హైడ్రా స‌హాయ‌క చర్యల్లో బైక్ టీమ్‌లు

by Naga Rani Yarlagadda |

వ‌ర్షాకాలం ఆరంభ‌మైంది. గాలీ వాన న‌గ‌ర వాసుల‌ను భ‌య‌పెడుతోంది.

హైడ్రా స‌హాయ‌క చర్యల్లో బైక్ టీమ్‌లు
X
  • 20 బైకులు.. 3 షిప్టుల్లో 60 మంది సేవ‌లు
  • చెట్లు ప‌డిన వెంట‌నే తొల‌గించే ప‌నులు

దిశ, తెలంగాణ బ్యూరో: వ‌ర్షాకాలం ఆరంభ‌మైంది. గాలీ వాన న‌గ‌ర వాసుల‌ను భ‌య‌పెడుతోంది. అర‌గంట‌, గంట స‌మ‌యంలో 10 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదౌతోంది. వ‌ర‌ద నీరు ర‌హ‌దారుల‌ను ముంచెత్తుతుంటే.. మ‌రోవైపు దారిక‌డ్డంగా ప‌డిపోతున్న చెట్లు రాక‌పోక‌ల‌కు అంత‌రాయంగా మారుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డానికి ఆటంకాలు ఏర్ప‌డుతున్నాయి. హైడ్రా డీఆర్ఎఫ్ వాహ‌నాలు వెళ్లేందుకు అవ‌కాశం లేని ప‌రిస్థితుల్లో హైడ్రా బైకు టీమ్‌లు త‌క్ష‌ణ‌మే అక్క‌డ‌కు చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మౌతున్నాయి. గ‌తేడాది హైడ్రా పోలీసు స్టేష‌న్ ప్రారంభోత్స‌వంలో భాగంగా బైకు టీమ్‌ల‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సారి బైక్‌టీమ్‌ల‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకునే ప‌నిలో హైడ్రా నిమ‌గ్న‌మైంది. మొత్తం 20 బైకుల‌ను డీఆర్ఎఫ్ వాహ‌నాల చెంత‌నే అందుబాటులోకి ఉంచుతున్నారు. డీఆర్ఎఫ్ వాహ‌నం వెళ్లే వీలు లేని ప‌రిస్థితుల్లో బైకు టీమ్‌లు స్పాట్‌కు చేర‌కుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టేలా హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంది.

ఎమ‌ర్జ‌ెన్సీ రెస్పాన్స్ టీమ్‌గా..

హైడ్రా బైక్ టీమ్‌లు 24/7 గా ప‌ని చేస్తున్నాయి. మొత్తం 60 మంది మూడు షిప్టుల్లో అందు బాటులో ఉంటారు. ముఖ్య‌మైన ప్రాంతాల‌తో పాటు.. ప్ర‌ధాన‌మైన ర‌హ‌దారుల వెంట ఉన్న డీఆర్ఎప్ వాహ‌నాల్లోనే వీటిని ఉంచి ఎమ‌ర్జ‌ెన్సీ రెస్పాన్స్ టీమ్‌గా వినియోగిస్తున్నారు. బైకుల‌కు బాక్సులు కూడా అమ‌ర్చి అందులో రెండు చైన్ సా(బ్యాట‌రీతో న‌డిచే రంపాలు)లు, బ‌ల‌మైన రోప్ (తాడు) ఉంటుంది. చెట్టు కొమ్మ‌ల‌ను వెనువెంట‌నే క‌ట్ చేసి తాడు సాయంతో ఆ చెట్టును ప‌క్క‌కు లాగ‌డానికి వెసులుబాటుగా ఉండే ప‌రిక‌రాలు ఆ బాక్సులో ఉంచుతారు. న‌గ‌రంలో డీఆర్ ఎఫ్‌, మాన్సూన్ ఎమ‌ర్జ‌ెన్సీ టీమ్‌లు, స్టాటిక్ టీమ్‌ల‌కు అద‌నంగా బైకు టీమ్‌లు ప‌ని చేస్తాయి. ర‌హ‌దారిపై తీవ్ర‌మైన ట్రాఫిక్ జామ్ ఉన్నా బైకును ఫుట్‌పాత్ ఎక్కించి ఎమ‌ర్జ‌ెన్సీ సేవ‌ల్లో బాగంగా ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుంటారు. అలాంటి అవ‌కాశం కూడా లేని ప‌క్షంలో ప‌నిముట్లు చేతిలో ప‌ట్టుకుని ఘ‌ట‌నాస్థలానికి చేరుకుంటారు. ముందుగా ర‌హ‌దారిపై ఉన్న ఆటంకాలు తొల‌గించి ట్రాఫిక్ క్లియ‌ర్ చేయ‌డంలో హైడ్రాలో బైక్ టీమ్‌లు కీల‌క పాత్ర పోషిస్తున్నాయి.

వాట‌ర్ లాగింగ్ పాయింట్లలోనూ..

చెట్లు ప‌డిపోయిన‌ప్పుడే కాదు.. ర‌హ‌దారుల‌పై నీరు నిలిచిన‌ప్పుడు కూడా గ‌డ్డ‌పార‌తో పాటు ఇత‌ర ప‌నిముట్లు తీసుకుని ఈ బైక్ టీమ్‌లు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుంటాయి. వెనువెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టి రాక‌పోక‌ల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాయి. ఈ విధంగా మ‌ల్టీ టాస్కు ప‌నులు చేసేందుకు వీలుగా వీరికి హైడ్రా శిక్ష‌ణ ఇచ్చింది. డీఆర్ఎఫ్ సిబ్బందిలో ఒక‌రు వీరికి తోడుగా ఉండి ప‌నులు చేప‌డ‌తారు. మెట్ టీమ్‌లు, స్టాటిక్ టీమ్‌లు, డీఆర్ఎఫ్ టీమ్‌లు క‌ల‌సి వ‌ర‌ద ప‌రిస్థితులే కాకుండా ర‌హ‌దారుల్లో ఆటంకాల‌ను కూడా తొల‌గించ‌డంలో నిమ‌గ్నమౌతారు. శుక్ర‌వారం రాత్రి బంజారాహిల్స్ రోడ్డు నంబ‌రు 1లో వ‌రుస‌గా ఇరువైపులా 3 చెట్లు కూలిపోయాయి. నిమ్స్‌లోని మిలీనియం బ్లాక్‌పైన చెట్లు ప‌డిపోయాయి. డీఆర్ఎఫ్ ట్రక్కులు వ‌చ్చేస‌రికి ఆల‌స్యం అయ్యే ప‌రిస్థితులుండ‌డంతో బైక్ టీమ్‌లు చెట్లు న‌రికే రంపాలు ప‌ట్టుకు వ‌చ్చి భ‌వ‌నంలోని కిటికీల ద్వారా వాటిని తొల‌గించారు. అలాగే అదే మార్గంలో కొమ్మ‌ల‌ను వెనువెంట‌నే తొల‌గించి ఒక‌వైపు ట్రాఫిక్‌కు అంత‌రాయం లేకుండా చేసి రాక‌పోక‌ల‌ను సుల‌భం చేశారు. ఇలా బైక్ టీమ్‌లు ఇప్పుడు హైడ్రాలో ఎమ‌ర్జ‌ెన్సీ రెస్పాన్స్ టీమ్స్‌గా సేవందించ‌డంలో ముందుంటున్నాయి. ఈ నెల 9వ తేదీ మొత్తం 192 చోట్ల చెట్లు పడిపోయాయి. రాత్రి సమయంలో ట్రాఫిక్ కి అంతరాయంగా ఉన్నవాటితో పాటు కరెంట్ కట్ అయిన ప్రాంతాల్లో బైక్ టీమ్స్ తో పాటు డీఆర్ఎఫ్ బృందాలు తొలగించాయి.మరుసటి రోజు ఉదయం మొత్తం ఫిర్యాదులు పూర్తి చేశారు. జూన్ 12వ తేదీ మొత్తం 80 ప్రాంతాల్లో చెట్లు పడిపోగా హైడ్రా బైక్ టీమ్స్ తో పాటు drf బృందాలు ఫిర్యాదులన్నీ పరిష్కరించారు.

Next Story