- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసైన్డ్ ల్యాండ్స్‌లో అక్రమ నిర్మాణాలు..
గజం విలువ రూ.2 లక్షలు. కానీ.. అది అసైన్డ్ ల్యాండ్. దానిని దున్నుకోలేరు.. ప్లాట్లు చేసి అమ్మరాదు.. అందులో నిర్మాణాలూ చేపట్టరాదు.

దిశ, తెలంగాణ బ్యూరో: గజం విలువ రూ.2 లక్షలు. కానీ.. అది అసైన్డ్ ల్యాండ్. దానిని దున్నుకోలేరు.. ప్లాట్లు చేసి అమ్మరాదు.. అందులో నిర్మాణాలూ చేపట్టరాదు. కొంత మంది పెద్దలు మాత్రం యథేచ్ఛగా కొన్నారు. నిబంధనలు విస్మరించి ఏకంగా హై రైజ్డ్ బిల్డింగ్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మించేశారు. పెద్దపెద్ద వారు కొనుగోలు చేసి నిర్మించడంతో సాధారణంగా అధికారులకు కూడా వారిపై అమితమైన ప్రేమ ఉంది. అందులోనూ ఎమ్మెల్యేకు వియ్యంకుడో.. బావమరిదో అయితే చాలు.. లేదంటే రాజకీయ అండదండలు ఉన్నా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు ఇస్తుంది. అందుకు రెరా కూడా అంగీకరిస్తుంది. హైటెక్ సిటీ, హెచ్ఐసీసీ, శిల్పారామం ఏరియాల్లోనే ఇదంతా జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఐటీ కంపెనీలు.. ఫ్లైఓవర్లు.. మల్టీ ఫ్లైఓవర్లు.. విశాలమైన రహదారులు.. మరోవైపు మెట్రో పరుగులు.. ఇన్ని వసతులు ఉన్న ఏరియా అంటే దానికి ఎంతలా డిమాండ్ ఊహించుకోవచ్చు. హైటెక్ సిటీ, హెచ్ఐసీసీ, శిల్పారామం ఏరియాలకు ఎంతలా డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. అందుకే ఇక్కడి భూములుపై పలువురు పెద్దల కన్ను పడింది. ఇంకేముంది అధికారంలంతా కుమ్మక్కై ప్రభుత్వ భూములకు అసైన్డ్ పట్టాలు జారీ చేసేశారు. మరికొందరు అవినీతి అధికారులు ఆ పట్టాలతో సేల్ డీడ్స్ కూడా చేశారు. ప్రస్తుతం ఆ ప్రభుత్వ స్థలంలో పెద్దపెద్ద బిల్డింగులు కనువిందు చేస్తున్నాయి.
వేలాదిగా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గండిపేట, శంషాబాద్, మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి మండలాల్లోని అసైన్డ్ భూముల ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు తీస్తే వేలాది డాక్యుమెంట్లు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న చాలా మండలాల్లో ఇదే పరిస్థితి. అదే గ్రామీణ ప్రాంతాల్లోనైతే సమగ్ర నిషేధిత విధానం అమలవుతున్నది. అలాగే సిటీలోనూ ఒకే సర్వే నంబరులో వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు. కొంత విస్తీర్ణానికి ఎన్వోసీ, మరికొంత విస్తీర్ణానికి నిషేధం విధించిన తహశీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే.. అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారిలో కొందరు తమకు మ్యుటేషన్లు చేయడం లేదంటూ కోర్టులను ఆశ్రయించారు. ఇంకొందరికి చేశారని, తమకు చేయడం లేదంటూ అప్పీల్‌కి వెళ్లిన ఉదంతాలు ఉన్నాయి. చివరకు ఈ కేసులు సుప్రీంకోర్టుకు చేరాయి. సుప్రీంకోర్టు స్థాయి వరకు వెళ్లారంటే ఆ భూములకు ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవచ్చు.
సమీక్షించకపోతే డేంజర్..
హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టూ ఉన్న అసైన్డ్ భూములు ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయి. ఎప్పుడో బడా కంపెనీలు దొడ్డిదారిన కొనుగోలు చేశాయి. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నంబర్ 41లో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు అసైన్‌మెంట్ పట్టాల ఆధారంగా సప్లిమెంటరీ సేత్వార్‌ను రూపొందించారు. ఆ తర్వాత కొంత కాలానికి ఈ పట్టాలు బోగస్‌వంటూ తేల్చారు. సీసీఎల్‌ఏ ఆదేశాల మేరకు సదరు సప్లిమెంటరీ సేత్వార్‌ను రద్దు చేశారు. ఆ తర్వాత అసైన్‌దారులు కోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. కానీ.. ఆక్రమణలు, అక్రమాలు, నిర్మాణాలు, రిజిస్ట్రేషన్లు సాగుతూనే ఉన్నాయి. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జీహెచ్‌ఎంసీల మధ్య కొరవడిన సమన్వయంతో అత్యంత ఖరీదైన స్థలానికి రెక్కలు వచ్చాయి. హైరైజ్ బిల్డింగ్స్‌కు జీహెచ్ఎంసీ అనుమతులు జారీ చేస్తూనే ఉంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలోనూ ఖానామెట్ సర్వే నం.41లోని చాలా భూములు నిషేధిత జాబితాలోనే ఉన్నాయి. అయినప్పటికీ కొనుగోలు, అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వందలాది డాక్యుమెంట్లు అయ్యాయి. అత్యంత ఖరీదైన అసైన్డ్ భూములు చేతులు మారుతున్నాయి. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, గండిపేట మండలాల్లో అమ్మేసిన అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేస్తే రూ.వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది.
ఖానామెట్ హాట్ కేక్
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నంబర్ 38,39,40లో లావణి పట్టాలు జారీ చేశారు. ఇందులో చాలా మంది అసైన్డ్(పీవోటీ) ల్యాండ్స్ యాక్ట్ 1977ని ఉల్లంఘించారు. పట్టాలు పొందిన వారు తామంతా పేదవారమని, ప్రభుత్వ భూములు కేటాయిస్తే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తామంటూ 1960 సమయంలో కోరారు. దాంతో కొందరికి ప్రభుత్వం 3 ఎకరాల నుంచి 9.17 ఎకరాల వరకు కేటాయించింది. ఈ సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిని ఫైల్ నం.A9/11992/60 ద్వారా అసైన్ చేశారు. కేవలం వ్యవసాయం చేసుకునేందుకు మాత్రమే అనుమతిచ్చింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా అమ్ముకోవడానికి వీల్లేదని స్పష్టంగా పేర్కొంది. అయితే.. లావణి రూల్స్ ఫామ్ జీ(రూల్ 9) ప్రకారం తాము అమ్ముకోవచ్చంటూ బాధితులు క్రయవిక్రయాలు సాగించారు. ఈ భూములు నిషేధిక జాబితాలో ఉండడంతో ఎవరికీ బదలాయించకూడదని, ఎవరికీ కేటాయించొద్దని అధికారులు చెప్తున్నారు. కేవలం వారసులకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. ఖానామెట్ సర్వే నం.38, 39, 40ల్లో లావణి పట్టాలు పొందిన హక్కుదారులు అమ్ముకోవడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు సైతం పొందలేదు. జీవో 1406 ప్రకారం హెరిటబుల్ మాత్రమే. ఏపీ అసైన్డ్ ల్యాండ్(పీవోటీ) యాక్ట్, 1977, సెక్షన్ 3(1) ప్రకారం సేల్, గిఫ్ట్, మార్ట్‌గేజ్, ఎక్స్‌చేంజ్, లీజ్ వంటి హక్కులు సైతం పొందలేరు. కానీ.. ఈ అసైనీదారులు మాత్రం భూములను యథేచ్ఛగా అమ్మేశారు. అప్పటి సబ్ రిజిస్ట్రార్లు స్టాంప్ డ్యూటీ కట్టించుకొని సేల్ డీడ్స్ చేశారు. లావణి పట్టాగా రికార్డుల్లో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ శాఖ క్రయవిక్రయాలకు పాల్పడడం గమనార్హం.
ప్రజాప్రయోజనాల కోసం..
ఖానామెట్‌లోని అసైన్డ్ భూముల క్రయవిక్రయాలకు అనుమతిస్తే భవిష్యత్తులో హైటెక్స్ నుంచి కొత్త క్రాస్ రోడ్డు, మాదాపూర్ మెయిన్ రోడ్డు విస్తరణ చేయాలంటే సాధ్యం కాదు. ఈ విషయాన్ని 2005 మార్చి 3న డిప్యూటీ కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చారు. కానీ.. లావణి రూల్స్‌ను అడ్డం పెట్టుకొని తాము అమ్ముకోవచ్చునంటూ అసైనీదారులు వాదిస్తున్నారు. అయితే.. ప్రభుత్వం ఎటూ తేల్చకముందే, ఎలాంటి నిర్ణయం ప్రకటించకముందే రిజిస్ట్రేషన్ల శాఖ సేల్ డీడ్స్ చేయడం విడ్డూరంగా ఉంది. పైగా కోర్టుల్లో కేసులు పెండింగులో ఉండగానే అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇప్పటికైనా ఈ ల్యాండ్స్‌పై ప్రభుత్వం రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాల్సిన స్థలాలను ప్రైవేటు కంపెనీలు కొనుగోలు చేయడం.. హై రైజ్డ్ బిల్డింగ్స్ నిర్మించడమే కాకుండా ఒక్కో ఫ్లాట్ రూ.2 కోట్లకు పైగా విక్రయిస్తున్నాయి. అలాగే ఒక్కో టవర్ 30 నుంచి 50 అంతస్తుల వరకు నిర్మిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కాగా.. ఇప్పటికే కొన్ని కమర్షియల్ కాంప్లెక్సుల నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి.
రెగ్యులరైజేషన్ చేస్తే రూ.వేల కోట్లు: సురేష్ పొద్దార్, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్
అసైన్డ్ భూముల్లో కొన్నింటికి రెవెన్యూ అధికారులు అమ్ముకునేందుకు అనుమతులు ఇచ్చారు. ఇంకొన్నింటికి లావుణి రూల్స్ ఒప్పుకోవంటూ తెగేసి చెప్పారు. ప్రధానంగా గోపన్‌పల్లి, ఖానామెట్ భూముల్లో స్పెషల్ లావణి రూల్స్, 1950(9–జి సర్టిఫికేట్స్) ప్రకారం అంటూ మ్యుటేషన్లకు ఓకే చెప్పారు. రూ.వందల కోట్ల విలువైన ప్రాపర్టీపై నిర్ణయం తీసుకున్నారు. అలాగే హైదరాబాద్ పక్క జిల్లాల కలెక్టర్ల రిపోర్ట్‌ను బేస్ చేసుకొని కొన్ని భూములు కూడా మ్యుటేషన్ కేసులు క్లియర్ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒకటే రకం ల్యాండ్స్‌కి వేర్వేరుగా అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం గందరగోళానికి దారితీసింది. ఖానామెట్ సర్వే నం.38, 39, 40లోని అసైన్డ్ భూముల వ్యవహారాన్ని పునఃసమీక్షించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏదో ఒక నిర్ణయాన్ని త్వరితగతిన తీసుకోవాలని సూచించింది. అసైన్డ్ భూములపై రివ్యూ చేసి రెగ్యులరైజేషన్‌కు అవకాశం కల్పిస్తే కొనుగోలు చేసిన వారికీ న్యాయం దక్కుతుంది. దాంతోపాటు ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.






