కొత్త రేషన్​కార్డుదారులకు గుడ్ న్యూస్.. సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ షురూ

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో కొత్త రేషన్​కార్డులకు సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ షురూ అయ్యింది. ...

కొత్త రేషన్​కార్డుదారులకు గుడ్ న్యూస్.. సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్త రేషన్​కార్డులకు సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ షురూ అయ్యింది. ఈ నెల నుంచి 99,70,832 కార్డుల ద్వారా 3.20 కోట్ల మంది లబ్దిదారులకు 2.02 లక్షల మెట్రిక్​టన్నుల బియ్యం అందజేయనున్నారు. ఈనెల 15వ తేదీలోగా పాత కార్డులతో పాటు అదనంగా 10 లక్షల ఫ్యామిలీస్‌కు కొత్తగా బియ్యం పంపిణీ చేయనున్నారు.

జూలై, ఆగస్టులో కార్డులు పొందిన వారికి సన్నబియ్యం

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం జూన్​నెలలో మూడు నెలలకు సంబంధించిన సన్నబియ్యం పంపిణీ చేసింది. జులై, ఆగస్టులో కార్డులు మంజూరైన వారికి ఈ నెలలో బియ్యం​అందజేస్తుంది. కొత్త లబ్దిదారులు ఆన్‌లైన్​ద్వారా రేషన్​కార్డుల నంబర్​కలిగిన పత్రాలు జీరాక్స్​తీసుకొని డీలర్ల వద్దకు వెళ్తే కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా ఒకరికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నారు.

ఇచ్చిన హామీ మేరకు కొత్త కార్డులు మంజూరు

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే రేషన్‌కార్డుల ప్రక్రియకు అడుగులు వేసింది. ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకుంది. పేర్ల తొలగింపు, మార్పులు, చేర్పులు వాటికి సైతం అవకాశం కల్పించింది. దీని కోసం ఏడాదిన్నర సమయం పట్టింది. మొదటి విడతలో మంజురైన లబ్దిదారులకు జూన్ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం ప్రారంభించింది.

సీఎం విడుదల చేసిన తర్వాతే క్యారీ బ్యాగ్స్ పంపిణీ

ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు రేషన్​దుకాణాల ద్వారా ఆరు గ్యారెంటీలతో ముద్రించిన క్యారీ బ్యాగ్‌లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈనెల నుంచి లబ్దిదారులకు ఇవ్వాలని భావించారు. సీఎం రేవంత్​వాటిని అఫీషియల్‌గా రిలీజ్ చేసిన తర్వాత ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ పేర్కొంది. క్యారీబ్యాగ్‌లు ఇప్పటికే మండల పాయింట్స్‌కు తరలించారు. అక్కడి నుంచి కొందరు డీలర్లు దుకాణాలకు తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో సంచుల పంపిణీ జరగలేదు.

బీఆర్‌ఎస్​పాలనలో 49 వేల కార్డులు మంజూరు

గత బీఆర్ఎస్​హయాంలో 5.98 లక్షల కార్డులు తొలగించి, మొదటి ఏడాదిలో కొన్ని, ఉప ఎన్నికల టైంలో కలిపి మొత్తంగా 49,479 కార్డులు మాత్రమే మంజూరు చేసినట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. స్వరాష్ట్రం ఏర్పడే నాటికి 89.73 లక్షల కార్డులు ఉండగా 2.95 కోట్ల మంది లబ్దిదారులు రేషన్​సరుకులు పొందేవారు. తొలిసారిగా 2016లో 31,196 కార్డులు మంజూరు చేసిన అప్పటి ప్రభుత్వం 4.20 లక్షల కార్డులను తొలగించింది. 2017 నాటికి కార్డుల సంఖ్య 85.58 లక్షలకు చేరింది.

Next Story