IAS Transfers: ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన.. త్వరలోనే భారీగా ఐఏఎస్‌ల బదిలీ?

by Kema Shiva Kumar |

త్వరలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి.

IAS Transfers: ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన.. త్వరలోనే భారీగా ఐఏఎస్‌ల బదిలీ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. ఆ జాబితాలో జిల్లా కలెక్టర్లు, డైరెక్టర్లు, కమిషనర్లు, సెక్రెటరీలు ఉంటారని తెలిసింది. పనితీరు సరిగాలేని బ్యూరోక్రాట్స్‌ను పక్కకు తప్పించేందుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రక్రియ మొత్తం కేబినెట్ విస్తరణ తర్వాతే ఉంటుందని టాక్. ఇటీవలి కాలంలో కొందరు కలెక్టర్లపై వరసగా ఫిర్యాదులు వస్తుండటంతో వారిని అక్కడి నుంచి బదిలీ చేసే అవకాశాలు అధికంగా ఉన్నట్లు సెక్రెటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే తమకు అప్పగించిన శాఖలను పట్టించుకోవట్లేదని ఆరోపణలు వస్తున్న సెక్రెటరీలను సైతం తప్పించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది.

తీరుమారని కలెక్టర్లపై బదిలీ వేటు

గ్రామాల పర్యటన, గురుకులాలను సందర్శించాలని ఆ మధ్య జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో సీఎం రేవంత్ గట్టిగానే చెప్పారు. అనంతరం కొందరు కలెక్టర్ల పనితీరులో మార్పువచ్చినా, మరికొందరిలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. జిల్లా హెడ్‌క్వార్టర్ నుంచి కాలు బయట పెట్టడంలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి ఆఫీసర్లను అక్కడి నుంచి తప్పించేందుకు సీఎంఓ కసరత్తు చేస్తునట్లు తెలిసింది. కొందరు కలెక్టర్లు పొలిటికల్ లీడర్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని.. రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, మంత్రులు, ఎమ్మెల్యేల సూచనలు సైతం పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అలాంటి ఆఫీసర్లను అక్కడి నుంచి బదిలీ చేసి, సమర్ధులకు బాధ్యతలు అప్పగించనున్నారు.

మంత్రులతో పేచీలు.. సెక్రెటరీలు అవుట్

కొందరు సెక్రెటరీలు, డైరెక్టర్లు సంబంధిత శాఖల మంత్రులతో పేచీలు పడుతున్నట్లు తెలిసింది. మంత్రి ఓ విధంగా చెబితే అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్న ఐఏఎస్‌లను ఆయా శాఖల నుంచి తప్పించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. కొందరు సెక్రెటరీల పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలున్నాయి. తమ వద్దకు వచ్చిన ఫైళ్లను వెనువెంటనే క్లియర్ చేయడం లేదని, చివరికి మంత్రులు అడిగితే తప్పా సంబంధిత పైళ్లపై సంతకం పెట్టడం లేదని ఆరోపణలున్నాయి. చివరికు రెగ్యులర్ ఫైళ్లను కూడా రోజుల కొద్ది పెండింగ్‌లో పెడుతున్నట్లు సెక్రెటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తమ శాఖల సెక్రెటరీలను మార్చాలని కొందరు మంత్రులే ఏకంగా సీఎంకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. అలాంటి సెక్రెటరీలు, డైరెక్టర్లను అక్కడినుంచి తప్పించి మంత్రులు సూచించిన ఆధికారులను అపాయింట్ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

కేబినెట్ విస్తరణ తరువాతే మార్పులు..

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఐఏఎస్‌ల బదిలీలకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ, కేబినెట్ విస్తరణ ఉంటుందని ఊహగానాల కారణంగా వాయిదా పడినట్లు తెలిసింది. కేబినెట్ విస్తరణ తర్వాత ప్రస్తుతమున్న మంత్రుల కోరిక మేరకు ఐఏఎస్‌ల అపాయింట్మెంట్ ఉండాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. కొందరు సెక్రెటరీలు, డైరెక్టర్లు బీఆర్ఎస్ హయాం నుంచి ఇప్పటివరకు ఒకే శాఖలో పనిచేస్తున్నారు. అవసరమైన ఆఫీసర్లను కొనసాగిస్తూ, మిగతా వారిని అక్కడి నుంచి తప్పించి కొత్త వారిని అపాయింట్ చేసే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

Next Story