రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటాం : ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్

by Nallavelli.Anjaneyulu |

తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా హస్తినాపురం డివిజన్ పరిధిలోని కేకే గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటాం :  ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్
X

దిశ, హస్తినాపురం : తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా హస్తినాపురం డివిజన్ పరిధిలోని కేకే గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 17,200 మంది రేషన్ డీలర్లు పనిచేస్తున్నారని తెలిపారు. రేషన్ డీలర్లు ప్రతి కుటుంబానికి సుపరిచితులని, దేశ జనాభాలో దాదాపు 85 శాతం కుటుంబాలతో రేషన్ డీలర్లకు నేరుగా సంబంధం ఉంటుందని చెప్పారు. అయినప్పటికీ రేషన్ డీలర్ల పట్ల ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యం చూపడం లేదని విమర్శించారు. రేషన్ డీలర్లు చేసిన తొమ్మిది డిమాండ్లలో అన్నింటినీ ఒకేసారి నెరవేర్చడం సాధ్యం కాకపోయినా, కనీసం ఐదు నుంచి ఆరు డిమాండ్లను తప్పకుండా అమలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి చొరవ తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. డీలర్లకు కమిషన్లు పెంచాలని, నెలసరి విధానంలో జీతాలు చెల్లించే వ్యవస్థను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రతి కుటుంబంలో ఒక్క వ్యక్తికి ఐదు కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఒక్క కిలో మాత్రమే ఇస్తోందని ఆయన గుర్తు చేశారు.

ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ డీలర్ల సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కారమయ్యే విధంగా నా వంతు పాత్ర పోషిస్తానని, మీ వెన్నుదన్నుగా ఉంటానని ఆయన తెలిపారు ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడంలో రేషన్ డీలర్ల పాత్ర అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షులు కోకొండ వైకుంఠం మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో రేషన్ డీలర్ ఏ కారణంతో మృతి చెందిన, ఆ కుటుంబానికి తనవంతు సహాయంగా రూ.21వేలు అందిస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నైకోటి రాజు, జనరల్ సెక్రటరీ ఆవుల సంజీవ రెడ్డి, కోశాధికారి పారేపల్లి నాగరాజు, నూతనంగా ఎన్నికైన వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం మల్లికార్జున్ గౌడ్, రాష్ట్ర నాయకులు నందయ్య, అమూర ఇంద్రసేన రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కోకొండ వైకుంఠం, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు పుస్తె శ్రీకాంత్, మురళీ మోహన్‌, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, సామ రంగారెడ్డి, హస్తినాపురం డివిజన్ అధ్యక్షులు ఎరుకల మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు.

Next Story