ముగిసిన ఐబొమ్మ రవి 5 రోజుల కస్టడీ.. రేపు బెయిల్‌పై వాదనలు

by Naga Rani Yarlagadda |

ఐదురోజుల విచారణలో పోలీసులు రవి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. రవి ఒక్కడే పైరసీ చేసినట్లు నిర్ధారించారు.

ముగిసిన ఐబొమ్మ రవి 5 రోజుల కస్టడీ.. రేపు బెయిల్‌పై వాదనలు
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమాలను పైరసీ చేసి వాటిని ఐబొమ్మ, బొప్పం టీవీ వెబ్ సైట్లలో పెట్టిన ఐబొమ్మ రవిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే అతడిని సీసీఎస్ పోలీసులు ఐదురోజుల కస్టడీకి తీసుకోగా.. నేటితో ఆ కస్టడీ ముగిసింది. ఐదురోజుల విచారణలో పోలీసులు రవి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. రవి ఒక్కడే పైరసీ చేసినట్లు నిర్ధారించారు. టెలీగ్రామ్ ద్వారా పైరసీ సినిమాలను కొన్నట్లుగా తెలుసుకున్నారు. అతని బ్యాంక్ అకౌంట్లో రూ.20 కోట్ల లావాదేవీలను గుర్తించారు. సినిమాలు చూసేందుకు వెబ్ సైట్ ఓపెన్ చేసిన వారికి ఏపీకే లింక్స్ పంపి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేశాడని, ఆ నిధులను భారత్ లో ఉన్న IDFC బ్యాంకుకు మళ్లించినట్లు గుర్తించారు. కస్టడీ ముగిసిన అనంతరం రవిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇక కస్టడీలో తొలిరోజు వెబ్ సైట్లు, సర్వర్లు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో రవికి ఉన్న సంబంధాలు, ట్రాన్సాక్షన్లపై పోలీసులు విచారణ చేశారు. రెండోరోజు ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ లో ప్రత్యక్షమైన సినిమాలు, బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నించారు. మూడోరోజు రవి వాడిన ఐపీ అడ్రస్ ల గురించి సీపీ సజ్జనార్ విచారించారి. ఎథికల్ హ్యాకర్లను పిలిపించి సర్వర్లు, ఇతర అంశాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీశారు. నాలుగవ రోజు బ్యాంక్ అకౌంట్ల ట్రాన్సాక్షన్లు, విదేశాల్లో ఉన్న నెట్ వర్క్ లు, బెట్టింగ్ యాడ్స్ నుంచి వచ్చిన సొమ్మును వాడిన తీరుపై ప్రశ్నించారు. అలాగే ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో ఉన్న డొమైన్ల కొనుగోలుపై కూడా రవిని ప్రశ్నించారు.

కాగా.. విచారణలో రవి తమకు పూర్తిగా సహకరించలేదని పోలీసులు చెప్తున్నారు. నాల్గవ రోజు విచారణలో గుర్తులేదు, మర్చిపోయానని సమాధానాలివ్వడంతో ఖంగుతిన్నామన్నారు. పోలీసుల వాదనను రవి తరపు అడ్వొకేట్ శ్రీనాథ్ తెలిపారు. విచారణకు రవి సహకరించలేదన్నది అవాస్తవమని పేర్కొన్నారు. రేపే రవి బెయిల్ పై వాదనలు జరుగుతాయన్నారు. రవిపై మొత్తం 5 కేసులు నమోదవ్వగా.. ఒక కేసులోనే రిమాండ్ విధించారని తెలిపారు. ఒక్కేకేసులో పీటీ వారెంట్ సపరేట్ గా వేస్తుండటంతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సూచించిందన్నారు. 27న రవిని కోర్టులో హాజరు పరచాలని నాంపల్లి కోర్టు ఆదేశించినట్లు తెలిపారు.

Next Story