ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నేను పాత్రధారినే.. మాజీ ఎమ్మెల్యే గువ్వల సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-05 04:58:30  IST  )

అవినీతి ఆరోపణలు, వరుస విచారణలతో సతమతమవుతోన్న బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది.

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నేను పాత్రధారినే.. మాజీ ఎమ్మెల్యే గువ్వల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అవినీతి ఆరోపణలు, వరుస విచారణలతో సతమతమవుతోన్న బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) సోమవారం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్‌ ద్వారా పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ (BRS) పార్టీకి రాజీనామా చేయడంపై మరోసారి ఇవాళ ఆయన స్పందించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు.

ఈ నెల 2నే తాను పార్టీకి రాజీనామా చేశానని.. కాళేశ్వరం నివేదిక బయటకు వచ్చాకే రాజీనామా చేశానని కొందరు అనడం సరికాదన్నారు. తన లేఖలో ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయలేదని అన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నానని కామెంట్ చేశారు. ఇక ఎమ్మెల్యేల కొనగోలు కేసులో తాను సూత్రధారిని కాదని.. కేవలం పాత్రధారినే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అక్కడ ఏం జరుగుతుందో చూడమంటేనే చూసేందుకు తాను వెళ్లానని తెలిపారు. బీజేపీ (BJP)లో బీఆర్ఎస్ పార్టీ విలీనంపై తాను ఎక్కడా మాట్లాడలేదని అన్నారు. ఇంకా ఏ పార్టీలో చేరాలన్నది డిసైడ్ చేసుకోలేదని, కాంగ్రెస్‌లోకి రావాలని పెద్ద పెద్ద నేతలు అడుగుతున్నారని, సీఎం రేవంత్‌ రెడ్డి కూడా తమ నియోజకవర్గానికి చెందినవారేనని గుర్తు చేశారు. అనుచవర్గం, జిల్లా ప్రజల ఆంకాంక్ష మేరకు త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తానని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు.

Next Story