కేటీఆర్‌ను చూస్తే నాకు జాలేస్తుంది.. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సెటైర్లు

by Kema Shiva Kumar |

సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా కేటీఆర్ (KTR) విజయోత్సవ సభలు నిర్వహిస్తుండటం చూసి జాలేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) అన్నారు.

కేటీఆర్‌ను చూస్తే నాకు జాలేస్తుంది.. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా కేటీఆర్ (KTR) విజయోత్సవ సభలు నిర్వహిస్తుండటం చూసి జాలేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) అన్నారు. ఇవాళ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో కేటీఆర్ జిల్లాల పర్యటనలు చేపడుతుండటం హాస్యాస్పదమని అన్నారు. ఓడిపోయిన సర్పంచ్‌లను ఓదార్చడానికి ఓదార్పు యాత్రలు చేస్తున్నారా అని సెటైర్లు వేశారు. అసమర్థుడి జీవయాత్రలా కేటీఆర్ టూర్లు ఉన్నాయని కామెంట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిందని తెలిపారు. మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు 53 శాతం పైగా సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నారని, బీఆర్‌ఎస్, బీజేపీ కలిపి 33 శాతం మాత్రమే సాధించాయని గుర్తు చేశారు. ముఖ్యంగా యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ 60 శాతం స్థానాలు దక్కించుకుందని, ఆలేరు నియోజకవర్గంలోనూ భారీ విజయం సాధించిందని అన్నారు.

పార్టీ చిత్తుగా ఓడిపోయినా విజయోత్సవ సభలు నిర్వహించడం చూస్తే కేటీఆర్ మానసిక స్థితి సరిగా ఉందా అని అనుమానం వస్తుందన్నారు. కవిత (Kavitha) దెబ్బకు పార్టీ కూలిపోతుందని, కేటీఆర్ పార్టీని కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌పై దౌర్జన్యాలు, పోలీసులతో బెదిరింపులు అనే ఆరోపణలు అర్థం లేని మాటలని ఖండించారు. తాము బెదిరింపులకు దిగితే బీఆర్‌ఎస్ నుంచి 4 వేల మంది సర్పంచ్‌లు ఎలా గెలిచారని ప్రశ్నించారు. గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల నుంచి గెలిచిన వారిని ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేసి పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని, చిన్న చిన్న ఘటనలు తప్ప పెద్ద ఘర్షణలు జరగలేదన్నారు. కేటీఆర్ నోటికొచ్చినట్లుగా ఆరోపణలు చేసి శునకానందం పొందుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఇక లేదని, పని ఖతమైందని స్పష్టం చేశారు. కవిత, హరీష్ రావు వంటి నేతలు పార్టీకి గుండు కొట్టే పనిలో ఉన్నారని ఆరోపించారు. వచ్చే జడ్పీటీసీ (ZPTC), ఎంపీటీసీ (MPTC) ఎన్నికల్లోనూ కాంగ్రెస్ 80 శాతం సీట్లు గెలుచుకుంటుందని, బీఆర్‌ఎస్‌కు అభ్యర్థులు కూడా లేరని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ వరుస విజయాలు సాధిస్తోందని గుర్తు చేశారు. సీఎం‌పై ఇష్టానుసారం మాట్లాడితే నాలుక కోస్తామని బీర్ల ఐలయ్య హెచ్చరించారు.

Next Story