- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐటీ కారిడార్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. రూ.1200 కోట్ల విలువైన భూమి సేఫ్
ఐటీ కారిడార్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. బడా నిర్మాణ సంస్థల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఐటీ కారిడార్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. బడా నిర్మాణ సంస్థల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్‌లోని సర్వే నంబర్ 55లోని 8 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని మంగళవారం హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఐటీ హబ్‌కి చేరువలో బడా రియల్ ఎస్టేట్ సంస్థల స్వాధీనంలో ఉన్న 4.20 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు.. కొలను మాధవరెడ్డి కూతురు సబితకు చెందిన 4 ఎకరాల భూమిని కూడా హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇందులో తాత్కాలికంగా వేసిన షెడ్డులను హైడ్రా తొలగించింది. ప్రభుత్వ భూమిలో నెలకొల్పిన ఆర్‌సీసీ ప్లాంట్‌ను వాసవి నిర్మాణ సంస్థ స్వయంగా తొలగించుకుంది. కార్మికులకోసం వేసిన తాత్కాలిక షెడ్డులను హైడ్రా తొలగించింది. మొత్తం 8 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను హైడ్రా తొలగించి బోర్డులు ఏర్పాటు చేసింది. మంగళవారం హైడ్రా కాపాడిన భూమి విలువ మార్కెట్ ధర ప్రకారం రూ. 1200ల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. గతంలోనూ ఇక్కడ ఆక్రమణలను హైడ్రా తొలగించింది. సర్వే నంబరు 53లోని మొండికుంట ఆక్రమణలతో పాటు.. సర్వే నంబరు 55లోని ప్రభుత్వ భూమిని 11 ఎకరాల వరకూ స్వాధీనం చేసుకున్న విషయం విధితమే.
అసైన్డ్ భూముల పేరుతో..
శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్ లోని సర్వే నంబర్ 55 లో ఉన్న భూమి అసైన్డ్ ల్యాండ్. రంగారెడ్డి కలెక్టర్ ఈ భూమిని ప్రోహిబిటెడ్ లిస్టులో ఇప్పటికే పెట్టారు. దీని ప్రకారం ప్రభుత్వానికి చెందినదిగా పేర్కొన్నారు. అదే భూమిని తమదిగా మీనాక్షి రియల్ ఎస్టేట్ సంస్థ చెబుతూ వస్తోంది. వాసవి నిర్మాణ సంస్థ అందులో ఆర్‌సీసీ ప్లాంటులతో పాటు.. భవన నిర్మాణ కార్మికులకు షెడ్డులు వేసింది. అలాగే నిర్మాణ సామగ్రిని కూడా అందులో ఉంచింది. ఇలా వినియోగించుకుంటూ మొత్తం 4.20 ఎకరాల భూమిని బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు తన స్వాధీనంలో ఉంచుకున్నాయి. ఈ రెండు సంస్థలకు తోడు ఇదే సర్వే నంబరులో ఉన్న మరో 4 ఎకరాల భూమిని కొలను మాధవరెడ్డి కుమార్తె కొలను సబిత తనదిగా చెబుతూ వస్తున్నారు. బౌన్సర్లను కాపలాగా ఉంచారు. హైడ్రాకు ఫిర్యాదు అందడంతో హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఆదేశాలమేరకు క్షేత్రస్థాయిలో సబంధిత శాఖల అదికారులతో కలిసి హైడ్రా విచారించింది. ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకుంది. హైడ్రా కమిషనర్ ఆదేశాలమేరకు మంగళవారం ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. మొత్తం 8 ఎకరాలకు పైగా ఉన్న భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేశారు. అలాగే ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు.






