హైడ్రా అవసరం ఏపీకి కూడా ఉంది: పవన్ కల్యాణ్

by Gantepaka Srikanth |

ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థ అవసరం ఉందని, అన్ని రాష్ట్రాలకూ అవసరమేనని ఏపీ డిప్యూటీ పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

హైడ్రా అవసరం ఏపీకి కూడా ఉంది: పవన్ కల్యాణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థ అవసరం ఉందని, అన్ని రాష్ట్రాలకూ అవసరమేనని ఏపీ డిప్యూటీ పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో హైడ్రా చేస్తున్న పనులను ఆయన ప్రశంసించారు. శుక్రవారం విజయవాడలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో పవన్, హైడ్రా కార్యకలాపాల తీరును అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ ఆస్తులను రక్షించడంలోనూ, అక్రమ ఆక్రమణలను తొలగించడంలోనూ హైడ్రా చేస్తున్న విధానం చాలా బాగుందని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ముఖ్యంగా బతుకమ్మ కుంట పునరుద్ధరణ, భమృక్ దౌలా, కూకట్ పల్లి నల్లచెరువు, మాదాపూర్ లోని తమ్మిడికుంట అభివృద్ధి వంటి విషయాలను అభినందించారు.

దీంతోపాటు అక్రమ నిర్మాణాలను తొలగించే విషయంలో హైడ్రా తీసుకుంటున్న కఠిన చర్యల గురించి రంగనాథ్‌ను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తులు, జలవనరులను కాపాడుతున్న విధంగా ఏపీలో కూడా ఇలాంటి సంస్థ అవసరం ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ, అక్రమ కట్టడాల తొలగింపు కోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హైడ్రా సత్ఫలితాలను ఇస్తుండడంతో, అక్రమాలను అరికట్టే దిశగా ఈ తరహా వ్యవస్థను ఏపీలోనూ తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్టు తెలిసింది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో బుడమనేరు కాలువ ఆక్రమణ, వరదలు, సంభవించిన నష్టాల గురించి పవన్ ప్రస్తావించారు. దేశంలోనే మొట్ట‌మొద‌టిగా హైడ్రా రూపంలో స‌రికొత్త వ్య‌వ‌స్థ‌ను తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చింద‌న్నారు. కొత్త వ్య‌వ‌స్థ‌ను తీసుకురావ‌డ‌మే కాకుండా.. స‌రైన అధికారిని నియ‌మించ‌డం.. అధికారాలు క‌ట్ట‌పెట్ట‌డం.. పూర్తి స్వేచ్ఛ‌తో ప‌ని చేసే అవ‌కాశం క‌ల్పించ‌డం జ‌రిగితే ఫ‌లితాలు బాగుంటాయ‌న్నారు. ఎంతో నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేస్తున్న‌ ఏవీ.రంగ‌నాథ్ ను ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభినందించారు.

Next Story