- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వినాయక నిమజ్జనం...30 వేల మంది పోలీసులతో బందోబస్తు
ఈ నెల 6 వ తేదీన నిర్వహించే వినాయక నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవ

దిశ , హైదరాబాద్ బ్యూరో: ఈ నెల 6 వ తేదీన నిర్వహించే వినాయక నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, రాచకొండ సీపీ సుధీర్ బాబు, అదనపు సిపి విక్రమ్ సింగ్ మాన్, హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిడ్,హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి లతో కలిసి బాలాపూర్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే రూట్ మ్యాప్ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. శోభాయాత్ర మార్గంలో కీలకమైన బాలా పూర్ , చార్మినార్ సర్కిల్, మోజమ్ జాహి మార్కెట్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ ఊరేగింపు మార్గాలను పరిశీలించి విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలు, వాటి ఎత్తు ఆధారంగా పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నగరంలో విగ్రహాల ఊరేగింపులు , పోలీసు బందోబస్తు, వ్యర్థాల తొలగింపు, నిరంతర విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ మళ్లింపు, అత్యవసర వైద్యసేవలు తదితర అంశాల పై అధికారులు తో మార్గమధ్యంలో ఆగుతూ చర్చించి వివిధ శాఖల ద్వారా చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి సూచనలు, సలహాలు అందించారు.
అనంతరం సి వి ఆనంద్ మాట్లాడుతూ....నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతవరణంలో జరిగేలా సుమారు 30 వేల మంది పోలీస్ సిబ్బంది భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఖైరతాబాద్, బాలాపూర్ విఘ్నేశ్వరుల శోభాయాత్ర సకాలంలో పూర్తి అయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అలాగే సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఏమైనా పెండింగ్ పనులు ఉంటే వెంటనే పూర్తి అయ్యేలా చూస్తామని అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ....గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 20 ప్రధాన లేక్ లతోపాటు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 72 కృత్రిమ కొలనులలో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశామన్నారు.నగరంలోని అన్ని ప్రధాన లేక్ లలో 134 స్థిర క్రేన్ లు, 259 మొబైల్ క్రేన్ లు ఏర్పాటు చేశామన్నారు. 56,187 టెంపరరీ లైట్లు ఏర్పాటు చేశామన్నారు.
హైడ్రా, పర్యాటకశాఖ సమన్వయంతో హుస్సేన్ సాగర్ లో 9 బోట్లను, డీఆర్ఎఫ్ టీం లను, 200 గత ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామన్నారు. పోలీసు సహకారంతో 13 కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశామన్నారు. ప్రధాన ఊరేగింపు మార్గంలో గణేష్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు సజావుగా జరిగేందుకు 160 గణేష్ యాక్షన్ టీం లను డిప్లాయ్ చేశామన్నారు.అలాగే వేడుకల్లో పారిశుద్ధ్యత కు పెద్దపీట వేసేలా 14,486 మంది శానిటేషన్ వర్కర్స్ ను మూడు షిఫ్టులలో రోజుకు 24 గంటలు పని చేస్తున్నారని కమిషనర్ తెలిపారు. ఈ నెల 2 వ తేదీ వరకు నగర వ్యాప్తంగా 1,21,905 గణేష్ ప్రతిమల నిమజ్జనం జరిగిందని 6 వ తేదీన సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అంచనా వేస్తున్నట్లు కమిషనర్ ఆర్ వి కర్ణన్ వివరించారు. ఆ దిశగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ శాఖల వారిగా చేపట్టిన ఏర్పాట్లను సమీక్షిస్తూ, హైదరాబాద్ జిల్లాలో సంబంధిత శాఖలను సమన్వయపరుస్తూ గణేష్ నిమజ్జనం సజావుగా జరిగేలా చూస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ సమస్యలు ప్రత్యేక దృష్టి పెట్టామని అలాగే ఒక ప్రణాళిక ప్రకారం జిహెచ్ఎంసి జిల్లా అధికారులు సమన్వయంతో కలిసి పని చేస్తున్నారని నిమజ్జన శోభా యాత్రకు భక్తులు, ప్రజలు పూర్తిగా సహకరించాలని అన్నారు.బాలాపూర్ గణేష్ నిమజ్జనం శోభాయాత్ర మార్గంను పరిశీలించే ముందు అధికారుల బృందం బాలాపూర్ గణేష్ ను దర్శించుకున్నారు.వీరికి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ నిరంజన్ రెడ్డి, కమిటీ సభ్యులు స్వాగతం పలికి స్వామి వారి కండువ , ప్రసాదం అందజేశారు.
బాలాపూర్ గణేష్ రూట్ మ్యాప్ ...
కట్ట మైసమ్మ దేవాలయం → కేశవగిరి → చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ → మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్ → ఇంజన్ బౌలి → అలియాబాద్ → నాగుల్చింత జంక్షన్ → హిమ్మత్‌పురా → చార్మినార్ → మదీనా ఎక్స్ రోడ్ → అఫ్జల్ గుంజ్ →ఎంజే మార్కెట్ → అబిడ్స్జీపీఓ →బీజేఆర్ విగ్రహం→ బషీర్‌బాగ్ చౌరస్తా → లిబర్టీ → అంబేద్కర్ విగ్రహం →హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్)
ఖైరతాబాద్ గణేష్ రూట్ మ్యాప్ ...
బడా గణేష్ → పాత పిఎస్ సైఫాబాద్ → ఇక్బాల్ మినార్ →తెలుగు తల్లి → అంబేద్కర్ విగ్రహం → హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్)






