- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హైడ్రా అప్రమత్తమైంది. 24 x 7 సేవలందించే పనిలో నిమగ్నమైంది. ఎక్కడా రహదారులపై నీరు నిలవకుండా.. ఎప్పటికప్పుడు క్యాచ్పిట్లలో, కల్వర్టుల్లో చెత్తను తొలగిస్తూ.. వరద సాఫీగా సాగేలా హైడ్రా బృందాలు పని చేస్తున్నాయి. నగర వ్యాప్తంగా 436 ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని హైడ్రా గుర్తించింది. ఇందులో 150 ప్రాంతాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి అక్కడ హెవీ మోటార్లు పెట్టడమే కాకుండా.. వరద సాఫీగా వెళ్లేలా ఏర్పాట్లను హైడ్రా చేసింది. మరో 142 ప్రాంతాల్లో కూడా ఇవే ఏర్పాట్లు చేసింది. కొద్దిపాటి సమస్య ఉండే ప్రాంతాలను 144గా గుర్తించి అక్కడ వరద ముంచెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు 51 రంగంలో ఉండగా.. మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్లు 150 పని చేస్తున్నాయి. యిలా 3565 మంది విధుల్లో నిమగ్నమై ఉన్నారు. వీటికి తోడు 9 బోట్లను సిద్ధం చేసుకుని.. సమస్యాత్మక ప్రాంతాలకు వాటిని చేరవేసింది.
309 ప్రాంతాల్లో నిత్యం నిఘా..
నగరంలో 309 ప్రాంతాల్లో నిత్యం నిఘా పెట్టింది. వర్షం వస్తున్నప్పుడు వరదను అంచనా వేసి మ్యాన్ హోళ్లను తెరవడం.. తర్వాత మూసేయడం.. క్యాచ్పిట్ల వద్ద చెత్తను నిరంతరం తీయడం వంటి విధులో వీరంతా ఉంటారు. వీరికి తోడు 20 బృందాలు నిత్యం ట్రాఫిక్ పోలీసులతో ఉంటూ.. వర్షం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. చెట్లు పడిపోతే వెనువెంటనే తొలగించేందుకు ప్రత్యేకంగా ఉన్న బృందాలకు తోడు.. ట్రాఫిక్జామ్లలో సులభంగా వెళ్లేందుకు 21 బైకు బృందాలు కూడా ఉన్నాయి. 212 డీవాటరింగ్ పంపులను నీరు నిలిచే ప్రాంతాల్లో అందుబాటులో ఉంచింది. ఐఎండీ, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ, మూడు పోలీసు కమిషనరేట్లతో పాటు జీహెచ్ ఎంసీ, ఫైర్ కంట్రోల్ రూంలలో హైడ్రా సిబ్బంది ఉంటూ ఎప్పటికప్పుడు హైడ్రా కంట్రోల్ రూంకు సందేశాలను పంపే వ్యవస్థను ఏర్పటు చేసింది.
అన్ని శాఖలతో అనుసంధానం..
వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు సంక్షిప్త సమాచారం చేరవేయడమే కాకుండా.. జీహెచ్ ఎంసీ, ట్రాఫిక్ ఇలా సంబంధిత విభాగాలతో సమన్వయంగా పని చేస్తూ ఎక్కడా సమస్య తలెత్తకుండా ఏర్పాట్లుచేసింది. హైడ్రా సిబ్బంది వద్ద వైర్లెస్ సెట్లను ఉంచి తక్షణం స్పందించేలా హైడ్రా చర్యలు తీసుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య హైడ్రా కంట్రోల్ రూంతో కోఆర్డినేషన్ చేసుకుంటూ క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.
హైడ్రా కమిషనర్ కు సన్మానం:
ప్రజావసరాలకు ఉద్దేశించిన స్తలాలను కాపాడిన హైడ్రాకు కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం సర్కిల్ పరిధిలోని భగత్‌సింగ్‌నగర్ కాలనీ నివాసితులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజావాణిలో ఫిర్యాదు ఇవ్వగానే చర్యలు చేపట్టిన హైడ్రాకు అభినందనలు తెలిపారు. భగత్‌సింగ్ నగర్ నుంచి వందలాదిగా తరలి వచ్చి హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ ను కలసి అభినందనలు తెలిపారు. ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసిన సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం 3500ల గజాల స్థలం కాగా.. వెయ్యి గజాలకు పైగా కబ్జా అయ్యిందని వాపోయారు. హైడ్రా రంగంలోకి దిగకపోతే మొత్తం కబ్జాలపాలయ్యేదని అన్నారు. ఇటీవల వచ్చిన నిర్మాణాలను తొలగించి మొత్తం 3500ల గజాల స్థలాన్ని కాపాడి ఫెన్సింగ్ వేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
యువకుడిని కాపాడిన హైడ్రా:
పాతబస్తీలోని యాకుత్‌పురా రైల్వే స్టేషన్ దగ్గరలోని వరద కాలువలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని హైడ్రా సిబ్బంది బుధవారం కాపాడింది. ఆ పరిసరాల్లో పని చేస్తున్న హైడ్రా సిబ్బందికి సమాచారం అందగానే.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించింది. కాలువలోకి దిగడానికి ఏమాత్రం అవకాశం లేని ప్రమాదకర పరిస్థితుల్లో నిచ్చెన కిందకు వేసి దాని ద్వరా యువకుడిని కాపాడింది. మేకల మేతకోసం చెట్టు కొమ్మలను తీసుకువచ్చేందుకు స్థానికంగా నివాసముండే గౌస్(35) ప్రయత్నించాడు. ప్రమాదవసాత్తు వరద కాలువలోకి జారుకున్నాడు. ఆయనను చూసిన వారు వెంటనే 100 మీటర్ల దూరంలో కచ్చామోరీల్లో చెత్తను తొలగించే పనిలో ఉన్న హైడ్రా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హైడ్రా ఇన్‌స్పెక్టర్ బాలగోపాల్ హుటాహుటిన సిబ్బందితో అక్కడకు చేరుకుని గౌస్‌ను కాపాడారు. రెయిన్ బజార్ కార్పొరేటర్ వసీతో పాటు..హైడ్రా సిబ్బంది వంశీ, బాలరాజు తదితరులు యువకుడిని కాపాడినవారిలో ఉన్నారు.






