ప్రభుత్వ స్థలం కనిపిస్తే కబ్జానే.. హైడ్రా ప్ర‌జావాణికి 41 ఫిర్యాదులు

by Ramesh Naini |

త‌ప్పుడు స‌ర్వేనంబ‌ర్లతో క‌బ్జాలు చేస్తున్నారు. త‌ప్పుడు ప‌త్రాలు సృష్టిస్తున్నారు.

ప్రభుత్వ స్థలం కనిపిస్తే కబ్జానే.. హైడ్రా ప్ర‌జావాణికి 41 ఫిర్యాదులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘త‌ప్పుడు స‌ర్వే నంబ‌ర్లతో క‌బ్జాలు చేస్తున్నారు. త‌ప్పుడు ప‌త్రాలు సృష్టిస్తున్నారు. ఖాళీ భూమి క‌నిపిస్తే చాలు క‌బ్జాదారులు వాలిపోతున్నారు. పాత్ర‌దారులుగా సామాన్యుల‌ను ప్ర‌వేశ పెట్టి.. సూత్ర‌దారులుగా వంద‌ల కోట్ల విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను కొల్ల‌గొట్టేస్తున్నారు. ఒక ఎక‌రం క‌బ్జా చేస్తే వంద కోట్ల‌కు పైమాటే. ఇలాంటి త‌రుణంలో రూ. ప‌దుల కోట్లు వెచ్చించి ఆ స్థ‌లాల‌ను సొంతం చేసుకునేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు’ అని హైడ్రా ప్ర‌జావాణి ఫిర్యాదుల్లో ప‌లువురు పేర్కొన్నారు. దేశ విభ‌జ‌న స‌మ‌యంలో వెళ్లిపోయిన వారి భూములు ఎక్క‌డ ఉన్న‌యో తెలుసుకుని క‌బ్జాల‌కు పాల్ప‌డుతున్నారు. రెవెన్యూ స‌రిహ‌ద్దుల్లో స‌ర్వే నంబ‌ర్ల ఓవ‌ర్‌ల్యాపింగ్‌ను, అర్బ‌న్ ల్యాండ్ సీలింగ్ భూములు ఇలా దేనినీ వ‌ద‌ల‌కుండా.. కొన్నాళ్ల‌పాటు సామాన్యుల‌తో గుడిసెలు వేయించి.. త‌ర్వాత బ‌డాబాబులు రంగంలోకి దిగి కాజేస్తున్నారంటూ హైడ్రా ప్ర‌జావాణిలో ప‌లువురు ఫిర్యాదు చేస్తున్నారు. ఉప్ప‌ల్‌లో మూడున్న‌ర ఎక‌రాల భూమి ఇలా క‌బ్జాకు గురైంద‌ని పేర్కొన్నారు. జీడిమెట్ల ఫాక్స్ సాగ‌ర్ నుంచి వెన్నెల చెరువుకు వెళ్లే 12 మీట‌ర్ల వ‌ర‌ద కాలువ‌ను క‌బ్జా చేసి నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని ఫిర్యాదు చేశారు. ఇలా సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి 41 ఫిర్యాదులందాయి. ఈ ఫిర్యాదుల‌ను హైడ్రా అడిషన‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య ప‌రిశీలించి ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు.

ఫిర్యాదులు ఇలా..

మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా ఉప్ప‌ల్ ఖ‌ల్సాలోని స‌ర్వే నంబ‌రు 644, 645లో 6 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉండ‌గా.. ఇందులో రెండున్న‌ర ఎక‌రాల భూమి మెట్రోకు కేటాయించారు. మిగిలిన భూమిలో ఎక‌ర‌న్న‌ర వ‌ర‌కూ స్థానిక వ్య‌క్తులు ఆక్ర‌మించి వాహ‌న పార్కింగ్ ఫీజులు వ‌సూలు చేస్తున్నారు. ఈ పార్కింగ్ దందాను అడ్డుకుని.. మిగిలి ఉన్న ప్ర‌భుత్వ భూమిలో ప్ర‌భుత్వ క‌ళాశాల‌ను ఏర్పాటు చేయాల‌ని స్థానికులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. స‌ర్వే నంబ‌రు 645లో జీహెచ్ఎంసీ అనుమ‌తితో 3 సెల్లార్ల‌తో7 అంత‌స్తుల భ‌వ‌నం కూడా నిర్మాణం అవుతోంద‌ని.. ఇదంతా చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంట‌నే ప్ర‌భుత్వం స్పందించి పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండ‌లం, మ‌ణికొండ ప‌రిధిలోని ముష్కిన్ చెరువుకు వెంట‌నే ఎఫ్‌టీఎల్ నిర్ధారించాల‌ని స్థానికులు హైడ్రా ప్ర‌జావాణిలో విజ్ఞ‌ప్తి చేశారు. ఎప్‌టీఎల్ నిర్ధార‌ణ కాక‌పోవ‌డంతో పై భాగంలో ఎవ‌రికి వారు క‌బ్జాల‌కు పాల్ప‌డి నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. సర్వే నంబర్లు 255, 256, 257 పరిధిలో ఉన్న ఈ చెరువు పర్యావరణ పరిరక్షణకు కీలకమైనదని, కానీ ఇటీవల చెరువు నేలను లెవెలింగ్ చేయడం, నిర్మాణాలు చేపట్టడం వంటి చర్యలు తీవ్రంగా పెరిగిపోయాయని వారు తెలిపారు. చెరువు విస్తీర్ణం తగ్గడం, వర్షాకాలంలో వరదలు వచ్చే అవకాశం పెరగడం, జీవవైవిధ్యం దెబ్బతినడం, నీటి నాణ్యత పడిపోవడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నివాసులు వాపోయారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని చిన్న కమల ప్రాంతంలో నాలా ఆక్రమణలు జ‌రుగుతున్నాయ‌ని హనుమాన్ టెంపుల్ వెల్ఫేర్ అండ్ యూత్ అసోసియేషన్ సభ్యులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తిరుమ‌ల‌గిరి వార్డు నెంబర్ 7లో ఉన్న నాలాను కొంతమంది పూర్తి స్థాయిలో ఆక్రమించుకొని తమ ప్రాపర్టీగా చెబుతున్నార‌ని ఆరోపించారు. ప్లాట్ నెంబర్ 1, సర్వే నెంబర్ 17 సమీపంలో ఉన్న ఈ నాలా సాఫీగా సాగేద‌ని ఆక్రమణలతో వ‌ర‌ద త‌మ ప్రాంతాల‌ను ముంచెత్తుతోంద‌ని వాపోయారు. నాలామీదే దుకాణాన్ని న‌డుపుతున్నార‌ని.. గ‌తంలో దీనిని తొల‌గించ‌గా.. మ‌ళ్లీ పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. ద‌గ్గ‌ర్లో ఆల‌యం ఉండ‌డం వ‌ల్ల భ‌క్తుల‌కు కూడా ఇబ్బందిగా ప‌రిణ‌మించింద‌ని పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లోని బీహెచ్ఈఎల్ హెచ్ఐజీ ఫేజ్ –2, ఉషోదయ ఎన్క్లేవ్ ప్రాంతంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్క్ ఆక్ర‌మ‌ణ‌కు గురౌతోంద‌ని ఎగ్జిక్యూటివ్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. నందనం ట్రీ పార్క్ (పశ్చిమ భాగం)ను గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించి, పార్క్ సరిహద్దులలో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టారు. ప్రజల వినియోగం కోసం కేటాయించిన పార్క్ ని చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు పేర్కొన్నారు. హైడ్రా వెంటనే జోక్యం చేసుకుని అక్రమ నిర్మాణాలను ఆపి.. పార్క్ భూమిని రక్షించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story