నాకు టికెట్ రాకుండా చేసిందెవరో త్వరలో చెప్తా: మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-10 06:22:04  IST  )

జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ (Congress) పార్టీలో కాకరేపుతోంది.

నాకు టికెట్ రాకుండా చేసిందెవరో త్వరలో చెప్తా: మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ (Congress) పార్టీలో కాకరేపుతోంది. టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. తనకు జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ రాకుండా అడ్డుపడింది ఎవరో త్వరలో చెబుతానని అన్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను అర్హుడిని కాదా.. అని రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ప్రశ్నించారు. కష్ట కాలంలో పార్టీ కోసం పని చేసింది ఎవరో పెద్దలు మర్చిపోయారని కామెంట్ చేశారు. అభ్యర్థి ఎంపికలోనూ తనను సంప్రదించకపోవడం బాధ కలిగించిందని అన్నారు.

జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో ఇప్పుడు మాత్రమే లోకల్, నాన్ లోకల్ ఇష్యూ ఎందుకొచ్చిందో చెప్పాలన్నారు. గతంలో కామారెడ్డి (Kamareddy)లో పోటీ చేసినప్పుడు ఆ విషయంలో ఎందుకు గుర్తు రాలేదని ఫైర్ అయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తాను ఎక్కడైనా పోటీ చేయవచ్చని అన్నారు. వాళ్లు తొక్కుకుంటూ పోతే.. మేం ఎక్కుకుంటూ పోతామని ధ్వజమెత్తారు. కార్యకర్తలతో భేటీ తర్వాత భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తానని తెలిపారు. 40 ఏళ్ల నుంచి తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని.. మనోభావాలు దెబ్బతిన్న చాలామంది తన దగ్గరకు వస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలో ఉన్నప్పుడు నా హక్కుల కోసం నేను మాట్లాడొద్దా అని అంజన్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.

Next Story