నేను విద్యావేత్తను.. పొలిటికల్ లీడర్‌ను కాదు: ప్రీతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లడం మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.

నేను విద్యావేత్తను.. పొలిటికల్ లీడర్‌ను కాదు: ప్రీతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి (Preethi Reddy) క్లారిటీ ఇచ్చారు. బీజేపీలో చేరతారంటూ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు ఆమె తెరదించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ (Chandrasheka Tiwari)తో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజకీయ కారణాలతో కాకుండా, కేవలం విద్యా సంబంధిత కార్యక్రమాల కోసమే బీజేపీ నేతలను కలిశానని ఆమె స్పష్టం చేశారు. త్వరలో తమ విద్యా సంస్థల ద్వారా ప్రతిష్టాత్మకమైన ‘మల్లారెడ్డి ఏఐ డిజిటల్ యూనివర్సిటీ’ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. డిజిటల్ విద్యను ప్రోత్సహించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ప్రధాని మోడీకి ఆహ్వానం..

‘మల్లారెడ్డి ఏఐ డిజిటల్ యూనివర్సిటీ’ క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi)ని ఆహ్వానించామని, అయితే ఆయన రాకపై ఇంకా తేదీ ఖరారు కాలేదని ప్రీతిరెడ్డి తెలిపారు. ఆయన పర్యటన నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ నేతలను కలిసి చర్చించినట్లుగా వివరించారు. తాను విద్యావేత్తను మాత్రమేనని.. రాజకీయ నాయకురాలిని కాదని కుండబద్దలు కొట్టారు. తాము ప్రస్తుతం బీఆర్ఎస్‌లోనే ఉన్నామని, ఇకపై కూడా అదే పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. తాను కేవలం బీజేపీ నేతలే కాకుండా, ఇటీవల రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును కూడా కలిసి ఏఐ యూనివర్సిటీ కార్యక్రమానికి ఆహ్వానించినట్లుగా వెల్లడించారు. తమ విద్యా సంస్థల్లో లక్ష మందితో వందేమాతరం ఆలపించే కార్యక్రమం నిర్వహించడం తమకు గర్వకారణమని ప్రీతిరెడ్డి పేర్కొన్నారు.

Next Story