Talasani Srinivas Yadav : కార్పొరేటర్ల అరెస్ట్ పై తలసాని ఫైర్

by Muthe.Rajitha |   (  Updated:2025-01-30 12:37:48  IST  )

గురువారం జరిగిన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం(GHMC General Meeting)లో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

Talasani Srinivas Yadav : కార్పొరేటర్ల అరెస్ట్ పై తలసాని ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : గురువారం జరిగిన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం(GHMC General Meeting)లో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్‌(Hyderabad)కు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) కార్పొరేటర్లు పట్టుబట్టడంతో.. సభలో కాంగ్రెస్, ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విపక్ష కార్పొరేటర్స్ ను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్(Talasani Sriniavas Yadav) తీవ్రంగా స్పందించారు. కార్పొరేటర్ ల అరెస్ట్ ప్రజాస్వామ్య విరుద్ధమనీ ఆయన మండిపడ్డారు. అరెస్టయిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో ఆయన పరామర్శించారు. ప్రశ్నించిన కారణంగానే తమ కార్పొరేటర్ లను అక్రమంగా అరెస్ట్ చేశారని, మెజార్టీ సభ్యులుగా ఉన్న తమ పార్టీ కార్పొరేటర్ లు లేకుండా బడ్జెట్ ను ఆమోదించడం దుర్మార్గం అన్నారు. ఎలాంటి చర్చ జరగకుండా బడ్జెట్ ఆమోదించడం సరికాదని పేర్కొన్నారు. BRS ప్రభుత్వం హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారిందని దుయ్యబట్టారు. నగరంలోని ప్రజలు సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ వైఖరిపై ప్రజాస్వామ్యయుతంగా ప్రజాక్షేత్రంలో పోరాడతామనీ తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

మేయర్ రాజీనామా చేయాలంటూ విపక్షాల పట్టు..

గురువారం జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్‌కు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు పట్టుబట్టడమే కాకుండా.. మేయర్ విజయలక్ష్మి(Mayor Vijayalakshmi)రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభ్యుల అరుపులు, కేకలతో సమావేశంలో గందరగోళం నెలకొంది. బడ్జెట్‌పై మాట్లాడాలని మేయర్ విజయలక్ష్మి చెప్పినా సభ్యులు వినలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. మేయర్ రాజీనామా చేయాలంటూ ఆమె పోడియంను చుట్టుముట్టారు. గ్రేటర్‌పై ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ విపక్ష కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల గ్రూపుల మధ్య తోపులాట జరిగింది. మాటామాట పెరిగింది. కాంగ్రెస్ హామీలపై జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ నిలదీశారు. వెంకటేశ్ చేతిలో ఉన్న ప్లకార్డులను కాంగ్రెస్ కార్పొరేటర్లు లాక్కుని చించివేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ సభ్యులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ నుంచి కార్పొరేటర్లను బయటకు పంపించారు. మార్షల్ ద్వారా వాళ్లను జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి బయటకు పంపారు. ఈ క్రమంలో మరింత ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోవడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Next Story