- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRSతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ (Congress) పార్టీకి చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎంపీ కల్వకుంట కవిత (Kalvakuntla Kavitha) ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ (Congress) పార్టీకి చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎంపీ కల్వకుంట కవిత (Kalvakuntla Kavitha) ఆరోపించారు. ఇవాళ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రెండు నెలలు ఆగి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాక స్థానిక ఎన్నికలు పెడితే నష్టమేంటని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. తమ పోరాటం అంతా బీసీ రిజర్వేషన్లపైనేనని అన్నారు. బీసీల అంశంపై బీఆర్ఎస్ పార్టీ సీరియస్‌గా కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. తనకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) చేసిన వ్యాఖ్యలు కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకూడదని ఈటల అంటున్నారని.. మహారాష్ట్రలో ఎన్నికలు రద్దు అయినట్లుగానే.. రాష్ట్రంలో కూడా రద్దవుతాయని చెబుతున్నారని తెలిపారు. కోర్టులను తప్పుదోవ పట్టించేలా ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ఉన్నాయని.. ఆ మాటలు ఈటల సొంతంగా మాట్లాడారా, లేక బీజేపీ (BJP) పార్టీ చెప్పించిందా అని కామెంట్ చేశారు. ఈ విషయంలో ఈటల రాజేందర్ బీసీలకు క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన బతుకమ్మ సంబురాలకు చింతమడక నుంచి లండన్ వరకు మహిళలు బ్రహ్మరథం పట్టారని కవిత అన్నారు. అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లిపై గత సర్కార్ గెజిట్ ఇవ్వలేదని విగ్రహ రూపు రేఖలు పూర్తిగా మార్చి గెజిట్ ఇచ్చి ఇంటర్‌నెట్‌లో పెట్టారని ఆరోపించారు. ఎన్నడూ జై తెలంగాణ అనని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం ఆహ్వానించదగిన విషయమని అన్నారు. గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రభుత్వం బతుకమ్మ సంబురాలు చేసింది, తెలంగాణ అస్తిత్వాన్ని చాటేందకు బతుకమ్మ సంబురాలను నిర్వహించిన ఘటన కేసీఆర్‌ది అని కొనియాడారు. కాంగ్రెస్ 42 బీసీ రిజర్వేషన్లపై జీవో విడుదల చేసి.. వారే తమ అనునయులతో తెల్లారే కోర్టులో కేసు వేయించారని, ఈ విషయంపై సోషల్ మీడియా కోడై కూస్తోందని అన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు విడుదల చేసిన రిజర్వేషన్లు గందరగోళంగా ఉన్నాయని, గ్రామాల్లో లేని సామాజికవర్గాలకు వారికి రిజర్వేషన్లు కేటాయించారని కామెంట్ చేశారు. ప్రభత్వం చేపట్టిన కులగణన డేటాను బయట పెడితే.. రిజర్వేషన్లపై స్పష్టత వస్తుందని కల్వకుంట్ల కవిత అన్నారు.






