ACB: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ స్పీడ్.. అర్వింద్‌ కుమార్‌ పై ప్రశ్నల వర్షం!

by Prasad Jukanti |   (  Updated:2025-07-03 07:06:57  IST  )

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ స్పీడ్ పెంచింది.

ACB: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో  ఏసీబీ స్పీడ్.. అర్వింద్‌ కుమార్‌ పై ప్రశ్నల వర్షం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫార్ములా -ఈ కార్ రేస్ కేసులో (Formula E Car Race Case) ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో 2ఏ గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ (Arvind Kumar) ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి అర్వింద్ కుమార్ వచ్చారు. ఈ కేసులో అర్వింద్ ను ఈ ఏడాది జనవరిలోనే ఏసీబీ ప్రశ్నించి స్టేట్ మెంట్ నమోదు చేసింది. అయితే గత నెల 16న ఇదే కేసులో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన స్టేట్ మెంట్, ఏ3 గా ఉన్న హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి గతంలో ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ఇవాళ అర్వింద్ కుమార్ ను ఏసీబీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే గత విచారణ సందర్భంగా అర్వింద్ కుమార్ అఫ్రూవర్ గా మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ అర్వింద్ కుమార్ ఇవ్వబోయే వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుందని, ఇవాళ చెప్పబోయే అంశాల ఆధారంగా కేసు దర్యాప్తులో కీలక పరిణామాలకు ఆస్కారం ఉందనే చర్చ జరుగుతోంది. నిజానికి కొద్ది రోజుల క్రితమే అర్వింద్ కుమార్ ను ఏసీబీ ప్రశ్నించాలని భావించినా ఆయన విదేశీ పర్యటనలో ఉండటంతో వాయిదా వేసింది. తాజాగా ఆయన విదేశాల నుంచి తిరిగి రావడంతో విచారణకు రావాల్సిందిగా నిన్న నోటీసులు పంపిందిం. నోటీసులు అందడంతో అర్వింద్ కుమార్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది.

Next Story