- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయ్యప్ప సొసైటీలో రెచ్చిపోతున్న బిల్డర్లు.. అక్రమార్కులకు అధికారుల భరోసా
ప్రభుత్వం మారినా.. అధికారులు మారినా.. గ్రేటర్ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. అమ్యామ్యాలకు ఆలవాటు పడ్డ కొందరు ఆఫీసర్లు..

దిశ, శేరిలింగంపల్లి : ప్రభుత్వం మారినా.. అధికారులు మారినా.. గ్రేటర్ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. అమ్యామ్యాలకు ఆలవాటు పడ్డ కొందరు ఆఫీసర్లు చూసీ చూడనట్టు వ్యవహరించడంతో జీహెచ్ఎంసీ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కొంతకాలంగా భవన నిర్మాణాలు జోరందుకున్నాయి. ఇన్నాళ్లూ ఏదో ఒక రీజన్‌తో ఆగిన నిర్మాణాలు సైతం ఇప్పుడు ఎంచక్కా కంప్లీట్ అవుతున్నాయి. నిర్మిస్తున్న వాటికి పర్మిషన్లు ఉన్నాయా? లేదా? అనేది ఎవరూ పట్టించుకోరు. కొందరు జీహెచ్ఎంసీ సిబ్బందికి తెలిసినా.. ‘మేమున్నాం’ అంటూ భరోసా ఇస్తుండడంతో అక్రమార్కులకు మరింత బలం చేకూరుతోంది. శేరిలింగంపల్లి, చందానగర్, కూకట్‌పల్లి సర్కిళ్ల పరిధిలోని పలు డివిజన్లలో అనేక నిర్మాణాలు అనుమతి లేకుండానే సాగుతున్నట్టు తెలుస్తోంది.
అక్కడన్నీ గాలిమేడలే..
మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ ఇండియా, చందానాయక్ తండా, ఎన్ కన్వేషన్, సీజేఆర్ స్కూల్ ప్రాంతాలతో పాటు పలు కాలనీల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిలో ఒక్క దానికీ పర్మిషన్ ఉండదు. ఆ స్థలాలన్నింటిపైనా సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. అయినా నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 200 వరకు కొత్త కట్టడాలు సాగుతున్నాయి. కొందరు బిల్డర్లు, నిర్మాణదారులు ఏకంగా 7, 8 అంతస్తుల భవనాలు సైతం నిర్మించారు. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా కింద సెల్లార్లు, పైన పెంట్‌హౌస్‌లు సైతం కట్టేశారు.
బిల్డర్లు, నిర్మాణదారులదే ఇష్టారాజ్యం
జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ నిర్మాణాలు సాగించినా ఒకే రూల్ ఉంటుంది. వారు నిర్దేశించిన కొలతల ప్రకారమే నిర్మాణాలు సాగాలి. కానీ మాదాపూర్ డివిజన్‌లోని అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ ఇండియా, చందానాయక్ తండా, ఖానామెట్ ప్రాంతాల్లో మాత్రం అవేవీ ఉండవు. ఇక్కడ కొందరు బిల్డర్లు, నిర్మాణదారులదే ఇష్టారాజ్యం. ఎంత స్థలం ఉంది.. దానికి పర్మిషన్లు ఉన్నాయా.. లేవా అన్న విషయాన్ని పట్టించుకోకుండా ఎన్ని అంతస్తులు కట్టుకోవాలి అనుకుంటే అన్ని కట్టేస్తున్నారు. ఇదంతా తెలిసినా జీహెచ్ఎంసీ సిబ్బంది పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. జోనల్ కమిషనర్‌తో పాటు డీసీలు, టీపీఎస్ సిబ్బంది మాదాపూర్‌లోని కొందరు బిల్డర్లకు కొమ్ముకాస్తున్నారని తీవ్ర ఆరోపణలున్నాయి. మాదాపూర్‌లో చాలామంది బిల్డర్లకు చందానగర్ జీహెచ్ఎంసీ సిబ్బంది మీడియేటర్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో హైడ్రా ఓ ఇల్లీగల్ నిర్మాణాన్ని నేలమట్టం చేసినా ఆ తర్వాత ఎందుకో కానీ తిరిగి ఆ వైపు దృష్టి సారించలేదు.
ప్రభుత్వ భూములు, పార్కులు ఎక్కడ?
అయ్యప్ప సొసైటీ భూముల్లో 1982లో కొందరు వెంచర్ వేయగా ఆ తర్వాత రీ లేఅవుట్లు వేశారు. అలా ఒకే స్థలం పలుమార్లు చేతులు మారుతూ వచ్చాయి. ఇక్కడ అసలు ఓనర్లు ఎవరో, నకిలీ ఓనర్లు ఎవరో అన్నదానిపై తరచూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ భూములను పలువురు కబ్జాదారులు చెరబట్టారు. సామాన్యుల భూముల్లో పాగా వేసిన వారు గతంలో లేఅవుట్‌లో ఉన్న పార్కులు, సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను సైతం కబ్జాలు చేశారు. దోబీ ఘాట్, ఆ సమీపంలోని కుంటతో ఆగని భూబకాసురులు పార్కులను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. అయినా అమ్యామ్యాలకు అలవాటు పడ్డ జీహెచ్ఎంసీ సిబ్బంది చర్యలు తీసుకోలేదు.- సీపీఎం నాయకులు కొంగరి కృష్ణ






