- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిన్ను చూడాలని ఉంది బిడ్డా.. లొంగిపో! మావోయిస్టు అమీనుద్దీన్ తల్లి యాకుబీ విజ్ఞప్తి
30 ఏళ్ల క్రితం అడవి బాట పట్టిన మావోయిస్టు ఉదయ్ కిరణ్ లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన తల్లి సయ్యద్ యాకుబీ కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మావోయిస్టు పార్టీలో చేరిన తన కుమారుడు వెంటనే లొంగిపోవాలని ఆ తల్లి అభ్యర్థిస్తోంది. ‘ఎవరూ లేరని దిగులు చెందవద్దు.. నీ కోసం మేమందరం ఉన్నాం, వెంటనే జనజీవన స్రవంతిలోకి రావాలి’ అని ఆమె వేడుకుంటోంది. మావోయిస్టు అమీనుద్దీన్ (Aminuddin) అలియాస్ ఉదయ్ కిరణ్ తల్లి సయ్యద్ యాకుబీ (Yakubi) ‘దిశ’ ప్రతినిధితో మాట్లాడింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండల పరిధిలోని తట్టుపల్లి గ్రామానికి చెందిన అమీనుద్దీన్ అలియాస్ ఉదయ్ కిరణ్, సుమారు ముప్పై ఏళ్ల క్రితం 1996లో అడవి బాట పట్టారు. అప్పటి నుంచి ఆయన మళ్లీ గ్రామం వైపు కన్నెత్తి చూడలేదు. కనీసం తండ్రి చనిపోయినప్పుడు కూడా రాలేదు. ప్రస్తుతం ‘ఆపరేషన్ కగార్’ నేపథ్యంలో మావోయిస్టులు వరుసగా లొంగిపోతున్న క్రమంలో తన కొడుకు కూడా తిరిగి రావాలని ఆ తల్లి కోరుకుంటోంది.
వృద్ధాప్యంలో ఉన్న తాను చనిపోయేలోపు ఒక్కసారైనా కొడుకును చూడాలని ఆమె ఆరాటపడుతోంది. ‘పెళ్లయిన కొన్నాళ్లకే అడవి బాట పట్టావు.. 30 ఏళ్లు గడుస్తున్నా కంటికి కనిపించకుండా పోయావు, నిన్ను చూడాలని ఉంది’ అంటూ ఆమె కన్నీటి పర్యంతమైంది. ప్రాణం ఉండగానే తన కొడుకు తిరిగి వస్తే కళ్లారా చూసుకుంటానని ఆమె విలపిస్తోంది.






