విద్యుత్ శాఖలో ఖాళీగా సీఈఐ పోస్టు.... ఉన్నతాధికారుల లాబీయింగ్

by Ajay Maddhiboyina |

విద్యుత్ శాఖలో కీలకమైన పోస్టును భర్తీ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వినియోగదారులకు శాపంగా మారింది. అనుమతుల కోసం వినియోగదారులు చేసుకున్న వేల దరఖాస్తులు పెండింగ్లో ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

విద్యుత్ శాఖలో ఖాళీగా సీఈఐ పోస్టు.... ఉన్నతాధికారుల లాబీయింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్ శాఖలో కీలకమైన పోస్టును భర్తీ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వినియోగదారులకు శాపంగా మారింది. అనుమతుల కోసం వినియోగదారులు చేసుకున్న వేల దరఖాస్తులు పెండింగ్లో ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ శాఖలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టర్ (సీఈఐ) కీలకమైన పోస్టు. అధిక విద్యుత్ సామర్థ్యంతో ఉన్న కమర్షియల్ భవనాల్లో విద్యుత్ కనెక్షన్లకు అనుమతులు ఇవ్వడం, విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు వాటికి సంబంధించిన సమాచారాన్ని నిర్ధారించడం, వాటిపై నివేదిక అందించడం ఈ విభాగం పని. ఈ పోస్టు ట్రాన్స్ కోలో డైరెక్టర్ స్థాయి పోస్టు. దీంతో ఈ విభాగానికి అత్యంత డిమాండ్ ఉంది. అదే స్థాయిలో పని కూడా ఉంది. హైదరాబాద్ మహానగరంలో అధిక శాతం జరిగేవి వాణిజ్య నిర్మాణాలే. భారీ భవనాలు కావడంతో విద్యుత్ శాఖ క్లియరెన్స్ కీలకం. దీంతో వేల సంఖ్యలో దరకాస్తులు పెండింగ్లో ఉన్నాయని సమాచారం.

పెద్ద భవనాల విషయంలో విద్యుత్ అనుమతులు లేకపోవడంతో పనులు ముందుకు సాగడంలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ విభాగం చాలా కీలకంగా వ్యవహరించనుంది. అయితే నేరుగా ప్రజలతో సంబంధం లేకుండా ఉండటంతో అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. కానీ ఇప్పటి వరకు చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టర్ పోస్టులో ఉన్న రామాంజనేయులు ఏప్రిల్ చివరన రిటైర్ అయ్యారు. ఆ స్థానంలో ఎవరికీ కూడా ఇంఛార్జి బాధ్యతలు ఇవ్వలేదని, అదే సమయంలో పూర్తిస్థాయి అధికారిని ఆ పోస్టులో నియమించలేదని తెలిసింది. ఈ పోస్టు కోసం అనేక మంది విద్యుత్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. హోదా, ప్రత్యేక గుర్తింపు ఉండడంతో ఈ పోస్టుకు డిమాండ్ భారీగా ఉందని సమాచారం. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా ఇక్కడ పని చేస్తున్న ఆంధ్ర ప్రాంతం వారు సైతం లాబీయింగ్ చేస్తున్నట్లుగా తెలిసింది. దీంతో ఎవరు ఈ పోస్టును దక్కించుకుంటారనేది విద్యుత్ శాఖలో ఆసక్తిగా మారింది.

Next Story