గుర్తు లేదు.. మర్చిపోయా.. విచారణకు సహకరించని ఐబొమ్మ రవి.. పొంతన లేని సమాధానాలు!

by Ramesh Naini |

ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సీసీఎస్ పోలీసులు కస్టడీలో తీవ్రంగా ప్రశ్నిస్తున్నప్పటికీ, ఆశించిన కీలక సమాచారం బయటకు రావడం లేదని తెలుస్తోంది.

గుర్తు లేదు.. మర్చిపోయా.. విచారణకు సహకరించని ఐబొమ్మ రవి.. పొంతన లేని సమాధానాలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సినిమా పైరసీ కేసులో ప్రధాన నిందితుడు, ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సీసీఎస్ పోలీసులు కస్టడీలో తీవ్రంగా ప్రశ్నిస్తున్నప్పటికీ, ఆశించిన కీలక సమాచారం బయటకు రావడం లేదని తెలుస్తోంది. మూడో రోజు విచారణ అనంతరం కూడా రవి సహకరించే సూచనలు చూపకపోవడంతో అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్నలకు సంబంధంలేని, పొంతన లేని సమాధానాలు ఇస్తూ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని విచారణ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా, యూజర్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌లు వంటి కీలకమైన వివరాలు అడిగినప్పుడు ‘గుర్తు లేదు.. మర్చిపోయా’ అని సమాధానం ఇస్తున్నట్లు సమాచారం.

ఎథికల్‌ హ్యాకర్ల సాయం తీసుకున్న పోలీసులు

(ibomma Ravi) రవి వద్ద లభించిన హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు వంటి డిజిటల్ పరికరాలను ఎథికల్ హ్యాకర్ల సహాయంతో అధికారులు తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో దాగి ఉన్న సమాచారమే కేసు దర్యాప్తుకు కీలకమవుతుందని భావిస్తున్నారు. కస్టడీ మిగిలిన రోజుల్లోనైనా రవి సహకరిస్తాడా? లేక టెక్నికల్ సాక్ష్యాలతోనే ముందుకు సాగుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఐబొమ్మ రవి ఐదు రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ్టి విచారణ ముగిసింది. ఆస్తులు, తన ఏజెంట్లు, గేమింగ్‌ యాప్‌ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై విచారణ అధికారులు ఆరా తీశారు. పైరసీ చేయడంలో తనకు ఎవరెవరు సహకరించారనే వాటిపై కూపీ లాగుతున్నారు.

ప్రతి 20 రోజులకు ఒకసారి విదేశాలకు - క్రైమ్స్‌ అడిషనల్‌ సీపీ

ఈ వ్యవహారంపై క్రైమ్స్‌ అడిషనల్‌ సీపీ శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఐబొమ్మ రవి పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని అన్నారు. ఎథికల్ హ్యాకర్ల సాయంతో సర్వర్ ఐపీలను గుర్తిస్తామని తెలిపారు. నెదర్లాండ్స్, ఫ్రాన్స్‌లో సర్వర్ ఐపీలు ఉన్నాయని, ప్రతి 20 రోజులకు ఒకసారి ఐబొమ్మ రవి విదేశాలకు వెళ్తాడని తెలిపారు. అలాగే అతని బ్యాంక్ అకౌంట్స్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు.

Next Story