- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువ ఆపద మిత్ర వాలంటీర్ల శిక్షణలో హైడ్రా కమిషనర్
‘బాధ్యతాయుతమైన పౌరులతోనే మెరుగైన సమాజం ఏర్పడుతుంది.. ఎవరికి వారు మనకెందుకు అనుకోకుండా.. తనవంతుగా సమాజ హితం కోసం కాస్త ఆలోచించాలి’ అని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ‘బాధ్యతాయుతమైన పౌరులతోనే మెరుగైన సమాజం ఏర్పడుతుంది.. ఎవరికి వారు మనకెందుకు అనుకోకుండా.. తనవంతుగా సమాజ హితం కోసం కాస్త ఆలోచించాలి’ అని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ సూచించారు. మరీ ముఖ్యంగా యువత ఈ విషయమై దృష్టి పెట్టాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తనను తాను రక్షించుకోవడమే కాకుండా.. తోటి వారితో పాటు.. చుట్టుపక్కల వారిని సురక్షితంగా కాపాడేందుకు ఉద్దేశించిన ‘యువ ఆపద మిత్ర’ పథకం వాలంటీర్లకు గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్లాటినం జూబ్లీ హాల్‌లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ మాట్లాడారు.
ఎన్‌డీఎంఏ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) ప్రారంభించిన ‘యువ ఆపద మిత్ర’ పథకంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు భాగస్వామ్యం అవ్వడం ఎంతో శుభపరిణామమని అన్నారు. తోటివారిని కాపాడేందుకు తీసుకుంటున్న శిక్షణలో భాగమైనందుకు అందరినీ కమిషనర్ అభినందించారు. పరిసరాల పట్ల అవగాహన ఉన్నప్పుడే వరదలు, అగ్ని ప్రమాదాలు.. ఇలా ఆపద సమయంలో తోటివారిని కాపాడగలమన్నారు. ప్రాణ, ఆస్తి నష్ట నివారణలో భాగస్వామ్యం అవుతున్నందుకు మీరెంతో గర్వపడాలన్నారు. ఇందుకు అవసరమైన శిక్షణ హైడ్రా అందిస్తుందని చెప్పారు. ఇలా కమ్యూనిటీ ఆధారిత మొదటి ప్రతిస్పందనదారుల నెట్‌వర్క్‌ను రూపొందించడం ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని అన్నారు.
సమస్యను అర్థం చేసుకోవాలి..
యువ ఆపద మిత్ర శిక్షణ పొందిన వారు ఎంత వేగంగా స్పందిస్తే.. ప్రమాద తీవ్రతను అంతమేర తగ్గించవచ్చునని హైడ్రా కమిషనర్ చెప్పారు. సమస్యను అర్థం చేసుకోవడంతో పాటు..వాటి పరిష్కారానికి మార్గాలను కూడా సూచించే స్థాయిలో యువత ఉండాలన్నారు. యూనిఫామ్ లేని ఫైర్‌మ్యాన్, పోలీసు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సుగా మీరు పని చేస్తారన్నారు. కెరీర్ పరంగా మీకు మీరు నిచ్చెనలేసుకుని ఎదగడంతో పాటు.. సమాజ సేవ అనే కోణాన్ని కూడా నిత్యం మీలో రగిలేలా యువత తోటివారికి మార్గదర్శకులుగా ఉండాలన్నారు.
వాతావరణ కాలుష్యంతో భారీ వర్షాలు నమోదౌతున్నాయని.. ఇలాంటి తరుణంలో యువ వాలంటీర్లు వివిధ శాఖలతో సమన్వయంగా పని చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా హైడ్రా కార్యకలాపాలపై పలువురు విద్యార్థల సందేహాలను హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ నివృత్తి చేశారు. ఇదే సమయంలో వారి నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. మాతో పాటు.. భవిష్యత్ తరాలకోసం ప్రకృతి వనరులను కాపాడుతున్నారని పలువురు విద్యార్థులు చెప్పారు. చెరువులను పరిరక్షించి వరదల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను విద్యార్థులు అభినందించారు.
కబ్జాదారులు ఎంతటివారైనా వదిలిపెట్టకుండా పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడం అభినందనీయమన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సీనియర్ ప్రొఫెసర్ కుమార్ మోలుగరం, హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్(ఆర్సీయూఈఎస్) డైరెక్టర్ ప్రొ. శ్రీనగేష్, యువ ఆపద మిత్ర స్టేట్ నోడల్ ఆఫీసర్ గౌతమ్ కృష్ణ తదితరులు యువ ఆపద మిత్ర వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు.






