ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించిన టీజీఈజేఏసీ

by Nallavelli.Anjaneyulu |

ఆర్టీసీ కార్మికుల తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న సమ్మెకు 206 సంఘాలతో కూడిన తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని టీజీఈజేఏసీ ప్రకటించింది.

ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించిన  టీజీఈజేఏసీ
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : ఆర్టీసీ కార్మికుల తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న సమ్మెకు 206 సంఘాలతో కూడిన తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని టీజీఈజేఏసీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం నాంపల్లి లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావులు మాట్లాడుతూ ప్రజా రవాణా విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమస్యల విషయంలో ప్రభుత్వం వెంటనే చొరవ చూపి, చర్చలు జరిపి పరిష్కరించాలని కోరారు. గత ఆరు సంవత్సరాలుగా వారికి వేతన సవరణ జరగకపోవడం బాధాకరమని, వారు కోరుతున్న ఇతర డిమాండ్లు కూడా న్యాయపరమైనవేనని అన్నారు.

వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన కోలా శంకర్ గౌడ్ సమస్యల పరిష్కారం కోసం ఆత్మహత్యకు పాల్పడడం పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి యావత్ ఉద్యోగుల పక్షాన ప్రగాడ సానుభూతి తెలుపుతున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులెవరు కూడా ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, టీజీఈజేఏసీలోని సుమారు 15.35 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మద్ధతు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు ముజీబ్ హుసేనీ, బీ శ్యాం, పీ దామోదర్ రెడ్డి, కస్తూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story