- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీని" ఫార్మా ఆక్రమణలను తొలగించేది ఎవరు?
గోల్డెన్ ఫారెస్ట్ భూములను బడా నేతలు ఆక్రమించుకున్నారు. ఈ విషయాన్ని ప్రస్తుత రెవెన్యూ అధికారులే ధృవీకరించారు.

దిశ,చౌటుప్పల్ : కోట్ల విలువైన గోల్డెన్ ఫారెస్ట్ భూములపై బడా నేతల కన్నుపడి ఆ భూములను కొల్లగొట్టేందుకు పక్కా ప్రణాళికలు రచించారు. ఈ ప్రణాళికలకు రెవెన్యూ అధికారులు కూడా పూర్తిగా సహకరించడంతో ఇప్పుడు గోల్డెన్ ఫారెస్ట్ భూములు కొన్ని ఆక్రమణలో ఉన్నట్లు స్వయంగా ప్రస్తుత రెవెన్యూ అధికారులే ధ్రువీకరించారు. అసలు గోల్డెన్ ఫారెస్ట్ భూముల లావాదేవీలను నిషేధించిన వాటిని అడ్డదారిలో బడా బాబులకు రెవెన్యూ అధికారుల సహకారంతో కట్టబెట్టారు. స్వయంగా సుప్రీంకోర్టులో కేసు ఉన్న సదరు భూముల నిషేధాన్ని రెవెన్యూ అధికారులు ఏమాత్రం ఖాతరు చేయకుండా సామాన్యులు పెట్టుబడి పెట్టిన గోల్డెన్ ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతం అయ్యేందుకు పూర్తిగా సహకరించడం పట్ల రెవెన్యూ అధికారులకు భారీగానే ముడుపులు అందినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని వివిధ రెవెన్యూ గ్రామాలలో ఉన్న గోల్డెన్ ఫారెస్ట్ భూములలో లావాదేవీలు జరపడంతో రెవెన్యూ అధికారులు భారీగానే కూడబెట్టుకున్నట్లు సమాచారం. గోల్డెన్ ఫారెస్ట్ భూములు వెయ్యి ఎకరాలకు పైగా ఉండడం వాటిని ఇతరులు ఆక్రమించడం సదరు ఆక్రమణలు తొలగించకుండా ఉండేందుకు రెవెన్యూ అధికారులకు ఒక ఆదాయ వనరుగా మారిందనే ఆరోపణలకు బలం చేకూరుస్తూ వస్తుంది. చౌటుప్పల్ లింగోజిగూడెం రెవెన్యూ పరిధిలోని శ్రీని ఫార్మా పరిశ్రమ సుమారు 30 ఎకరాలకు పైగా గోల్డెన్ ఫారెస్ట్ భూముల్లోనే ఆక్రమణలో ఉన్నట్లు రెవిన్యూ అధికారులు తేల్చి చర్యలు చేపట్టడంలో వెనుకాడుతున్నారు.
వ్యర్థాల శుద్ధి కేంద్రం గోల్డెన్ ఫారెస్ట్ భూముల్లోనే..
శ్రీని ఫార్మా పరిశ్రమ వ్యర్థాల శుద్ధి కేంద్రం ( ఈటీపీ ప్లాంట్ ) గోల్డెన్ ఫారెస్ట్ భూముల్లోనే నిర్మించినట్లు తెలుస్తుంది. సదరు వ్యర్థాల శుద్ధి కేంద్రం గోల్డెన్ ఫారెస్ట్ భూముల్లో ఏర్పాటు చేయడంతో భూమి పూర్తిగా కాలుష్యంగా మారే అవకాశం కూడా లేకపోలేదు వ్యవసాయ భూమిగా ఉన్న గోల్డెన్ ఫారెస్ట్ భూముల లావాదేవీలను సుప్రీంకోర్టు పూర్తిగా నిషేధించిన గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ కు చెందిన అధికారిక వ్యక్తితో శ్రీని ఫార్మా పరిశ్రమ ఎలా రిజిస్ట్రేషన్ చేస్తుందో నేటికీ అర్థం కావడం లేదు. సదరు వ్యక్తి చేసిన రిజిస్టర్ డాక్యుమెంట్ కు చట్టబద్ధత ఎంత అనే సందేహం కలుగుతుంది. అప్పటికే గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ కు చెందిన సభ్యులను ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని కారణంతో అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. అంతేకాకుండా అందులో పెట్టుబడి పెట్టిన డిపాజిట్ దారులంతా కోర్టులను ఆశ్రయించడంతో గోల్డెన్ ఫారెస్ట్ భూముల రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిషేధించబడ్డాయి. అయినా కూడా కొందరు రిజిస్ట్రేషన్లు చేసుకొని సదరు డాక్యుమెంట్లతో రెవెన్యూ రికార్డులలో నమోదు చేయించుకున్నారు.
సహకరించిన రెవెన్యూ అధికారులు ఎవరు?
గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ అధికారిక వ్యక్తితో భూములను రిజిస్ట్రేషన్ శ్రీని ఫార్మా పరిశ్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుంది. అయితే అప్పటికి సదరు భూముల లావాదేవీల పై నిషేధం ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఎలా రిజిస్ట్రేషన్ చేశారో అర్థం కావడం లేదు. అయితే ఇదంతా బాగానే ఉన్నా అసలు గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ భూములను శ్రీని ఫార్మా పరిశ్రమకు అమ్మాక రెవెన్యూ రికార్డులలో నమోదు చేసేందుకు అధికారులు ఎలా సహకరించారు అర్థం కావడం లేదు. అంతేకాదు సదరు భూములను వ్యవసాయేతర భూములుగా మారుస్తూ ప్రొసీడింగ్ లను ఇవ్వడానికి అధికారులకు భారీగానే ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సామాన్యులు న్యాయం కోసం సుప్రీంకోర్టులను ఆశ్రయించి కోర్టులలో కొట్లాడుతుండగా రెవెన్యూ అధికారులు బడా బాబుల తాయిలాలకు ఆశపడి దొడ్డి దారిన సహకరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోల్డెన్ ఫారెస్ట్ భూముల కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న రెవెన్యూ అధికారులు అవన్నీ తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం చూస్తే కోర్టుల పట్ల వారికి ఉన్న గౌరవం ఇట్టే తెలిసిపోతుంది. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రెవెన్యూ అధికారుల తీరు మారకపోతే సామాన్యులు ఇక ఎవరిని ఆశ్రయించాలో అర్థం కావడం లేదు.
కలెక్టర్ చర్యలు తీసుకునేనా!
చౌటుప్పల్ మండల పరిధిలోని గోల్డెన్ ఫారెస్ట్ భూముల్లో జరిగిన అవకతవకలపై సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు నూతన కలెక్టర్ చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. కోట్ల విలువ చేసే గోల్డెన్ ఫారెస్ట్ భూములను దొడ్డి దారిలో కాజేసేందుకు సహకారం అందించిన రెవెన్యూ అధికారుల పాత్రపై కూడా జిల్లా కలెక్టర్ నిష్పక్షపాత విచారణ జరిపించి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది. గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ భూముల లావాదేవీలతో రెవెన్యూ అధికారులతో పాటు బడా బాబులు కూడా కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.సామాన్య రైతులు పనుల కోసం రెవెన్యూ కార్యాలయం వద్దకు వస్తే చిన్నచిన్న కొర్రీలు పెట్టి ఏండ్లుగా తిప్పుతున్నారు. కాని సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న భూముల లావాదేవీలకు ఎలాంటి జంకు లేకుండా సహకరిస్తున్న రెవెన్యూ అధికారులపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోరనే డిమాండ్ ప్రజల్లో బలంగా వినిపిస్తుంది.






