iBOMMA రవి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ.. డిసెంబర్ 3కి వాయిదా

by Ramesh Naini |   (  Updated:2026-02-12 15:32:25  IST  )

సంచలనం సృష్టించిన పైరసీ వెబ్‌సైట్‌ iBOMMA రవిని నాంపల్లి కోర్టు ముందు పోలీసులు ఐదు కేసుల్లో హాజరు పరిచారు. కాగా విచారణ డిసెంబర్ 3కి వాయిదా పడింది.

iBOMMA రవి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ.. డిసెంబర్ 3కి వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంచలనం సృష్టించిన పైరసీ వెబ్‌సైట్‌ iBOMMA రవిని నాంపల్లి కోర్టు ముందు పోలీసులు ఐదు కేసుల్లో తాజాగా హాజరుపరిచారు. ఈ కేసులన్నింటిలో పీటీ వారెంట్‌లకు కోర్టు అనుమతి లభించినట్లు సమాచారం. రవి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 3న కోర్టు మళ్లీ విచారణ చేపట్టనుంది. ఇప్పటికే రెండు విడతల్లో ఎనిమిది రోజుల పాటు పోలీసులు రవిని ప్రశ్నించారు. న్యాయనిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు త్వరలోనే బెయిల్‌ మంజూరు అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఇటీవల ముగిసిన మూడు రోజుల పోలీసుల విచారణలో రవి పలు కీలక విషయాలు వెల్లడించినట్లు ప్రచారం సాగుతోంది. ఇకపై పూర్తిగా పైరసీ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని, అసలు సినిమాలకు సంబంధం ఉన్న ఏ పని చేయనని ఆయన తెలిపినట్లు సమాచారం. iBOMMA అనే పేరుకు సంబంధించిన అంశం కూడా విచారణలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. 'ఐ' అంటే తన ఇంటిపేరు కాదు, ‘ఇంటర్నెట్’‌ను సూచించే పదమని రవి వివరించినట్లు చెబుతున్నారు. అలాగే వైజాగ్ ప్రాంతంలో సినిమాను ‘బొమ్మ’ అని పిలిచే నేపథ్యంతో ‘ఇంటర్నెట్ బొమ్మ’ అనే అర్థంలోనే iBOMMA అనే పేరును ఉపయోగించినట్లు రవి వెల్లడించినట్లు సమాచారం. కాగా, రవి బెయిల్ పిటిషన్‌పై విచారణ డిసెంబర్ 3కి వాయిదా పడింది.

Next Story