డీఈఈసెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-14 15:29:07  IST  )

తెలంగాణ డీఈఈసెట్-2025 స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ విడుదల అయింది...

డీఈఈసెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ డీఈఈసెట్-2025 స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను తెలంగాణ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్, డీఈఈసెట్ ఛైర్మన్ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 10 ప్రభుత్వ డైట్ కళాశాలలు, 63 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ డైట్ కళాశాలల్లో మొత్తం 1,400 సీట్లకు గాను 1,165 సీట్లు భర్తీ అయ్యాయి, ఇంకా 235 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేట్ డీఈఈసెట్ కాలేజీలల్లో కన్వీనర్ కోటా కింద 2,720 సీట్లకు గాను 2,141 సీట్లు భర్తీ అయ్యాయి, 579 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ డైట్, ప్రైవేట్ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో 412 సీట్లకు 95 భర్తీ అయ్యాయి, 317 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

మొత్తం 1131 సీట్లకు స్పాట్ అడ్మిషన్లు:

ఈడబ్ల్యూఎస్ సీట్లతో కలిపి ప్రభుత్వ డైట్, ప్రైవేట్ డీఈఈసెట్ కాలేజీల్లో మొత్తం 1,131 సీట్లు స్పాట్ అడ్మిషన్ల కోసం ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. కాలేజీ, కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు డీఈఈసెట్ వెబ్‌సైట్ లో ఆగస్టు 17న అందుబాటులో ఉంటాయని తెలిపారు. సంబంధిత ప్రభుత్వ డైట్, ప్రైవేట్ కాలేజీలు ఆగస్టు 18 న ప్రెస్ నోటిఫికేషన్ జారీ చేస్తాయి. అభ్యర్థులు రిపోర్టింగ్ చేయడం, సర్టిఫికెట్ల పరిశీలన, సీట్ల కేటాయింపు ప్రభుత్వ డైట్ కాలేజీల్లో ఆగస్టు 19 న, ప్రైవేట్ కాలేజీలల్లో ఆగస్టు 20 న ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఆగస్టు 21 న తమ కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ పొందిన అభ్యర్థుల జాబితాను ప్రభుత్వ డైట్ ప్రిన్సిపాల్‌కు ఆగస్టు 22, సాయంత్రం 6 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 25 న స్పాట్ అడ్మిషన్ జాబితా కన్వినర్ ఆమోదం పొందిన తర్వాత విద్యార్థులు ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు పొందుతారు.

స్పాట్ అడ్మిషన్లకు నిబంధనలు:

అభ్యర్థులు టీజీ డీఈఈసెట్-2025లో అర్హత సాధించి ఉండాలి. ఖాళీగా ఉన్న సీట్లను టీజీ డీఈఈసెట్-2025లో వచ్చిన మెరిట్ ఆధారంగా సంబంధిత కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేస్తారు. ఒకే కేటగిరీకి చెందిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, మార్గదర్శకాల ప్రకారం ఇతర కేటగిరీలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈడబ్ల్యూఎస్ ఖాళీ సీట్లను ఇతర కేటగిరీలకు మార్చరు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్ నిబంధనలు పాటించాలి. స్పాట్ అడ్మిషన్లు సంబంధిత కాలేజీలల్లో మాత్రమే జరుగుతాయి. ఇప్పటికే ఏదైనా కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న అభ్యర్థులు స్పాట్ అడ్మిషన్లకు అర్హులు కారు. స్పాట్ అడ్మిషన్ ద్వారా ప్రవేశం పొందిన అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు. స్పాట్ అడ్మిషన్లకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర సంబంధిత పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలి.

Next Story