- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీకాలు పిల్లల ప్రాణాలకు కవచాలు ఎం బ్రేస్ వైద్యులు
పిల్లల ఆరోగ్య రక్షణకు టీకాలే ప్రాణ కవచమని, సంక్రమణ వ్యాధులను అరికట్టడంలో రోగనిరోధక టీకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎం’బ్రేస్ వైద్య నిపుణులు పేర్కొన్నారు.

దిశ, వనస్థలిపురం : పిల్లల ఆరోగ్య రక్షణకు టీకాలే ప్రాణ కవచమని, సంక్రమణ వ్యాధులను అరికట్టడంలో రోగనిరోధక టీకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎం’బ్రేస్ వైద్య నిపుణులు పేర్కొన్నారు. “ప్రపంచ టీకాల వారోత్సవం” సందర్భంగా కామినేని ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ ఏడాది “ప్రతి తరానికి టీకాలు పనిచేస్తాయి” అనే థీమ్‌తో అన్ని వయస్సుల వారూ టీకాల ప్రాముఖ్యతను గుర్తించాలని వైద్యులు సూచించారు. పోలియో, తట్టు, రుబెల్లా, డిఫ్తీరియా, ధనుర్వాతం, హెపటైటిస్-బి, రోటావైరస్, న్యుమోకాకల్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణకు టీకాలు అత్యంత ప్రభావవంతమని తెలిపారు. కామినేని సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషన్ డా. ఎస్. నరసింహారావు మాట్లాడుతూ.. గత దశాబ్దాల్లో టీకాలు పిల్లల ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయని అన్నారు.
ఒకప్పుడు విస్తృతంగా కనిపించిన అనేక వ్యాధులు టీకాల వల్ల అదుపులోకి వచ్చాయని, పూర్తి రక్షణ కోసం నిర్దేశిత టీకా షెడ్యూల్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. డా. కంచన్ ఎస్. చన్నావర్ మాట్లాడుతూ.. ఐసీయూకు చేరే పిల్లల్లో చాలా ఇన్ఫెక్షన్లు టీకాల ద్వారా నివారించవచ్చని చెప్పారు. టీకాలు వ్యాధి తీవ్రతను తగ్గించడమే కాకుండా ఆసుపత్రిలో చేరే అవసరాన్ని కూడా తగ్గిస్తాయని తెలిపారు. టీకాలపై అపోహలు తొలగించి అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. డా. ఆర్.వి. సౌజన్య మాట్లాడుతూ.. పుట్టినప్పటి నుంచే టీకా రక్షణ ప్రారంభమవుతుందని, నవజాత శిశువుల ఆరోగ్య రక్షణలో కీలకమని పేర్కొన్నారు. గర్భిణులకు టీకాలు, చిన్నతనంలో రోగనిరోధక టీకాలు సమయానికి వేయించడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చన్నారు. టీకాలు వ్యక్తిగత రక్షణకే కాకుండా సామూహిక రోగనిరోధక శక్తిని పెంచి అంటువ్యాధుల వ్యాప్తిని అడ్డుకుంటాయని వైద్యులు స్పష్టం చేశారు. వ్యాధి లేని భవిష్యత్తుకు టీకాలే మార్గమని పునరుద్ఘాటించారు.






