ అధికారులు 2019 జనవరిలో ఒక నివేదిక ఇచ్చారు. ఈ స్థలం పటేల్ చెరువు కట్టకు దిగువన ఉన్నందున, కట్ట అడుగు భాగం నుంచి 10 మీటర్ల నుండి 17 మీటర్ల వెడల్పుతో 771 చదరపు మీటర్ల స్థలాన్ని డి ఎస్ బఫర్ జోన్’ గా ఖాళీగా వదిలేయాలని స్పష్టమైన షరతు పెట్టారు. బఫర్ జోన్ పోగా మిగిలిన 3,086 చదరపు మీటర్ల నికర స్థలంలోనే జీవో 168 ప్రకారం నిర్మాణాలు చేసుకోవాలని నిబంధన విధించారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పర్మిషన్ రద్దు చేస్తామని ఎన్‌ఓసీ లో పేర్కొన్నారు.
మున్సిపల్ మాయాజాలం.. మాయమైన బఫర్ జోన్!
ఇరిగేషన్ శాఖ 771 చదరపు మీటర్ల స్థలాన్ని ముట్టవద్దని చెబితే, మున్సిపల్ అధికారులు మాత్రం దానికి పూర్తి భిన్నమైన ‘మాయాజాలం’ ప్రదర్శించారు. 2023 ఏప్రిల్ లో జారీ చేసిన బిల్డింగ్ పర్మిషన్ ఆర్డర్ (Permit No. 5641/GHMC/SLP/2023-BP) లో అధికారులు చూపించిన లెక్కలు చూస్తే ఎవరికైనా ముక్కున వేలేసుకోవడం ఖాయం. బిల్డర్ పక్కనే ఉన్న ప్లాట్ నంబర్ 329, 330 లను ఓపెన్ ప్లాట్‌తో ఏకీకరణ చేయగా మొత్తం స్థలం 4190.72 చదరపు మీటర్లుగా మారింది. అయితే, ఈ పర్మిషన్ ఆర్డర్ లో రోడ్డు కటింగ్ ‘0.0’, నాలా కటింగ్ ‘0.0’ అని చూపించిన మున్సిపల్ అధికారులు.. ఇరిగేషన్ శాఖ ఖచ్చితంగా మినహాయించమన్న 771 చదరపు మీటర్ల బఫర్ జోన్ కటింగ్‌ను పూర్తిగా గాలికొదిలేశారు! ఏకంగా 4188.25 చదరపు మీటర్లను నికర స్థలంగా అప్రూవ్ చేసి, బఫర్ జోన్ ఆక్రమణకు రెడ్ కార్పెట్ పరిచారు.
ప్లాన్ లోనే ఉల్లంఘన.. టెర్రస్ వ్యూ సాక్ష్యాలు!
సాధారణంగా ఏ బిల్డర్ అయినా నిబంధనలను దాచడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ లోటస్ ఇన్ఫ్రా ఏకంగా జీహెచ్ఎంసీ అప్రూవల్ కోసం సమర్పించిన ‘టెర్రస్ ఫ్లోర్ ప్లాన్’ లోనే ఉల్లంఘనలను బహిరంగంగా చూపించడం విశేషం. ఇరిగేషన్ మ్యాప్ ప్రకారం స్థలానికి కుడివైపున ఏటవాలుగా ఉండే సరిహద్దు వెంబడి 17 మీటర్ల వరకు ఎలాంటి భవన నిర్మాణం రాకూడదు. కానీ బిల్డర్ సమర్పించిన ప్లాన్‌లో, ఆ ఏటవాలు సరిహద్దును ఆనుకుని కేవలం సాధారణ సెట్‌బ్యాక్ మాత్రమే వదిలి, ఏకంగా ఐదంతస్తుల భవన బ్లాకులను డిజైన్ చేశారు. ఈ ప్లాన్‌లో ఎక్కడా ఇరిగేషన్ బఫర్ జోన్‌కు సంబంధించిన గుర్తులు గానీ, ఆ స్థలాన్ని ఖాళీగా వదిలేస్తున్నట్లు గానీ పేర్కొనలేదు.
శాటిలైట్ సాక్ష్యాలు.. గ్రౌండ్ లో జరిగింది ఇదే!
గూగుల్ శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే.. బిల్డర్ కాగితాలపై గీసిన ఉల్లంఘనల ప్లాన్‌ను గ్రౌండ్ మీద అక్షరాలా అమలు చేసినట్లు స్పష్టమవుతోంది. చెరువు కట్టకు అత్యంత సమీపంలో ఉండే ఈ పొడవాటి జిగ్-జాగ్ బిల్డింగ్ బ్లాక్.. ఇరిగేషన్ శాఖ నిషేధించిన 771 చ.మీ. రెడ్ బఫర్ జోన్ లోపల పూర్తిగా విస్తరించి ఉంది. ఈ బ్లాక్‌లకు సంబంధించిన పిల్లర్లు, స్లాబ్‌లు కూడా బఫర్ జోన్ పరిధిని దాటి లోపలికి చొచ్చుకువచ్చాయి. చెరువు కట్ట కింద నీటి ఊట సహజంగా వచ్చే ప్రాంతంలో సెల్లార్ తవ్వి, పిల్లర్లు లేపి 5 అంతస్తుల నివాస సముదాయాన్ని నిర్మించడం గూగుల్ మ్యాప్స్ ద్వారా వంద శాతం పక్కాగా నిర్ధారణ అవుతోంది.
ఇరిగేషన్ శాఖ వద్ద వద్దు అన్న స్థలాన్ని.. మున్సిపల్ శాఖ కావాలని నెట్ ఏరియాలో కలిపేసి.. బిల్డర్ దాన్ని కాస్తా భవనాలతో నింపేసి ‘కమల (లోటస్) వికాసం’ పూర్తి చేశారు. అయితే, ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఈ కొలతల వ్యత్యాసం వెనుక, మున్సిపల్ అధికారులు ఇరిగేషన్ ఎన్‌ఓసీని పక్కన పెట్టడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? దాదాపు రూ. 1.36 కోట్ల ఫీజులు చెల్లించిన ఈ ఫైల్ వెనుక నడిచిన అంతర్గత వ్యవహారాలు ఎలాంటివి? ఈ ప్లాన్ అప్రూవల్ ప్రక్రియలో ఏ ఏ ఉన్నతాధికారుల హస్తం ఉంది? దీని వెనుక ఉన్న మరిన్ని ఆసక్తికరమైన నిజాలు, లోతైన అధికారిక లీలల విశ్లేషణను మరొక ప్రత్యేక కథనంలో క్షుణ్ణంగా తెలుసుకుందాం.






