- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bandi Sanjay: నాకు గ్రూపుల్లేవ్.. అలాంటి వారు కన్నతల్లికి ద్రోహం చేసినట్లే: బంటి సంజయ్
స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలకు (Local body elections) నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని నాకు ఎలాంటి గ్రూపుల్లేవు అని నాది బీజేపీ గ్రూపు అని స్పష్టం చేశారు. ఎవరైనా బీజేపీ అభ్యర్ధికి కాకుండా ఇతరుల కోసం పనిచేస్తూ పార్టీ వ్యతిరేకంగా వ్యవహరిస్తే అలాంటి వారు కన్నతల్లికి ద్రోహం చేసినట్లేనన్నారు. అంతకంటే నీచమైన వంచన ఇంకోటి ఉండదని చెప్పారు. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పైస్థాయి నాయకులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఇజ్జత్ కా సవాల్‍గా తీసుకోవాలన్నారు. ఆయా నేతలు నివసించే గ్రామాలు, మండలాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తేనే ఆయా నాయకులకు పలుకుపడి ఉంటుందని స్పష్టం చేశారు. తనను ఎంపీగా గెలిపించింది కార్యకర్తలేనని, స్థానిక సంస్థల్లో వాళ్లను గెలిపించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని చెప్పారు.
అందరూ సమాయత్తం కండి:
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఏ విధంగా వచ్చినా ప్రతి ఒక్కరూ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ పూర్తిగా సన్నద్ధమైందని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. టిక్కెట్లు ఆశిస్తున్న నేతలంతా నామినేషన్లు వేసేందుకు అన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. సర్వే నివేదికలు, గెలుపే ప్రాతిపదికగా బీజేపీ రాష్ట్ర నాయకత్వమే అభ్యర్థులను ప్రకటిస్తుందని అభ్యర్థుల ఎంపిక విషయంలో నా అభిప్రాయమే ఫైనల్ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటేసి ఏం లాభం?
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామానికి రూ.5 నుండి రూ.20 లక్షల వరకు నిధులిచ్చిన ఏకైక ఎంపీని తానేనని ఇవాళ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులేనన్నారు. కేంద్ర నిధులతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా నయా పైసా ఫండ్ లేదు. గ్రామాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా ఇయ్యడం లేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెలకు చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావని కేంద్ర నిధులను కూడా దారి మళ్లించి గ్రామాలను నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. అట్లాంటప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ఏం లాభం? వాళ్లు పైసలు ఎక్కడి నుండి తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తామన్నారు. స్థానిక ఎంపీగా, మంత్రిగా ఉన్నందున ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి పంచాయతీలను అభివృద్ది చేసే అవకాశముందని చెప్పారు. ఈ విషయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ప్రచారం ముగిసే నాటికి ఒక్కో ఇంటికి మూడుసార్లు వెళ్లి బీజేపీ అభ్యర్థికి ఓటేయాలంటూ అభ్యర్ధించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను బీఆర్ఎస్ వాడుకోవాలని చూస్తోందని ప్రజలకు వాస్తవాలు వివరించి బీజేపీ అభ్యర్థు గెలుపునకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.






