వరి వేస్తే ఉరే అన్న దొర.. తన పొలంలో వరి వేసి అమ్మిండు: సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-19 09:36:29  IST  )

నల్లమల్ల నుంచి సీఎంగా మాట్లాడుతుంటే తన గుండె ఉప్పొంగుతోందిని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

వరి వేస్తే ఉరే అన్న దొర.. తన పొలంలో వరి వేసి అమ్మిండు: సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లమల్ల నుంచి సీఎంగా మాట్లాడుతుంటే తన గుండె ఉప్పొంగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ఆయన అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. అనంతరం మాచారంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సభా వేదికపై నల్లమల్ల డిక్లరేషన్‌ను, మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. ఈ డిక్లరేషన్‌తో ఆదివాసీలు, బంజారాలు, చెంచులకు లబ్ధి చూకూర్చుతూ.. గిరిజన సంక్షేమానికి రూ.12,600 కోట్లు పనులు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు నల్లమల్ల ప్రాంతం అంటేనే వెనుకబడిన ప్రాతంగా పరిగణించే వారని అన్నారు. ఎక్కడి నుంచో ఓ నాయకుడు వచ్చి నల్లమల్లను అభివృద్ధి చేయాలనే వారని.. సీఎంగా నల్లమల్ల నుంచి మాట్లాడుతుంటే తన గుండె ఎంతో ఉప్పొంగిపోతోందని కామెంట్ చేశారు. పాలమూరు, నల్లమల్ల ప్రాంత వాసినని తాను గర్వంగా చెప్పుకుంటానని తెలిపారు. దేశంలో ఎక్కడి ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా.. పాలమూరు వాళ్లనే పిలిచే వారనే గుర్తు చేశారు. పాలమూరు ప్రజలు కట్టిన ప్రాజెక్టులు నేడు దేశానికి వెన్నుముకగా నిలిచాయని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి నిలబెట్టిన ఈ ప్రాంత రుణాన్ని తీర్చుకుంటామని కామెంట్ చేశారు.

పోరు భూములను సాగు భూములుగా మార్చాం..

నల్లమల్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిచాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు పోడు భూములు.. పోరు భూములుగా మారాయని కామెంట్ చేశారు. ఇప్పుడే అవే భూములను తాము సాగు భూములుగా మార్చేశామని తెలిపారు. సోలార్ విద్యుత్ మోటార్లతో పోడు భూములను వ్యవసాయ భూములుగా మార్చేందుకే ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని తీసుకొచ్చామని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఆడబిడ్డలు సోలార్ విద్యుత్ ప్లాంట్లు పెట్టుకునే అవకాశం కల్పించాలన్నారు. రైతులందరికీ ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఇవ్బబోతున్నామని అన్నారు. నల్లమల్ల ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని సహచర మంతులను కోరుతున్నా అంటూ డిప్యూటీ సీఎం భట్టితో పాటు అక్కడికి మంత్రులను ఉద్దేశించి కామెంట్ చేశారు. ప్రపంచంలోనే అచ్చంపేటను ఆదర్శంగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

పోడు రైతులకు బేడీలేశారు..

పోడు రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర గత పాలకులదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజన రైతుల కోసం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ సహా అనేక పథకాలను అమలు చేశామన్నారు. వరి వేసుకుంటే ఉరే అన్న దొర తన పొలంలో వరి వేసుకుని అమ్ముకున్నాడని మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రికార్డు స్థాయిలో కోటీ 35 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి సాధించామని అన్నారు. పండిన సన్న బియ్యాన్ని ప్రతి పేదవాడికి అందేలా చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల పేద కుటంబాలకు ఉచితంగా విద్యుత్ అందజేస్తున్నామని తెలిపారు. మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు పథకం అమలు విజయవంతంగా అమలు అవుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

సన్న బియ్యం తింటున్నారా.. లేదా?

రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుపై సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో బహిరంగ సభకు హాజరైన ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం తింటున్నారా లేదా అని ప్రశ్నించారు. అందుకు జనం తింటున్నామని సమాధానమిచ్చారు. తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, పేదల ఇళ్లకు వెళ్లి సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారని గుర్తు చేశారు. సోలార్ ఉత్పత్తి ద్వారా రాష్ట్రంలో మహిళలు అదానీతో పోటీ పడాలన్నారు. మహిళా సంఘాలను పెట్రోల్ బంక్‌లకు యజమానులను చేశామని, హైటెక్ సిటీలో తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు 3 ఎకరాల స్థలం కేటాయించామని అన్నారు. మహిళలే ఆర్టీసీ బస్సులను అద్దెకు తిప్పుకునేలా చేశామని తెలిపారు. ఇక కేంద్రంలో ప్రతిపక్షం ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి అభినందించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

50 ఏళ్ల తర్వాత ఇందిరా గాంధీని గుర్తు చేసుకుండ్రు..

పహల్గాం ఉగ్రదాడి తరువాత ప్రధాని అంటే ఇందిరా గాంధీలా ఉండాల్సింది అనే చర్చ దేశం అంతటా వస్తుందని అన్నారు. ఇందిరమ్మ గతంలో పాకిస్థాన్‌తో యుద్ధం చేసి ఆ దేశాన్ని రెండు ముక్కలు చేసిందని గుర్తు చేశారు. మళ్లీ 50 ఏళ్ల తరువాత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పన్నుల సేకరణలో కూడా తెలంగాణే ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. పాలమూరు వాసులకు పాలన చేతకాదన్నారని.. ఇవాళ అదే పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని నడుపుతున్నాడనే విషయాన్ని మరువొద్దని కామెంట్ చేశారు. స్వేచ్ఛను దేశానికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని.. అందరికీ భూములిచ్చి ఆత్మగౌరవం నింపాలన్నది కాంగ్రెస్ నినాదమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story