- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవిత్ర ఆలయంలో పారిశుద్ధ్యమేది?
ఈఓకు అదనపు బాధ్యతలు.. పారిశుద్ధ్య పనులపై నీలి నీడలు.

దిశ, చంపాపేట్ : హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాల్లో అత్యంత ప్రాచీనమైన కర్మన్ ఘాట్ శ్రీ హనుమాన్ దేవాలయం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. నిత్యం వేలాదిగా భక్తులు దర్శనానికి వచ్చే ఈ పవిత్ర ఆలయంలో కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దేవాలయ ప్రాంగణమంతా ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి ఉండడం, ముఖ్యంగా కార్యనిర్వహణ అధికారి (ఈవో) కార్యాలయం సమీపంలోని మెట్లపై అపరిశుభ్రత స్పష్టంగా కనిపించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ కోనేరులోని నీటి పరిస్థితి కూడా ఆందోళన కలిగించే స్థాయిలో ఉందని వాపోతున్నారు. కోనేరులో నీరు మురికి పట్టి దుర్వాసన రావడంతో అక్కడికి వెళ్లేందుకు భక్తులు వెనుకాడుతున్నారు.
ఈవోకు మూడు దేవాలయాల బాధ్యతలు..
ప్రస్తుతం ఈ దేవాలయ ఈవో లావణ్య ఒకేసారి మూడు దేవాలయాలకు ఇంచార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాలాపూర్ వేణుగోపాల స్వామి దేవాలయం, సంగారెడ్డి రుద్రారం గణేశ్ దేవాలయం, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయాలకు ఒకేసారి ఇంచార్జిగా ఉండడంతో ఆమె తరచూ ఆలయానికి అందుబాటులో ఉండడం లేదని భక్తులు వాపోతున్నారు. ఈ అంశంపై దేవాలయ డైరెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని భక్తులు, ప్రజా సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయమై ‘దిశ’ ప్రతినిధి దేవాలయ ఈవో లావణ్యను వివరణ కోరగా, ‘సోమవారం కార్యాలయానికి రాలేదు. వేరే దేవాలయంలో ఉన్నాను. బుధవారం కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయానికి వస్తా’ అని తెలిపారు.






