హైడ్రా ఫోన్ -ఇన్‌ కార్యక్రమం.. క‌మిష‌న‌ర్‌‌కు నగర ప్ర‌జ‌ల కీలక విన్నపాలు ఇవే

by Ramesh Naini |

మా చెరువులో మురుగు నీరు వ‌చ్చి చేరుతోంది.. దుర్గంధ‌భ‌రిత వాతావ‌ర‌ణంతో నానా ఇబ్బందులు ప‌డుతున్నాం. గుర్ర‌పు డెక్కపెరిగి దోమ‌లతో కంటి మీద కునుకు లేకుండా గ‌డుపుతున్నాం. ప‌గ‌లూ, రాత్రి అనే తేడా లేకుండా కిటికీలు, త‌లుపులు బంద్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి. మా చెరువుల్లో మురుగు నీరు క‌ల‌వ‌కుండా చూడండి.. మా చెరువుల‌ను కూడా అభివృద్ధి చేయండి

హైడ్రా ఫోన్ -ఇన్‌ కార్యక్రమం.. క‌మిష‌న‌ర్‌‌కు నగర ప్ర‌జ‌ల కీలక విన్నపాలు ఇవే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘మా చెరువులో మురుగు నీరు వ‌చ్చి చేరుతోంది.. దుర్గంధ‌భ‌రిత వాతావ‌ర‌ణంతో నానా ఇబ్బందులు ప‌డుతున్నాం. గుర్ర‌పు డెక్కపెరిగి దోమ‌లతో కంటి మీద కునుకు లేకుండా గ‌డుపుతున్నాం. ప‌గ‌లూ, రాత్రి అనే తేడా లేకుండా కిటికీలు, త‌లుపులు బంద్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి. మా చెరువుల్లో మురుగు నీరు క‌ల‌వ‌కుండా చూడండి.. మా చెరువుల‌ను కూడా అభివృద్ధి చేయండి’ అంటూ ప‌లువురు శ‌నివారం ఫోన్ - ఇన్ కార్య‌క్ర‌మంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌తో న‌గ‌ర ప్ర‌జ‌లు విన్న‌వించుకున్నారు. ప్ర‌తి సోమ‌వారంహైడ్రా ప్ర‌జావాణికి అద‌నంగా శ‌నివారం నాడు ఫోన్ - ఇన్ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం చాలా సంతోష‌మ‌ని అభినందించారు. హైడ్రా కార్యాల‌యం వ‌ర‌కూ రాలేనివారు.. స‌మ‌స్య‌ల‌ను ఫోనులో చెప్పుకునే అవ‌కాశం ఇవ్వ‌డం సంతోష‌మ‌న్నారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి ఒంటి గంట వ‌ర‌కూ జ‌రిగిన ఫోన్‌-ఇన్ కార్య‌క్ర‌మంలో నేరుగా క‌మిష‌న‌ర్ ఫిర్యాదుదారుల‌తో మాట్లాడారు. వారి స‌మ‌స్యలను విని.. ప‌రిష్కారానికి సంబంధిత అధికారి వివ‌రాల‌ను అంద‌జేశారు.

ప‌రిష్కారం కాకుంటే నేరుగా..

వారం త‌ర్వాత‌ ప‌రిష్కారం కాకుంటే నేరుగా త‌న‌కు ఫోను చేయాల‌ని ఫిర్యాదుదారుల‌ను కోరారు. సెల‌వు రోజుల్లో మిన‌హా.. ప్ర‌తి శ‌నివారం 040-29565750, 040-29565759 ఈ నంబ‌ర్ల‌కు ఫోను చేసి స‌మ‌స్య‌ల‌ను తెలియ‌జేయాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా జిల్లాల నుంచి కూడా కొన్ని ఫోన్లు వ‌చ్చాయి. అక్క‌డ కూడా చెరువులు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురవుతున్నాయ‌ని, వాటిని కాపాడాల‌ని ప‌లువురు కోరారు. ఓఆర్ఆర్ వ‌ర‌కే హైడ్రా ప‌రిధి అంటూ.. వారికి క‌మిష‌న‌ర్ స‌ర్ది చెప్పారు. మొద‌టి విడ‌త 6 చెరువులు చేప‌ట్ట‌గా.. త్వ‌రలోనే 14 చెరువుల‌ను అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. ఇలా ద‌శ‌ల‌వారీ చెరువుల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ వారికి తెలిపారు.

ఆక్ర‌మ‌ణ‌ల భ‌ర‌తం ప‌ట్టండి..

చెరువులు స‌హ‌జ ల‌క్ష‌ణాల‌ను కోల్పోయాయ‌ని, వాటిని పున‌రుద్ధ‌రించాల‌ని ఎక్కువ మొత్తంలో ఫిర్యాదులందాయి. పార్కులు, ర‌హ‌దారులు, ప్ర‌భుత్వ స్థ‌లాలు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు క‌బ్జాల‌కు గురి అవుతున్నాయ‌ని, ఫుట్‌పాత్‌లు ఆక్ర‌మ‌ణ‌కు గురై.. న‌డ‌క దారి లేకుండా చేస్తున్నారంటూ న‌గ‌రం న‌లుమూల‌ల నుంచి హైడ్రా ఫోన్ ఇన్ కార్య‌క్ర‌మానికి ఫిర్యాదులు అందాయి. దుండిగ‌ల్ మున్సిపాలిటీలోని గాగిలాపూర్‌లో ర‌హ‌దారుల‌ను ఆక్ర‌మించి ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నార‌ని ఫిర్యాదు చేశారు. ప్ర‌గ‌తి న‌గ‌ర్ వ‌ద్ద ఓ పార్కులో ఆల‌యం క‌ట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, నాగిరెడ్డి కుంట‌లోకి మురుగు నీరు చేర‌కుండా డైవ‌ర్ట్ కాలువ నిర్మాణ ప‌నులు ఆగిపోయాయ‌ని.., మాధాపూర్‌లోని సున్నం చెరువు వ‌ద్ద పేరుకు వంద అడుగుల ర‌హ‌దారి ఉన్నా.. మొత్తం నీటి ట్యాంక‌ర్ల‌తో ఆ రోడ్డు అంతా రాక‌పోక‌ల‌కు ఇబ్బందిగా మారింద‌ని ఫోనులో ఆయా ప్రాంతాల నుంచి ఫిర్యాదులందాయి. బ‌డా నిర్మాణ సంస్థ‌ల‌కు చెందిన వారు.. వ‌ర‌ద కాలువ‌ల‌ను దారి మ‌ల్లించ‌డ‌మే కాకుండా క‌బ్జాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ప‌లు ప్రాంతాల నుంచి ఫిర్యాదులందాయి. అత్తాపూర్లో 33 గుంట‌ల ప్ర‌భుత్వ భూమితో పాటు.. 900 గ‌జాల పార్కు స్థ‌లం క‌బ్జాకు గురైంద‌ని.. అక్క‌డ నిర్మాణాలు రాక‌ముందే అడ్డుకోవాల‌ని సూచించారు. ఆక్ర‌మ‌ణ‌దారులను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉపేక్షించ‌వ‌ద్ద‌ని కోరారు. ఇలా శ‌నివారం కార్య‌క్ర‌మంలో 36 మందితో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ మాట్లాడి వారి సంస్య‌లు తెలుసుకున్నారు.

Next Story