రెండు రాష్ట్రాలకు నేనే ఒక బ్రాండ్.. కాంగ్రెస్‌ సర్కార్‌పై మాజీ మంత్రి తలసానిఫైర్

by Ramesh Naini |

రెండు రాష్ట్రాలకు నేనే ఒక బ్రాండ్ నాకు ఎవరి గుర్తింపు అవసరం లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు.

రెండు రాష్ట్రాలకు నేనే ఒక బ్రాండ్.. కాంగ్రెస్‌ సర్కార్‌పై మాజీ మంత్రి తలసానిఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెండు రాష్ట్రాలకు నేనే ఒక బ్రాండ్ నాకు ఎవరి గుర్తింపు అవసరం లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. గురువారం అసెంబ్లీలో బీసీ పద్దుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, అంకెల గారడీతో బీసీలను మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని, ప్రజలను ఓట్ల కోసం వాడుకోవడం అలవాటుగా మారిందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న కులగణన పారదర్శకంగా లేదని, భూసాని కమిషన్ రిపోర్ట్‌ను ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లు కేంద్ర పరిధిలో ఉన్నా, బీసీ సబ్ ప్లాన్ అమలు చేయడం, బడ్జెట్‌లో 20 వేల కోట్ల రూపాయలు కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందని గుర్తు చేశారు.

రాజకీయ గుర్తింపు ఇచ్చింది కేసీఆర్..

బీసీలకు రాజకీయ గుర్తింపు ఇచ్చింది కేసీఆర్ అని, ఇద్దరు బీసీ నేతలను రాజ్యసభకు పంపడమే కాకుండా, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించి చరిత్ర సృష్టించారని కొనియాడారు. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడం, ఓవర్ సీస్ విద్యార్థులకు ఆర్థిక సాయం అందకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను ఓట్ల కోసం వాడుకోవడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని, బీసీల హక్కుల కోసం అంబేద్కర్ ఆశయ సాధనలో తాము పోరాటం కొనసాగిస్తామని తలసాని స్పష్టం చేశారు. నమ్మించి మోసం చేయకండి.. 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు అన్ని గమనిస్తున్నాయి.. బీసీ బిల్లుకు చట్టబద్ధత కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి.. అని తలసాని అన్నారు.

Next Story