- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తి లేకుంటే భయమైనా ఉండాలి.. తల్లిదండ్రుల పోషణ బిల్లుపై సీఎం రేవంత్ రెడ్డి
తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణకు తెలంగాణ అసెంబ్లీలో కొత్త బిల్లు ఆమోదం. రేమండ్స్ మాజీ అధినేత విజయ్ పథ్ సింఘానియా ఉదంతాన్ని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తల్లిందండ్రుల హక్కులు కాపాడాలనే ఆలోచనతోనే 'తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం మరియు పర్యవేక్షణ బిల్లు-2026’ బిల్లును తీసుకువచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భక్తితో కాకపోయినా భయంతోనైనా తల్లిదండ్రులను చూసుకోవాలనేదే మా ప్రయత్నం అన్నారు. ఇవాళ ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో మాట్లాడిన సీఎం.. పురాణాలలో మాతృ పితృ భక్తికి శ్రవణ కుమారుడి కథ అద్దం పడుతోందని తల్లిదండ్రులను కావడిపై మోసిన శ్రవణ కుమారుడిని ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రులను సేవిస్తే ఎలాంటి చట్టాలు అవసరం లేదన్నారు. శ్రీరాముడు అడవికి వెళ్లాడనే బాధతోనే దశరథుడు చనిపోయారని అన్నారు.
రేమండ్స్ అధినేత అంశం ప్రస్తావన:
ఈ సందర్భంగా నిన్న ముంబైలో మరణించిన ప్రఖ్యాత దుస్తుల బ్రాండ్ రేమండ్స్ మాజీ ఆధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్ పథ్ సింఘానియా (87) అంశాన్ని సీఎం ప్రస్తావించారు. వ్యాపారవేత్తగా విజయవంతమైన జీవితాన్ని గడిపిన సింఘానియా చివరికి కొడుకు చేసిన ద్రోహంతో అనామికుడిగా తనువు చాలించాల్సి వచ్చిందని చెప్పారు. విజయ్ పథ్ సింఘానియా తన జీవితకాలపు కష్టార్జితాన్ని, సుమారు రూ. 1,000 కోట్ల విలువైన రేమండ్ సామ్రాజ్యపు వాటాలను కుమారుడు గౌతమ్ సింఘానియాకు 'గిఫ్ట్ డీడ్' ద్వారా అప్పగించిన తర్వాత ఆయన జీవితం అత్యంత విషాదకరంగా మారిందని గుర్తు చేశారు. ఆస్తి చేతికి రాగానే గౌతమ్ తన తండ్రిని నిర్లక్ష్యం చేయడమే కాకుండా, ముంబైలోని ప్రతిష్టాత్మక 'జేకే హౌస్'లో ఆయనకు దక్కాల్సిన నివాసాన్ని కూడా నిరాకరించి బయటకు పంపించేశారన్నారు. తన కారు, డ్రైవర్ సిబ్బందిని కూడా గౌతమ్ తొలగించడంతో ఆయన దక్షిణ ముంబైలో ఒక సాధారణ అద్దె ఇంట్లో నివసించాల్సి వచ్చిందన్నారు. ఒకప్పుడు విమానాలలో తిరుగుతూ అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన విజయ్ పథ్ సింఘానియా ఆస్తి మొత్తం కొడుకు పరం చేయడంతో చివరకు కనీస సౌకర్యాలు లేక, సొంత ఖర్చుల కోసం కోర్టులను ఆశ్రయించాల్సిన దుర్భర స్థితికి చేరుకున్నారన్నారు. తన ఆత్మకథ 'An Incomplete Life'లో ఈ చేదు అనుభవాలను వివరించారని "పిల్లలకు సర్వస్వం ఇచ్చేసి నేను పెద్ద తప్పు చేశాను, ఏ తండ్రీ నాకంటే దారుణమైన స్థితిని అనుభవించకూడదు" అని ఆయన ఆ పుస్తకంలో ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఒకవైపు ఆస్తిపాస్తులు లేకపోయినా తన భుజాలపై తల్లిదండ్రులను మోసి పుణ్యక్షేత్రాలు చూపించిన శ్రవణ కుమారుడి గాథ అజరామరమైతే.. అనామకుడిగా కన్నుమూసిన విజయ్ పథ్ సింఘానియా ఉదంతం ఆధునిక సమాజపు చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తోందన్నారు.
ఎంతో బాధ్యతతో, భావోద్వేగంతో తెచ్చాం:
ఈ బిల్లును ఎంతో బాధ్యతతో, భావోద్వేగంతో ఆలోచన చేసి తీసుకువస్తున్నామని సీఎం చెప్పారు. తల్లిదండ్రుల పట్ల భక్తి లేని వారికి భయం కలిగించేందుకే ఈ చట్టం అని వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ కల్పించే దిశగా ఇది ఒక కీలక అడుగు అన్నారు. మనిషి బంధాలు... అనుబంధాలను మర్చిపోయి చివరికి పేగు బంధాలను కూడా విస్మరించి... భౌతిక సుఖాలు, ఆర్థిక ప్రయోజనాలు, సంపద కోసం పాకులాటల్లో మునిగిపోయారన్నారు. అనాథలుగా మారిన తల్లి దండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం ఈ సమాజానికి మంచిది కాదు అన్నారు. మన దేశంలో పిల్లల సామాజిక భద్రత, మహిళల భద్రత, హక్కులకు రాజ్యాంగ రక్షణతో పాటు, అనేక చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (ఏ) ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్య హక్కు, ఆర్టికల్ 24 ప్రకారం ప్రమాదకర పనుల్లో బాల కార్మికుల నిషేధం, అనాథలు, నిరాశ్రయ పిల్లలు, నేరాల్లో చిక్కుకున్న పిల్లల సంరక్షణ కోసం జువెనైల్ జస్టిస్ యాక్ట్ (2015), పిల్లలపై లైంగిక దాడులు, వేదింపుల నుంచి రక్షణ కోసం పోక్సో యాక్ట్ (2012) ఉంది. రైట్ టు ఎడ్యూకేషన్ యాక్ట్ (2009), 14 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోకూడదని చైల్డ్ లేబర్ యాక్ట్, బాల్య వివాహాల నిషేధం చట్టం, మన దేశానికి పిల్లల హక్కులు, రక్షణ విషయంలో అనేక అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఉన్నాయి. మహిళల విషయానికి వస్తే... గృహహింస నుంచి వాళ్లకు భద్రత కల్పించడం కోసం చట్టం, లైంగిక నేరాలకు సంబంధించి నిర్భయ చట్టం, వరకట్న నిషేధ చట్టం, మహిళల గౌరవం – హక్కుల పరిరక్షణకు వృద్ధుల సామాజిక భద్రతకు సంబంధించి మన దేశంలో చట్టాలు ఉన్నాయన్నారు. పిల్లలు తమ తల్లి దండ్రులను చూసుకోవడం చట్టబద్ధ బాధ్యతగా చేస్తూ “maintenance and welfare of parents and senior citizens act 2007” తో పాటు ఇంకా మరికొన్ని చట్టాలు ఉన్నాయి. అయినా సమాజంలో తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో జరుగుతోన్న వివక్ష, నిర్లక్ష్యం మనం చూస్తున్నామన్నారు.
అలాంటి వారిని బహిష్కరించాలి:
బతికున్నప్పుడు గుప్పెడు మెతుకులు పెట్టని బిడ్డలు, చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం అత్యంత విషాదం అన్నారు. పిల్లలను కనగలం కానీ, వాళ్ల బుద్ధులను కనగలమా అని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఈ రోజు కొందరు తల్లిదండ్రుల పరిస్థితి ఇదే. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. లేదా ఎక్కువ మంది పిల్లలను కనే వాళ్లు. దాని వల్ల ఒకరు కాకపోయినా ఇంకొకరైనా తల్లిదండ్రుల సంరక్షణ చూసుకునే వాళ్లు. ఈ రోజుల్లో పరిస్థితులు మారాయి… కుటుంబ నియంత్రణతో ఒక్కరో ఇద్దరికో పరిమితమయ్యారు. కుటుంబం అంటే కొడుకైనా, కూతురైనా ఇద్దరూ సమానమే. ఆడబిడ్డలకు తల్లిదండ్రులకు ప్రేమ ఉన్నా… మెట్టినింటి బాధ్యతలతో ఏమీ చేయలేకపోతున్నారన్నారు. దీంతో నాకు తెలిసిన ఒక ప్రజా ప్రతినిధి తండ్రికి క్యాన్సర్ వస్తే ఆయనను చూసుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఇటీవలే ఆ తండ్రి మరణించారు. తల్లిదండ్రులను చూసుకోలేని వారిని సమాజం బహిష్కరించాలన్నారు. ఒక సామాజిక బాధ్యతగా ఈ బిల్లును తీసుకువస్తున్నామని ఈ చట్టంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని కాదు. ఈ చట్టంతో వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించేందుకే మా ప్రయత్నం అన్నారు. ఏ తల్లి దండ్రులు అనాథలుగా ఉండ కూడదు, చివరి రోజుల్లో వాళ్ల బాగోగుల కోసం ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఈ బిల్లును తెస్తున్నామని చెప్పారు.






