Hyderabad: హైడ్రా మరో కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |

చెరువుల పరిరక్షణకు హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలోని అన్ని చెరువుల వద్ద 24/7 గస్తీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Hyderabad: హైడ్రా మరో కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: చెరువుల పరిరక్షణకు హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలోని అన్ని చెరువుల వద్ద 24/7 గస్తీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సారి జీహెచ్ఎంసీ పరిధిలోని 185చెరువుల వద్ద సోలార్ ఆధారిత 4జీ ఐపీసీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే హైడ్రా ఆధ్వర్యంలో టెండర్ నోటిఫికేషన్ జారీచేశారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 549 చెరువులకు సర్వే నిర్వహించడంతో పాటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించి 411 చెరువులకు ప్రిలిమినరీ నోటిపికేషన్ ఇచ్చారు. 138 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే అన్ని చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వడానికి చర్యలు అధికారులు తీసుకోనున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని..

జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణ, అభివృద్ధిపై హైడ్రా ఫోకస్ పెట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో సంభవించే వరద ముప్పును అరికట్టడానికి చెరువుల పరిరక్షణే పరిష్కారమని అధికారులు గుర్తించారు. గ్రేటర్ పరిధిలోని వరద నీటికి చెరువుల్లోకి మళ్లించడానికి చర్యలు తీసుకోనున్నారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులను కబ్జాలబారి నుంచి కాపాడానికి సోలార్ ఆధారిత 4జీ టవర్ ఐపీసీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు ఇప్పటికే అంబర్ పేట్ బతుకమ్మకుంట, కూకట్ పల్లిలోని నల్లచెరువులను సుందరీకరించిన విషయం తెలిసిందే. కూకట్ పల్లి నల్ల చెరువులో ఏకంగా బోటింగ్ కూడా ట్రయల్ రన్ చేశారు. తర్వాత సున్నం చెరువు, తమ్మిడికుంట, ఉప్పల్ నల్ల చెరువు, భుమ్రుఖ్ ఉద్దీన్ దౌలా చెరువులను పునరుద్ధరించడానికి హైడ్రా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.

24/7 గంటలపాటు గస్తీ..

ఓఆర్ఆర్ పరిధిలోని 70 చెరువుల వద్ద 24/7గంటలపాటు చెరువుల వద్ద మూడు షిప్ట్ లుగా గస్తీ ఏర్పాటు చేశారు. షిఫ్ట్ కు ఇద్దరు చొప్పున భద్రత కల్పించారు. ఈ గస్తీ చేస్తున్నవారిని హైడ్రా అవుట్ సోర్సింగ్ విధానంలో పోలీసు కానిస్టేబుల్ పరీక్షలో తక్కువ మార్కులతో ఉద్యోగం కోల్పోయినవారిని గుర్తించి 400మందిని నియమించుకుంది. వీరందరికి మూడు రోజులపాటు శిక్షణ కూడా ఇచ్చింది. వీరందరిని చెరువులను పరిరక్షించేందుకుగాను ఒక్కో చెరువుకు ఏడుగురి చొప్పున కేటాయించారు. దీంతో చెరువులను కబ్జాల బారీ నుంచి గార్డులు రక్షిస్తున్నారు.

టెండర్ నోటిఫికేషన్..

జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల వద్ద సోలార్ ఆధారిత 4జీ టవర్ ఐపీసీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి హైడ్రా ఆధ్వర్యంలో టెండర్ నోటిఫికేషన్ జారీచేశారు. వీటి కోసం బిడ్ దాఖలు చేయడానికి వచ్చేనెల 1వ తేది వరకు అవకాశం కల్పించారు. అదే రోజు మధ్యాహ్నాం 3.30గంటలకు టెండర్ బిడ్ లను ఓపెన్ చేయనున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Next Story