నిరూపిస్తే రాజీనామా చేస్తా.. హరీశ్ రావుకు మంత్రి అడ్లూరి చాలెంజ్

by Prasad Jukanti |   (  Updated:2026-06-16 13:00:13  IST  )

గురుకులాల టెండర్లలో రూ.2వేల కోట్ల స్కామ్ జరిగిందని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అడ్లూరి లక్ష్మణ్ హరీశ్ రావుకు సవాల్ విసిరారు.

నిరూపిస్తే రాజీనామా చేస్తా.. హరీశ్ రావుకు మంత్రి అడ్లూరి చాలెంజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గురుకులాల్లో కిరాణ టెండర్లలో రూ.2000 కోట్ల కుంభకోణం జరిగిందని, సొంత శాఖల టెండర్లపై మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్‍కు కనీస అవగాహన లేదని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. రూ.2 వేల కోట్ల స్కాం జరిగిందని హరీశ్ రావు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. ప్లేస్‌ నువ్వే చెప్పు.. నేను.. మా అధికారులంతా వస్తాం.. నిరూపించకపోతే రాజకీయాల నుంచి వైదొలగుతావా హరీష్‌రావు? అంటూ చాలెంజ్ విసిరారు. ఇవాళ సీఎల్పీలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. టెండర్లు అన్ని పారదర్శకంగానే జరిగాయన్నారు. ఉదయం లేస్తే ఈ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే పనిగా బీఆర్ఎస్ నేతలు పెట్టుకున్నారని విమర్శించారు.

మీ సానుభూతి అక్కర్లేదు:

బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా మా ప్రభుత్వంలో జరగడం లేదని మీ మాదిరిగా గడీల పాలన మేము సాగించడం లేదన్నారు. మీ మామ చేసిన విషయాలు మీకు తెలియనట్లుగా మా ప్రభుత్వంలో ఉండదన్నారు. బీఆర్ఎస్ హయంలో ఏ మంత్రైనా స్వతంత్రంగా పని చేశారా? ఏ ఫైల్ అయినా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లాల్సిందే కదా అన్నారు. హరీశ్ రావు సానుభూతి తమకు అక్కర్లేదని వాస్తవాలు మాట్లాడాలన్నారు. పేదల పిల్లలు గొప్ప స్థాయిలో ఉండటం మీకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు.

Next Story