- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
80 శాతం ధాన్యం కోనుగోళ్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వైఫల్యాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విరుచుకుపడ్డారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. ధాన్యం కొనే నాథుడు లేక రైతులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతుంటే, ఆ నిరసనల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కనీసం 35 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని, కానీ రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు మాత్రం 50 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయంటూ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. రైతుల ఇబ్బందులపై రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని విమర్శించిన కేటీఆర్.. సీఎంకు ఒక బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ ఊరికైనా పోదాం.. మీరు చెప్తున్నట్లు 80 శాతం పంట కొనుగోళ్లు జరిగాయని నిరూపిస్తే మేము ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి భూ దోపిడీ మీద ఉన్న శ్రద్ధ, భూమిని నమ్ముకున్న రైతుల మీద లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.
రూ.వేల కోట్ల భూ దందా..
రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా భూములను ఆక్రమిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. వేం నరేందర్ రెడ్డి ‘భూ హారతి’ పేరుతో కేసముద్రంలో అసైన్డ్ పట్టా భూములను ఆక్రమించారని దుయ్యబట్టారు. అలాగే శంషాబాద్‌లో సీఎం అనుచరులు ఎమ్మార్వో, కలెక్టర్ స్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఏకంగా 90 ఎకరాల సీలింగ్ భూమిని ఉత్తర్వుల ద్వారా కేటాయించుకుని వేల కోట్ల రూపాయల భూ దోపిడీకి తెరలేపారని విమర్శించారు. ఈ బాగోతం అంతా ఏసీబీ దాడిలో దొరికిపోయిందని గుర్తుచేశారు.
పోక్సో కేసు నిందితుడిని 9 రోజులు దాచారు..
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కలిసి నిందితుడిని 9 రోజుల పాటు కాపాడారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ మైనర్ బాలికకు అన్యాయం జరిగితే నేషనల్ మీడియాలో వచ్చేంతవరకు తెలుగు మీడియా కనీసం రిపోర్ట్ కూడా చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. కొంతమంది వెదవలు దీనిని హనీ ట్రాప్ అని సిగ్గులేకుండా ప్రసారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చారనే సాకుతో నిందితుడిని 9 రోజులు అరెస్ట్ చేయకపోవడం ఏంటని అన్నారు. ప్రధాని వస్తే నేరస్థులకు సెలవులు ఇస్తారా.. అని ప్రశ్నించారు. హైకోర్టు బెయిల్ నిరాకరించడంతోనే రేవంత్ రెడ్డి అరెస్ట్ డ్రామాలు, బండి సంజయ్ లొంగుబాటు నాటకాలు ఆడించారని విమర్శించారు. నిందితుడు బండి భగీరథ్‌ను 9 రోజుల పాటు సీఎం బంధువులకు చెందిన మెడికవర్ ఆసుపత్రిలోని 28వ అంతస్తులో దాచారని ఆరోపించారు. బాధితురాలి వివరాలు బయటపెట్టిన బీజేపీ నేతలపై, తప్పుడు కథనాలు రాసిన మీడియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. కొడుకును దాచిపెట్టిన బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ కేసులో మైనర్ బాలికకు న్యాయం జరగాలని పోరాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
రేవంత్.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్!
తన బావమరిది ఫామ్‌హౌస్ కేసు గురించి మాట్లాడుతున్న రేవంత్‌కు.. అక్కడ ఏమీ దొరకలేదని స్వయంగా ప్రభుత్వ అధికారులే తేల్చిచెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. హైట్ ఒకటే తక్కువ అనుకున్నా రేవంత్ రెడ్డి.. నీకు బుర్ర కూడా తక్కువే, ఏది పడితే అది మాట్లాడుతున్నావని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజంగానే 2034 వరకు సీఎంగా ఉంటాననే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉంటే, వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఆ దమ్ము లేకపోతే.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి లాక్కున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. తాను బండి సంజయ్‌లా తన కొడుకు కేసుల్లో పేరు వాడొద్దంటూ కోర్టుల నుండి 'GAG ఆర్డర్లు' తెచ్చుకునే రకం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు.






