Hydra: పార్కు స్థ‌లాల‌ను కాపాడిన హైడ్రా.. రూ. 35 కోట్ల స్థ‌లాల చుట్టూ ఫెన్సింగ్.. ఎక్కడంటే?

by Ramesh Naini |

కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని 3 వేల గ‌జాల విస్తీర్ణంలో ఉన్న రెండు పార్కుల‌ను హైడ్రా శ‌నివారం కాపాడింది.

Hydra: పార్కు స్థ‌లాల‌ను కాపాడిన హైడ్రా.. రూ. 35 కోట్ల స్థ‌లాల చుట్టూ ఫెన్సింగ్.. ఎక్కడంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని 3 వేల గ‌జాల విస్తీర్ణంలో ఉన్న రెండు పార్కుల‌ను హైడ్రా శ‌నివారం కాపాడింది. ఇలా కాపాడిన భూమి విలువ రూ. 35 కోట్ల వ‌ర‌కూ ఉంటుందని హైడ్రా అధకారులు తెలిపారు. భాగ్యనగర్ ఫేజ్-3 కాలనీలో రెండు పార్కులు క‌బ్జాకు గ‌ర‌య్యాయ‌ని హైడ్రా ప్ర‌జావాణికి అక్క‌డి నివాసితుల సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు వివిధ శాఖ‌లతో హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. స‌ర్వే నంబ‌రు 197తో పాటు 200ల‌లో 36 ఎక‌రాల‌లో భాగ్య‌న‌గ‌ర్ ఫేజ్‌- 3 పేరిట హుడా అనుమ‌తి పొందిన లే ఔట్ 1987లో ఏర్ప‌డింది. 357 ప్లాట్ల‌తో ఏర్ప‌డిన ఈ కాల‌నీలో రెండు పార్కులు ఆక్ర‌మ‌ణ‌కు గుర‌యిన‌ట్టు గుర్తించారు.

2 వేల గ‌జాల పార్కులో స‌గం వ‌ర‌కూ క‌బ్జా అవ్వ‌గా.. ఎక‌రం విస్తీర్ణంలో ఉన్న పార్కులో వెయ్యి గ‌జాల వ‌ర‌కూ ఆక్ర‌మ‌ణ‌కు గురైన‌ట్టు పేర్కొంటూ నివేదిక స‌మ‌ర్పించారు. ఈ నివేదిక మేర‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశాల‌తో శ‌నివారం ఈ ఆక్ర‌మ‌ణ‌ల‌ను అధికారులు తొల‌గించారు. రెండు పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేసి పార్కు స్థ‌లాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రాణ‌వాయువును అందించే పార్కుల‌ను కాపాడిన హైడ్రాకు స్థానికులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Next Story